గుంటూరు: కస్టమ్స్, సెంట్రల్ ఎక్ససైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగిగా, విరామం ఎరుగని సాహిత్యాభిలాషిగా లంకా సూర్యనారాయణ జీవన దృక్పధం ఆదర్శనీయమని అఖిల బారత సెంట్రల్ ఎక్ససైజ్ పెన్షనర్ల సంఘం అధ్యక్షకార్యదర్సులు టి. వివేకానంద, గద్దె తిలక్ పేర్కొన్నారు. లంకా సూర్యనారాయణ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి జీవన సాఫల్య పురస్కారం అందుకున్న సందర్బంగా.. గుంటూరు కన్నవారితోటలోని జి.ఎస్.టి భవన్ లో సెంట్రల్ ఎక్ససైజ్ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో లంకా సూర్యనారాయణను ఆదివారం ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా సంఘ నాయకులు వివేకానంద, గద్దె తిలక్ మాట్లాడుతూ.. లంకా సూర్యనారాయణ చిన్ననాటి నుండే పుస్తకాలు కొని చదవటమే కాకుండా, వాటిని భద్రపరచి, అసాధారణ రీతిలో ఎన్నెన్నో పుస్తకాలు సేకరించి అవి అందరికి అందేలా అన్నమయ్య పేరుతో గ్రంధాలయాన్ని ఏర్పాటుచేయడం అభినందించదగ్గ విషయమన్నారు. రాష్టంలో ప్రతిష్ట్రాత్మకమైన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇచ్చిన పురస్కారం లంకా అపారశ్రమ కు దక్కిన గౌరవమన్నారు. పుస్తక రంగంలో సూర్యనారాయణ చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన విజయాలు పెన్షనర్లందరకి గర్వకారణమన్నారు.
జిఎస్టి రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ జి. జయప్రకాష్ మాట్లాడుతూ…ఉద్యోగి గా శాఖ పరిపుష్టి కి, సాహిత్యాభిలాషిగా కళల పురోభివృద్ధికి సూర్యనారాయణ చేసిన సేవలు సాటిలేనివన్నారు. ఉద్యోగం ద్వారా వచ్చిన తన జీతం మొత్తాన్ని పుస్తకాలకే ఖర్చు చేయడం, తొంబై వయసులో నేటికీ పుస్తక సేకరణ కొనసాగించడం సూర్యనారాయణ నిబద్దతకు నిదర్శనమన్నారు. లంకా చూపిన మార్గం భవిష్యత్ తరాలకు వరమన్నారు. కస్టమ్స్ విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ కె రాజారావు మాట్లాడుతూ.. అన్నమయ్య గ్రంధాలయ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి, గుంటూరు కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి సూర్యనారాయణ అని ప్రశంసించారు.
అపూర్వమైన దూరదృష్టి, అపారమైన సృజనాత్మకత, అద్భుతమైన క్రమశిక్షణ, అసమానమైన ప్రతిభ సూర్యనారాయణ ఆభరణాలన్నారు. లంకా జీవితం నిత్య స్ఫూర్తి, మార్గదర్శనమన్నారు. సన్మాన గ్రహీత లంకా సూర్యనారాయణ మాట్లాడుతూ..సమాజంలో తనకు మంచి గౌరవం, గుర్తింపును సెంట్రల్ ఎక్ససైజ్ శాఖ ఇచ్చిందన్నారు. ఉద్యోగి గా ఎన్నో మైలురాళ్లు అధికమించి, పుస్తక సేకరణ కర్తగా ఎన్నో గౌరవాలు దక్కించుకున్నానన్నారు. హాబీగా చేపట్టిన పుస్తక సేకరణకు ప్రభుత్వ అవార్డులు, పురస్కారాలు లభిస్తాయని ఊహించలేదన్నారు. పుస్తక సేకరణలో ఎదురైనా ఇబ్బందులు, అనుభవాలను ఆయన వివరించారు. అనంతరం లంకా సూర్యనారాయణను విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున సన్మానించారు. కార్యక్రమంలో పి.వి. సత్యనారాయణ, గుమ్మడి సీతారామయ్యచౌదరి, పి. కోటేశ్వరరావు, ఎన్.ఎస్. నగేష్ బాబు, కేశవన్, టి.ఎన్. వరప్రసాద్, మస్తాన్, నాగశంకర్, నందకుమార్, శాస్త్రి, ఈశ్వరమ్మ, ఆషా, భానుమతి, మేరీ, అలివేలు తదితర పెన్షనర్లు పాల్గొన్నారు.

