– ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన మహనీయుడు
– రైతులను ఒప్పించి చేపల చెరువులను తవ్వించింది ఆయనే
– లంక గ్రామాల ప్రజల మనస్సుల్లో నేటికీ సుస్థిర స్థానం
– కైకలూరు అసెంబ్లీపైనా దివంగత పిన్నమనేని ప్రభావం
– టీడీపీ నుండి పోటీకి సిద్ధమవుతున్న పిన్నమనేని కుటుంబం
– గెలుపు దిశగా మారుతూ వస్తున్న కైకలూరు టీడీపీ రాజకీయం
కైకలూరు /గుడివాడ, మార్చి 8: కొల్లేరు రైతుల మదిలో ఇప్పుడు దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు పేరు మార్మోగుతోంది. దీనికి కారణం ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పిన్నమనేని కుటుంబం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి దిగుతుండడమేనని తెలుస్తోంది. దీంతో కైకలూరు అసెంబ్లీ పరిధిలోని కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాలపై దివంగత పిన్నమనేని ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది.
ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో ఉన్న చిత్తడి నేలల్లో దాదాపు 1.20 లక్షల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. దీని పరిధిలో 122 లంక గ్రామాల్లో దాదాపు మూడు లక్షల మంది నివశిస్తున్నారు. ఆకివీడు, నిడమర్రు, భీమడోలు, ఉంగుటూరు, పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల పరిధిలోని 20 బెడ్ గ్రామాలు సరస్సు లోపల, 63 బెల్ట్ గ్రామాలు సరస్సును ఆనుకుని ఉన్నాయి.
కైకలూరు, మండవల్లి మండలాల పరిధిలోని 26 బెడ్, 13 బెల్ట్ గ్రామాలు కొల్లేరు పరిధిలో విస్తరించి ఉన్నాయి. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి చిన్నా, పెద్దా ఏరుల నుండి కొల్లేరుకు నీరు వచ్చి చేరుతుంది. కొల్లేరు ప్రాంతమంతా ఒకప్పుడు వ్యవసాయంతో సందడిగా ఉండేది. 1969లో వచ్చిన తుఫాను తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముంపు, కాలుష్యం పెరగడంతో వ్యవసాయం ముందుకు సాగక కొల్లేరు వాసులు వలసలు పోవాల్సి వచ్చింది. అప్పటి ప్రభుత్వం కూడా కొల్లేరులో వ్యవసాయం వీలుకాదని నిర్ధారించింది.
ఈ పరిస్థితుల్లో కొల్లేరు ముంపు సమస్యకు చేపల, రొయ్యల చెరువులను తవ్వడం ద్వారా ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసుకోవడమే ప్రత్యామ్నాయ మార్గమని దివంగత పిన్నమనేని గ్రహించారు. అప్పట్లో వ్యవసాయం సాగుచేసే రైతులకు చేపల, రొయ్యల సాగుపై అంతగా అవగాహన ఉండేది కాదు. దివంగత పిన్నమనేని స్వయంగా కొల్లేరు లంక గ్రామాల్లో పర్యటించడమే పనిగా పెట్టుకున్నారు. చెరువులు తవ్వేందుకు రైతులను ఒప్పించే పనిలో నిత్యం బిజీగా గడిపారు.
ముంపు కారణంగా నష్టపోయి వ్యవసాయానికి దూరమైన రైతులతో కూడా చేపల, రొయ్యల చెరువులను తవ్వించారు. మరోవైపు కొల్లేరులో ముంపు సమస్యను దివంగత పిన్నమనేని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో 1976లో జలగం వెంగళరావు ప్రభుత్వం జీవో 118 ద్వారా చేపల చెరువుల తవ్వకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
136 సొసైటీలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా చేపల సాగు ఊపందుకుంది. 1990 నాటికి ఈ సాగు మరింత జోరందుకుంది. ఇతర ప్రాంతాలకు చెందిన చేపల, రొయ్యల వ్యాపారులు రంగప్రవేశం చేశారు. సొసైటీలకు ఆదాయం పెరగడంతో కొల్లేరు లంకవాసుల జీవనానికి ఢాకా లేని పరిస్థితి ఏర్పడింది. అలా కొల్లేరు ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన దివంగత పిన్నమనేని కొల్లేరు ప్రాంత, లంక గ్రామాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందగలిగారు.
ఈ కారణంగానే దివంగత పిన్నమనేని రెండుసార్లు, ఆయన కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు మూడుసార్లు ముదినేపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. దీంతో పాటు దివంగత పిన్నమనేని 30ఏళ్ళు జడ్పీ చైర్మన్ గా కృష్ణాజిల్లా పరిషత్ రాజకీయాలను శాసించారు. 2004లో మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పిన్నమనేని వెంకటేశ్వరరావు రాష్ట్ర మంత్రిగా, ఆ తర్వాత ఆప్కాబ్ చైర్మన్ గా బాధ్యతలను నిర్వర్తించడం జరిగింది.
నియోజకవర్గాల పునర్విభజనతో ముదినేపల్లి అసెంబ్లీ రద్దయింది. కైకలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ రాజీనామా చేయడంతో 14ఏళ్ళ నిరీక్షణ తర్వాత పిన్నమనేని కుటుంబం తిరిగి ప్రత్యక్ష రాజకీయాలపై దృష్టి పెట్టింది. పిన్నమనేని కుటుంబం నుండి మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత పిన్నమనేని బాబ్జిలలో ఎవరికి సీటు ఇచ్చినా కైకలూరు నుండి పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.
గత ఐదు దశాబ్దాలుగా పిన్నమనేని కుటుంబం ప్రజాసేవ చేస్తూ వస్తోంది. దివంగత పిన్నమనేని కొల్లేరు ప్రాంత, లంక గ్రామాల ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో కైకలూరు అసెంబ్లీ నుండి టీడీపీ తరఫున పిన్నమనేని కుటుంబం పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం ఖచ్చితమనే సంకేతాలు వినవస్తున్నాయి.