– మా నియోజకవర్గంలో మేము గెలుస్తాము అనే నమ్మకం నాకు కల్పించాల్సింది మీరే!
– వైసీపీ పెద్దలే విశాఖను మింగేశారు…. సేవ్ ఉత్తరాంధ్ర మన స్లోగన్.
– నియోజకవర్గ ఇంచార్జ్ లు, ముఖ్యనేతల సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబు
రాష్ట్రంలో ముందే ఎన్నికలు వస్తాయి అనే ఆలోచనతోనే నేతలు పనిచెయ్యాలని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. మేము గెలుస్తాము అనే నమ్మకాన్ని నేతలే తనకు కల్పించాలని చంద్రబాబు అన్నారు.తమ పనితీరు ద్వారా తాము గెలిచే అభ్యర్థులు అని వారు ప్రూవ్ చేసుకోవాలని.. లేకపోతే భిన్నమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లు, ముఖ్యనేతలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు మాట్లాడారు.పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ వంటి అంశాలపై నివేదికల ఆధారంగా రివ్యూ చేశారు. ఈ అంశాల్లో వెనుకబడి ఉన్న నేతలను స్పీడు పెంచాలని గట్టిగా సూచించారు.
రాష్ట్రంలో వైసిపి పాలనతో నష్టపోని వర్గం అంటూ లేదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు జగన్ పాలనతో విసిగిపోయారని చంద్రబాబు అన్నారు. ఈ ప్రజా వ్యతిరేకతను పార్టీ అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. ప్రతి అంశంలో అసత్య ప్రచారాన్నే ఇప్పటికీ వైసిపి నమ్ముకుందని….దాన్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించే నేతల లెక్కలు కూడా తన వద్ద ఉన్నాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు అంటూ జగన్ మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. విశాఖను మింగేసి…. ఉత్తరాంధ్రను కబళిలిస్తున్న వైసిపి మూకకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు.
విశాఖను కొల్లగొట్టి… కంపెనీలను వెళ్లగొట్టిన వాళ్లు అక్కడి ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు.సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు మనం నిలబడాలని చంద్రబాబు అన్నారు. విశాఖలో వేల ఎకరాలను, వేల కోట్ల ఆస్తులను వైసిపి గద్దలు చెరబడుతున్న వైనాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.మూడు రాజధానులు సాధ్యం కాదని కోర్టులు స్పష్టంగా చెపుతున్నా… ఉత్తరాంధ్ర, రాయలసీమలలో రాజధానులు అంటూ జగన్ జనాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. సాగునీటి రంగంలో ఎవరిహయాంలో ఎక్కువ మేలు జరిగిందో ఈఎన్సి నారాయణ రెడ్డి మీడియా సమావేశం ద్వారానే స్పష్టంగా తెలిసిపోయిందని….దీనికి వైసిపి మంత్రులు ఏం సమాధానం చెపుతారని చంద్రబాబు ప్రశ్నించారు.
సినీ నటులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షో పైనా సమావేశంలో చర్చకు వచ్చింది. బోల్డ్ గా ఉండే బాలకృష్ణ శైలి కారణంగా ఆ షో అంత హిట్ అయ్యిందని చంద్రబాబు అన్నారు. తాను ఆ షో ఇంటర్వ్యూకి హాజరు అయ్యానని చంద్రబాబు తెలిపారు.నాడు అధికార మార్పిడి విషయంలో వాస్తవంగా జరిగింది ఏంటి అనేది ఆ షోలో చర్చకు వచ్చిందని చంద్రబాబు అన్నారు. దశాబ్దాలుగా తనపై బురదవేస్తున్న అంశంలో తాను ఓపెన్ గా పలు విషయాలు చెప్పానని చంద్రబాబు తెలిపారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత తీవ్రంగా నష్టపోయారని… వారంతా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులకు ఓటు వేసేలా చూడాలని నేతలకు సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ను గెలిపించేందుకు ఇంచార్జ్ లు గట్టిగా పనిచెయ్యాలని చంద్రబాబు సూచించారు.