- ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాసమస్యలను పట్టించుకోని నాయకులు
- కూటమి ప్రభుత్వంలో “ప్రజాదర్బార్” ద్వారా తొలినుంచీ అండగా నిలుస్తున్న మంత్రి నారా లోకేష్
- 21వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజల నుంచి విన్నపాల వెల్లువ
- సత్వర పరిష్కారానికి మంత్రి భరోసాతో హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు
అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ఓ ఒక్కరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే ఎదురవుతున్నాయి. విధ్వంస పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించక ప్రజలు ఎంతో ఆవేదన చెందారు. కూటమి ప్రభుత్వం రాగానే “ప్రజాదర్బార్” ద్వారా తొలినుంచీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ వారికి అండగా నిలుస్తున్నారు.
ఉండవల్లిలోని నివాసంలో 21వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. తమ భూములు కబ్జాకు గురయ్యాయని, ఏ ఆధారం లేని తమకు శాశ్వత నివాసం కల్పించాలని, గత ప్రభుత్వంలో అర్హత ఉన్నా వృద్ధాప్య, వితంతు, వికలాంగ, పెన్షన్ తొలగించారని, అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని, వివిధ వృత్తి, వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు మంత్రిని కలిసి విన్నవించారు. సమస్యల సత్వర పరిష్కారానికి నారా లోకేష్ భరోసా ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులోని శ్రీనివాస కాలనీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నారా లోకేష్ ను కలిశారు. 25 ఏళ్ల క్రితం ఉడా ఆమోదం పొందిన లే అవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేశామని, తమ లే అవుట్ లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నామని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రికి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లికి చెందిన ఎస్.నవ్య భారతి మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
భర్త చనిపోయిన తనకు వితంతు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెంకు చెందిన మండ్రు కుమారి మంత్రిని కలిసి కోరారు.
నిరుపేదలం అయిన తమకు సొంతిల్లు లేదని, టిడ్కో ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లికి చెందిన బి.జయలక్ష్మి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం, వి.తిమ్మాపురానికి చెందిన తుమ్మలపల్లి లక్ష్మన్న లోకేష్ ను కలిశారు. తమ కూతురు గ్రామంలోనే 4వ తరగతి పూర్తిచేసిందని, పైచదువుల కోసం ఆర్థిక పరిస్థితి సహకరించనందున గురుకుల పాఠశాలలో 5వ తరగతి సీటు కల్పించాలని కోరారు.
ప్రకాశం జిల్లా ఎనికపాడుకు చెందిన జి.శ్రీనివాసరావు మంత్రిని కలిశారు. కుటుంబంతో సహా శ్రీశైలం తీర్థయాత్రకు వెళ్లగా.. తమ ఇంట్లో బంగారం, నగదు అపహరించారని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని వాపోయారు. తమ సమస్యను పరిష్కరించేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వైసీపీ హయాంలో మాజీ హోంగార్డులకు తీవ్ర అన్యాయం జరిగిందని, మాజీ హోంగార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలనే హైకోర్టు ఆదేశాలను అమలుచేయాలంటూ ఏపీఈహెచ్ అసోసియేషన్ ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి కోరారు.
రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న సీఆర్టీ, పీజీటీ పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ టీచర్లుగా గుర్తించాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
గంజాయి మత్తులో తమ 16 ఏళ్ల కుమారుడిని హత్య చేశారని, నిందితులను శిక్షించడంతో పాటు ఏ ఆధారం లేని తమకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా రామగోపాలపురానికి చెందిన అజ్మీర లక్ష్మణ్ కోరారు.
2016-18 మధ్య పీజీ పూర్తిచేసిన తనకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందక సర్టిఫికెట్లు కాలేజీలోనే నిలిచిపోయాయని, సర్టిఫికెట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ వాంబే కాలనీకి చెందిన కె.మాధవి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లిలో తమ అరెకరం పొలాన్ని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు కబ్జా చేశారని, కబ్జాదారులపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వాసిరెడ్డి సూర్యప్రసాద్ నారా లోకేష్ ను కలిసి కోరారు.
వృద్ధాప్యంలో ఉన్న తాము చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అద్దెఇంట్లో ఉంటున్న తమకు శాశ్వత నివాస వసతి కల్పించి ఆదుకోవాలని విజయవాడకు చెందిన ఎమ్.శాఖిరి అనే మహిళ విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.