– ఎంపీ విజయసాయి రెడ్డి
జూలై 28: టీడీపీ పార్టీలో నాయకత్వ పక్షవాతం నెలకొందని, వారి నిర్ణయాల్లో అస్పష్టత, విశ్వాస లోపం స్పష్టంగా కనిపిస్తోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ఆయన పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. టీడీడీ వ్యవహారశైలి రెండు ముక్కల్లో చెప్పాలంటే వారు ఏమి ఆలోచిస్తారో అది చేయరు. ఏమి చేస్తారో అది ఆలోచించకుండా చేస్తారని అన్నారు. తేదేపా ఎన్డీఏ లో చేరాలనుకుంటున్నప్పటికీ అస్పష్టత, విశ్వాస లోపంతో ఎటూ తేల్చుకోలేకపోతోందని అన్నారు.
ప్రాజక్టుల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదు
ప్రాజెక్టుల దగ్గరే నిద్రపోయా అని చంద్రబాబు చెబుతున్న అవుకు, తోటపల్లి రిజర్వాయర్ల ఆధునీకరణ పనులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మొదలయ్యాయని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. అనంతరం 2019లో జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే 4 టిఎంసీల అవుకు జలాశయం పూర్తయిందని తెలిపారు. మధ్యలో బాబు చేసింది కేవలం పనుల కొనసాగింపేనని అన్నారు. మదనపల్లె బహుదా మైనర్ ప్రాజెక్ట్ 1978లోనే పూర్తయిందని చెప్పారు. చంద్రబాబు నిద్రపోయింది ఏ ప్రాజెక్టు వద్దో ఆయనకే తెలియాలని అన్నారు.
యాంకర్ గళంపై ఆధారపడ్డ యువగళం
తాను చేపట్టిన యువగళంకి స్పందన కరువవ్వడంతో తేదేపా యువనేత లోకేష్ యాంకర్ గళాన్ని జోడించాడని విజయసాయి రెడ్డి అన్నారు. ఎవరూ గాలానికి చిక్కడం లేదని ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని పగటి కలలు కన్నా ప్రయోజనం మాత్రం శూన్యమని చంద్రబాబు తెలుసుకోవాలని అన్నారు.