ముస్లిం మత పెద్దల కృతజ్ఞతలు
కులమతాలకు అతీతంగా అందరివాడుగా గుర్తింపు పొందిన శాసనమండలి సభ్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి – మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారని ముస్లిం మత పెద్దలు కొనియాడారు. ఆయనను గుంటూరులో హిందూ–ముస్లింల ఐక్యతకు బ్రాండ్ అంబాసిడర్‌గా అభివర్ణించారు.
స్వాతంత్య్రానికి పూర్వమే గుంటూరులో నిర్మించిన చారిత్రక కట్టడమైన జిన్నా టవర్ పేరు మార్చాలనీ… లేదంటే తామే కూలుస్తామనీ… గురువారం బీజేపీ నేతలు మూకుమ్మడిగా విధ్వేష విషం చిమ్మడంపై లేళ్ళ అప్పిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే దేశభక్తి గురించి జాతిపిత గాంధీని చంపిన గాడ్సేను పూజించే బీజేపీ నాయకులు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని కూడా ఆయన దుయ్యబట్టారు. మత ఘర్షణలు సృష్టించడం ద్వారా తమ ఉనికి చాటుకోవాలని యత్నిస్తే చైతన్యవంతులైన తెలుగు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంటారని సైతం లేళ్ళ అప్పిరెడ్డి హెచ్చరించారు.
ఈ నేపధ్యంలో శుక్రవారం గుంటూరులోని ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అధికార దాహం ముసుగులో బీజేపీ నేతల మతోన్మాదానికి ఆదిలోనే అడ్డుకట్ట వేసిన అప్పిరెడ్డిని వారు మనస్పూర్తిగా అభినందించారు. సున్నితమైన ఈ అంశంలో చొరవచూపి ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా చూసిన లౌకికవాదిగా వారు అప్పిరెడ్డిని ప్రశంసించారు.
అనంతరం లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సమానంగా అందుతున్నాయని తెలిపారు. జగన్ నాయకత్వంలోని ఈ రాష్ట్రంలో కులం పేరిట కుంపట్లు, మతం పేరిట మారణహోమాలకు అసలు చోటే లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మతోన్మాదుల ఆటలు సాగనివ్వమని అప్పిరెడ్డి హెచ్చరించారు.
లేళ్ళ అప్పిరెడ్డిని కలిసిన వారిలో ముస్లిం మత పెద్దలు హఫీజ్ అబ్బాస్, హఫీజ్ ఉస్మాన్, హఫీజ్ ఫయాజ్, హఫీజ్ ఇర్షాద్, షాదీఖానా కమిటీ ప్రతినిధులు ఫరియాజ్, నజీర్, రోషన్, షఫి, సుభాని, గౌస్ తదితరులు ఉన్నారు.