Suryaa.co.in

Features

మరణించిన తర్వాత కూడా జీవిద్దాం

– అవయవ దానంతో ఆయువు
( డాక్టర్ ఎం.వి. రమణయ్య, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు )

మరణించిన తర్వాత కూడా జీవించగలిగే దానమే అవయవ దానం. 1954లో విజయవంతమైన మొదటి అవయవ మార్పిడిని పురస్కరించుకుని అవయవ దాన ప్రాధాన్యతను గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచ అవయవ దాన దినోత్సవం ప్రారంభించబడింది. అవయవ దానం, అవయవ మార్పిడి ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియపరిచే విధంగా ఆగస్టు 13న ప్రపంచంలోని అనేక దేశాలు ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

మన దేశం మాత్రం ఆగస్టు 3న అవయవ దాన కార్యక్రమాన్ని జరుపుకుంటుంది. భారతదేశంలో 1994 ఆగస్టు 3న విజయవంతంగా జరిగిన మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స గుర్తుగా ఆగస్ట్‌ 3వ తేదీని జాతీయ అవయవ దాన దినోత్సవంగా మన దేశంలో జరుపుకుంటున్నాం. ఈ సంచలనాత్మక శస్త్రచికిత్సలో బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తి కుటుంబం దానం చేసిన గుండె మరొక వ్యక్తి జీవితాన్ని కాపాడింది. ఈ తేదీ భారతదేశ అవయవ మార్పిడి ప్రయాణంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.

అవయవ దాన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడం, అవయవ దానం చేయడంపై ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించి అవయవ దానాన్ని మరింత ప్రోత్సహించడం, అవయవ దాతలకు కృతజ్ఞతలు చెప్పడమన్నది ఈ సందర్భం ముఖ్య ఉద్దేశ్యం.

అవయవ దానం అనేది ప్రాణాలను రక్షించే ప్రక్రియ. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారత దేశంలో దాదాపుగా మూడు లక్షల మంది అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు. అవయవాల అందుబాటు, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా లేదు. ఫలితంగా ప్రతి రోజు 20 మంది రోగులు అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తూ మరణిస్తున్నారు.

మన దేశంలో 2013లో 4990 మందికి అవయవ మార్పిడి జరగ్గా, 2022లో ఈ సంఖ్య 15,561కి పెరిగింది. ఈ పదేళ్లలో అవయవ దానం రేటు నాలుగు రెట్లు పెరిగింది. అంచనాల ప్రకారం దేశంలో కోటి మందికి గాను 0.65 అవయవ దానాలు మాత్రమే జరుగుతున్నాయి. అత్యధిక జనాభా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ రెండవ స్థానంలో ఉన్నప్పటికీ మన దేశంలో కేవలం 0.1 శాతం మంది మాత్రమే అవయవ దానం చేయడానికి నమోదు చేసుకున్నారు.

అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంత లేదు. అవయవ దాతల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉంది. అవయవ దానంపై లేనిపోని అపోహలు, మతపరమైన నమ్మకాలు, ఆచారాల వంటి వాటి కారణంగా చాలా మంది అవయవ దానానికి ముందుకు రావడం లేదు.

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 2019 లెక్కల ప్రకారం, సంవత్సరానికి 1.5 నుండి రెండు లక్షల మందికి కిడ్నీ మార్పిడి అవసరం అవుతుంది. కానీ దాదాపు 8,000 మంది మాత్రమే అందుకోగలుగుతున్నారు. అంటే నాలుగు శాతం మంది ప్రజలు మాత్రమే దీనిని పొందుతారు. అదే విధంగా ప్రతి సంవత్సరం 80,000 మంది రోగులకు కాలేయ మార్పిడి అవసరమవుతుంది. కేవలం 1,800 మంది మాత్రమే పొందగలుగుతున్నారు.

సంవత్సరానికి సుమారు లక్ష మంది రోగులకు కంటి మార్పిడి అవసరమవుతుంది. అయితే సగం కంటే తక్కువ మంది మాత్రమే దీనిని పొందగలుగుతున్నారు. గుండె మార్పిడి చేయాల్సిన 10,000 మందిలో కేవలం 200 మంది మాత్రమే చేయించుకో గలుగుతున్నారు.

అవయవ దానం చేస్తున్న వారిలో మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఇచ్చేవారిలో 80 శాతం ఆడవారు ఉంటున్నారు. తీసుకునేవారిలో 80 శాతం మగవాళ్లు కాగా, 15 శాతం మాత్రమే మహిళలు ఉంటున్నారు. ఇంటి పెద్దకు ఏం కాకూడదని భార్య..కొడుకు బతకాలని తల్లి..అన్న బాగుండాలని చెల్లి…ఇలా అయినవాళ్లను కాపాడుకునేందుకు మహిళలు ముందుకు వస్తున్నారు. మరోవైపు మగవారి నుంచి అవయవాలను తీసుకునేందుకు ఆడవాళ్లు ఒప్పుకోవడంలేదు. కుటుంబ భారం మోసేవాళ్లు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో మహిళలు ఉండడమే ఇందుకు కారణం.

మరణించిన ఒక అవయవ దాత కళ్ళు, మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్‌, పేగులు, చర్మాలను అంటే ఎనిమిది అవయవాలను దానం చేయవచ్చు. జీవించి ఉన్న వ్యక్తి మూత్రపిండం, కాలేయం నుంచి కొద్ది భాగాన్ని మాత్రమే దానం చేయవచ్చు. నేత్ర దానం చేయడం వల్ల ఇద్దరికి చూపు వస్తుంది. అలాగే మరణించిన వ్యక్తి చేసే అవయవ దానం ద్వారా 8 మందికి కొత్త జీవితాలను ప్రసాదించవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా మార్పిడి చేయబడిన అవయవాల స్థానంలో కిడ్నీ మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానంలో కాలేయం ఆ తరువాత స్థానంలో గుండె ఉన్నాయి. అవయవ దాత శరీరం నుంచి గుండెను తీసిన తర్వాత దాన్ని 4 గంటల్లోగా అవసరమైన వారికి అమర్చాలి. ఊపిరితిత్తులు కూడా అంతే. అదే మూత్రపిండాలను శరీరం నుంచి వేరు చేసిన 30 గంటల్లోగా మార్పిడి చేయొచ్చు. కాలేయం, పాంక్రియాస్‌ 12 గంటల్లోగా మార్పిడి చేయాలి.

అవయవ దానం చేసిన వారి త్యాగాన్ని గౌరవిస్తూ వారి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించ నున్నట్టు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అవయవదానానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇది చాలా మంచి ఆలోచన. అవయవ, దేహ దానాన్ని ప్రచారం చేయడంలో దీని పాత్ర చెప్పుకోదగ్గది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని గుండె పని చేయడం మానేస్తుంది.

ఇతర భాగాలు పనికి రాకుండా పోతాయి. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి మాత్రమే అవయవాలు తొలగించవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది తీవ్రంగా గాయపడుతూ ఉంటారు. కొందరు మెదడు బాగా దెబ్బ తిని, పూర్తిగా స్పృహ కోల్పోయి, తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారిలో గుండె, కాలేయం, కిడ్నీల వంటి అవయవాలు పని చేస్తుంటాయి కానీ వీటన్నింటినీ నడిపించే కీలక అవయవమైన మెదడు మాత్రం పనిచేయదు. దీనినే బ్రెయిన్‌ డెడ్‌ అంటారు. పక్షవాతం వంటి మెదడు సమస్యల బారినపడ్డ వారిలోనూ ఇలాంటి స్థితి తలెత్తవచ్చు. ఈ దశలో ఉన్నవారి అవయవాలను సేకరించి, అవసరమైనవారికి అమర్చవచ్చు.

భారతదేశంలో అవయవ దానం విషయంలో కుటుంబం పాత్ర చాలా ముఖ్యమైనది. అనేక పాశ్చాత్య దేశాలలో వయోజనుల అంగీకారాన్ని ప్రభుత్వం అమలు చేయగలదు. చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం అమలు చేసే వీలుంటుంది. భారతదేశంలో కుటుంబానికి వదిలివేయబడుతుంది. దాత కార్డు ఉన్న వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ అయిన సందర్భంలో అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ఆమోదించాల్సి ఉంటుంది.

మానవ అవయవాల మార్పిడి చట్టం ప్రకారం బ్రెయిన్‌ డెడ్‌ అయిన కుటుంబ సభ్యుల అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు, సోదరులు, జీవిత భాగస్వామి లాంటి వారి అనుమతి తప్పనిసరి. దేహ, అవయవ దానాన్ని నిర్ణయించుకున్న దాత తన కుటుంబ సభ్యులను ఒప్పించుకోవడం కూడా దాత బాధ్యతే. లేనిపక్షంలో దేహ, అవయవ దాన నిర్ణయం ఆచరణ ప్రశ్నార్థకమే.

చనిపోయిన తర్వాత అవయవ దానం చేస్తే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేస్తారని చాలామందిలో ఉన్న అభిప్రాయం. ఇది వాస్తవం కాదు. అవయవదానం చేసినప్పటికీ, పనికి వచ్చే అవయవాలను తొలగించి, అవసరంలో ఉన్నవారకి అమర్చిన తర్వాత దాత శరీరాన్ని వైద్యులు గౌరవంగా చూస్తారు. తగిన రీతిలో అంత్యక్రియలు నిర్వహించడానికి వీలుగా దానిని సిద్ధంచేసి, దాత బంధువులకు అప్పగిస్తారు.

అవయవ దానానికి వయసుతో నిమిత్తం లేదు. ఏ వయసులో ఉన్నవారైనా అవయవ దానం చేయవచ్చు. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం 93 ఏళ్ల అమెరికన్‌ పౌరుడు మరణానంతరం అవయవదానం చేశాడు. సజీవ అవయవ దానానికి 18 ఏళ్లు నిండి ఉండాలి. 18 సంవత్సరాల లోపు వారు అవయవ దానం చేయదలిస్తే తప్పక కుటుంబ సభ్యుల అనుమతి అవసరం.

అవయవ దానంతోపాటు శరీర దానం కూడా చాలా ముఖ్యమైనది. శరీర నిర్మాణ శాస్త్రం, శరీర నిర్మాణం, అది ఎలా పని చేస్తుందనే అధ్యయనం గురించి విద్యార్థులకు బోధించడానికి మృత దేహాలను ఉపయోగిస్తారు. ప్రాణాలను రక్షించే శస్త్ర చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడంలో పరిశోధనా వైద్యులు కూడా శవాలను ఉపయోగిస్తారు. స్వచ్ఛంద దేహ దానాల ద్వారా, అలాగే క్లెయిమ్‌ చేయని మృత దేహాలను పోలీసుల నుండి స్వీకరిస్తారు. ఈ దేహ దానాలు వైద్య విద్యార్థులకు ఎంతో అవసరం.

జ్యూరిస్ట్‌ లీలా సేథ్‌, సిపియం నాయకుడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు మొదలుకొని ఇటీవల మరణించిన పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య, లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ లాంటి అనేకమంది ప్రముఖులు వైద్య పరిశోధనల కోసం తమ శరీరాన్ని దానం చేశారు.

శరీర దానం చేయదలిచినప్పుడు మృతదేహాన్ని వీలైనంత త్వరగా డిపార్ట్‌మెంట్‌కు పంపాలి. మరణం జరిగిన 6-8 గంటల లోపు శరీరం అనాటమీ డిపార్ట్‌మెంట్‌కు చేరుకోవాలి. ఎందుకంటే చనిపోయిన వెంటనే శరీరంలో కుళ్ళిపోయే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆలస్యమైతే మృతదేహాన్ని ఫ్రీజర్‌ బాక్స్‌లో భద్రపరచాలి. దేహ సమర్పణకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కోవిడ్‌-19, ఎయిడ్స్‌, హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, క్షయ వ్యాధి వున్నా, శరీరం బాగా కుళ్లిపోయినా, మరణించిన వారి తదుపరి బంధువుల నుండి అభ్యంతరం లాంటివి ఉన్నా దేహ సమర్పణకు వీలుపడదు.

రక్తదానంతో ప్రాణాలను కాపాడవచ్చు. బ్రెయిన్‌ డెడ్‌ అయినప్పుడు ‘అవయవ దానం’తో అభాగ్యులను ఆదుకోవచ్చు. మరణించిన పిదప నేత్ర దానంతో అంధులకు చూపునివ్వవచ్చు. దేహ దానంతో వైద్య విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు సహకరించవచ్చు.

LEAVE A RESPONSE