దసరా రోజు కూడా ఆగని తెలుగుదేశం నిరసన నిరాహార దీక్షలు
శిశుపాలుడి తప్పులాగే జగన్ వందో తప్పు చేశాడని ధ్వజం
తెలుగుదేశం పోలీస్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు
మంచిని సాధించబోయే విజయానికి సంకేతం విజయదశమి సంబరం అని, చెడుకి పోయేకాలం దగ్గర పడటం దసరా సందేశమని తెలుగు దేశం జాతీయ నాయకులు, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో దసరా పండుగ రోజు కూడా రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. బక్కని నర్సింహులు స్వయంగా దీక్షలో కూర్చున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్ని అష్టకష్టాలు పెడుతున్న జగనాసురుడి పాలన అంతమే లక్ష్యంగా అంతా కలిసి పోరాడుదామని, అదే మన తెలుగు రాష్ట్రాలకు అసలు సిసలు విజయం తెచ్చే విజయదశమి అని బక్కని పేర్కొన్నారు. శిశుపాలుడిలా సీఎం జగన్ వందో తప్పు చేశారని అది చంద్రబాబును జైల్లో పెట్టించడం అని అన్నారు. 100 తప్పులు చేసిన శిశుపాలుడు గతి ఏలా అయిందో ఇప్పుడు జగనా సూరుడి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో అలాగే జరగబోతుందని అన్నారు.
జగన్ రాజకీయ సన్యాసం తీసుకోవడం తధ్యమని ప్రజలు తమకున్న ఆగ్రహాన్ని ఓటు ద్వారా చూపించడం ఖాయమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక మనిషిలా బతకమని ప్రజలు అవకాశం ఇస్తే ఒక
రాక్షసుడిలా వ్యవహరిస్తూ చరిత్ర చెప్పిన పురాణాలను అర్థం చేసుకోకుండా అచ్చం అలాగే వ్యవహరిస్తున్నాడని అన్నారు. రాజకీయాలు కక్షలు కార్పన్యాలు సరికాదని చంద్రబాబు ఏనాడు ఇలాంటి పని చేయలేదని అన్నారు. జగన్ కు 100% పోయేకాలం దాపురించిందని అతని వైఫల్యాలను ఇక ఎవరు ఆపలేరని ఆ దేవుడు కూడా క్షమించబోడని అన్నారు.
ఈ నిరసన నిరాహార దీక్షలో మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి, ఆనుమారి వెంకటయ్య, గంధం ఆనంద్, మహమూద్, విట్యాల పాష, అబ్దుల్ రజాక్, కుమార్, ఎండి మహమ్మద్, ఎండి పాషా, యాదయ్య గౌడ్, విట్యాల అంజయ్య మొహమ్మద్ రుక్ముద్దీన్, ఖాదర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.