Suryaa.co.in

Andhra Pradesh

నుడా ద్వారా చరిత్రలో నిలిచిపోయేలా నెల్లూరుని అభివృద్ధి చేసుకుందాం

– ఇంచార్జ్ మంత్రి ఫరూక్

– పండుగ వాతావరణంలో నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రమాణ స్వీకారం
– నర్తకి సెంటర్ నుంచి వేలాది మంది అభిమానుల నడుమ గంటల పాటు నుడా కార్యాలయం వరకు సాగిన ర్యాలీ..

నెల్లూరు: నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ ( నుడా ) ద్వారా చరిత్రలో నిలిచిపోయేలా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ యం డి ఫరూక్ సూచించారు. మంగళవారం నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

తొలుత నగరంలోని నర్తకి సెంటర్ నుండి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్ ఎల్ ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యుటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఆర్ టి సి జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి తోడుగా అశేష అభిమానులు, వేలాది కార్యకర్తలు వెంట రాగా భారీ ర్యాలీ గా నుడా కార్యాలయంకు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి చేరుకున్నారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి , సర్వేపల్లి, ఉదయగిరి, కావలి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, దగుమాటి వెంకట కృష్ణా రెడ్డి హాజరయ్యారు. అతిధులకు ఘన స్వాగతం పలికిన నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్, నుడా విసి సూర్య తేజ అనంతరం నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఫరూక్ మాట్లాడుతూ గతంలో తాను మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామినయ్యానని, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ద్వారా రాష్ట్రంలోని నగరాలు పట్టణాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అందరి సహకారంతో నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని నుడా చైర్మన్ కు సూచించారు. కార్యకర్తగా పార్టీ అభివృద్ధికి కష్టపడినందునే పదవి వరించిందన్నారు.

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి సాధనే లక్ష్యంగా నుడా పనిచేయాలన్నారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, 21 అర్బన్ అథారిటీలు ఉన్నాయన్నారు. పట్టణ జనాభా 34 శాతం వృద్ధితో ఎప్పటికప్పుడు పెరుగుతుందన్నారు. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ అనుమతుల్లో ప్రజలకు అనుకూలమైన విధి విధానాలు రూపకల్పన చేస్తుందని, త్వరలోనే ఖరారు చేసి విడుదల చేస్తామన్నారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ కు కాటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అంటే ఎంతో అభిమానం. సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా కోటంరెడ్డిని బాలకృష్ణ అభిమానిస్తారని వెల్లడించారు. కాటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు జిల్లా బాలకృష్ణ అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణ సహకారంతో నెల్లూరుకి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేలా నుడా చైర్మన్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చెట్లను పెంచడం పై దృష్టి పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. అమరావతి అభివృద్ధికి పెడుతున్న వేల కోట్ల రూపాయలలో కొంత భాగాన్ని నెల్లూరు అభివృద్ధికి కూడా కేటాయించేలా చూడాలంటూ మంత్రి నారాయణని కోరారు.

నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. ఐ లవ్ నెల్లూరు నినాదంతో పరిశుభ్రమైన, సుందరమైన నెల్లూరు ను తీర్చిదిద్దటానికి, అదేవిధంగా జిల్లా మంత్రుల సహాయ సహకారాలతో నుడా పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుత పదవి కార్యకర్తలు పెట్టిన బిక్ష మాత్రమేనని, ఇందుకు సహకరించిన కూటమి నాయకులకు తన కృతజ్ఞతలన్నారు. అదేవిధంగా పార్టీలకతీతంగా నెల్లూరు జిల్లాకు విశేష సేవలు అందించిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఆనం వివేకానంద రెడ్డి, మంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి, మాగుంట పార్వతమ్మ, అలాగే నాయకులు వెన్నెలకంటి రాఘవయ్య, ఉగ్గాల రాజేశ్వరమ్మ విగ్రహాలను నెల్లూరు నగరంలో ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

కార్యక్రమం చివరలో అగ్రశ్రేణి నటులు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ నుడా చైర్మన్ కు ఫోను చేసి తమ శుభాకాంక్షలు అందచేశారు. సీనియర్ మంత్రుల సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి పదంలో నడపాలని శ్రీనివాసులరెడ్డికి సూచించారు. అలాగే కార్యకర్తలకు పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ సంభాషణ అంతా మైకు ద్వారా ప్రజలందరికీ వినిపించడంతో ఒక్కసారిగా అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, టిటిడి బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్, మాజీ ఎం ఎల్ ఎ లు దివి శివరాం, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, ఇతర టిడిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE