– మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
పార్వతీపురం , అక్టోబర్ 26 : సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్దామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జిల్లా అధికారులకు పిలుపునిచ్చారు.
పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ప్రాంతమని, అధిక శాతం గిరిజనులుండే ఈ ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్టు చెప్పారు. అందులో భాగంగా ఐటిడిఏలను పునరుద్దరించి, తద్వారా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఐటిడిఏకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించినట్టు ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వ సంకల్పం మేరకు జిల్లా నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్న జిల్లా యంత్రాంగానికి, అధికారులకు ఆమె అభినందనలు తెలిపారు.
శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో శాఖల్ వారీగా సమీక్షా సమావేశాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, సాగునీరు వంటి పలు అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతీ గ్రామంలో ప్రాధాన్యత అంశాలు ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయమని, ఆప్పుడే రాష్ట్ర సస్యశ్యామలంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
గత రెండేళ్లుగా జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈ ఏడాది కూడా అదేబాటలో నడవాలని ఆమె ఆకాంక్షించారు. ఐఐటి, ఎన్ఐఐటి ఎంబిబిఎస్ లో జిల్లా విద్యార్థులు ఉండాలనేది తన తపన అని, ఆ దిశగా విద్యలో పలు మార్పులు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వంలో జిల్లాలో 129 పాఠశాలలు మూతపడ్డాయని, వాటిపై సమగ్రమైన సర్వేచేసి అవసరమైన వాటిన పున: ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించాలని ‘అదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో పాఠశాలలను తెరవేందుకు కృషి చేస్తామని, పాఠశాలలన్నీ సమయపాలన పాటించాలని తెలిపారు.