-
చెల్లెలు షర్మిలకు ఇచ్చిన షేర్లు వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు ఈడ్చిన జగన్
-
తల్లి విజయమ్మకు ఇచ్చిన షేర్లు కూడా ఇచ్చేయాలని కోర్టుకెక్కిన కొడుకు-కోడలు
-
అన్నయ్య ‘జగన్నా’టకంపై వరస మాటల దాడి చేస్తున్న చెల్లి షర్మిల
-
ఇటీవల తన చెల్లెమ్మలకు రెండేసి ఎకరాలు బహుమతిగా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
-
భార్య సురేఖ చొరవతో ఆడబిడ్డలకు దక్కిన అరుదైన పుట్టింటి గౌరవం
-
అందరి వదినలకు భిన్నంగా ఆడబిడ్డలపై అనురాగం ప్రదర్శించిన సురేఖ వదిన
-
ఇప్పుడు జగన్-చిరంజీవి, సురేఖ-భారతి మధ్య పోలికతో సోషల్‌మీడియాలో కథనాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆడపడచు.. ఆడబిడ్డ.. గోరింటాకు.. అన్నాచెలెల్లు.. పుట్టింటికిరా చెల్లీ.. చిట్టిచెల్లెలు ..అన్నవరం.. రాఖీ.. అర్జున్.. రక్తసంబంధం.. విజయరామరాజు.. వీరసింహారెడ్డి.. ముద్దులమామయ్య. ఏంటి?.. ఇప్పుడెందుకీ సినిమాల గోల అనుకుంటున్నారు కదా? కొంపతీయకుండా ఇదేమైనా సినిమా స్టోరీనా అని సందేహిస్తున్నారు కదా? యస్. కాకపోతే కొంచెం అటు ఇటుగా కథయితే అదే. కానీ ఇది ‘సినిమా విత్ పొలిటికల్ స్టోరీ’ అన్నమాట. ఎందుకంటే తెలుగునాట సినిమాలకు-రాజకీయాలకు చాలా ఏళ్ల క్రితమే బంధం ఏర్పడింది కదా? అందుకన్నమాట!
ఇక ఈ సినిమాలన్నీ అన్నాచెల్లెల బంధాన్ని చాటేవ ని బొట్టుపెట్టిమరీ చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలలో కథలన్నీ అన్నాచెల్లెళ్ల మధ్య జరిగే అనురాగబంధానికి సంబంధించినవే. పెళ్లికాక ముందు వరకూ చెల్లిని కంటికి రెప్పలా చూసుకునే అన్నయ్యలు.. పెళ్లయిన తర్వాత పూర్తిగా మారిపోయి, పెళ్లాంచాటు మొగుళ్లుగా మారతారు. అంటే కొంగుచాటు కృష్ణులన్నమాట.
ఆ తర్వాత ఏదో ఒక బలమైన సంఘటన మళ్లీ అన్నాచెల్లెళ్లను కలుపుతుంది. అందుకు అడ్డువచ్చిన భార్య చెంపఛెళ్లుమనిపిస్తాడు. ఆ తర్వాత కళ్లనీళ్లు కుక్కుకున్న వదిన, తాను ఆడబిడ్డకు చేసిన అన్యాయానికి క్షమించమని కోరుకుంటుంది. దానితో వెనీలా- బటర్‌స్కాచ్ ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయిన ఆడబిడ్డ.. ‘‘ఛఛ ఊరుకో వదిన. నువ్వు పెద్దదానివి నన్ను క్షమించమని కోరుకోవటం ఏమిటి? జరిగిందేదో జరిగిపోయింది. కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా ఏంటి? ఇకనుంచి అందరూ కలసి ఉందాం. ఇదిగో నా కొడుకు. నీ అల్లుడిని చేసుకో. రావే కోడలా’’ అంటూ ఆడబిడ్డ పెద్దమనసు ప్రదర్శించటంతో, సినిమాకు శుభం కార్డు పడుతుంది. ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ నుంచి.. ఈస్ట్‌మన్ కలర్ సినిమాల వరకూ చూసిన కథలే.
ఇప్పుడు తెలుగునాట హైదరాబాద్ లోటస్‌పాండ్-అమరావతి తాడేపల్లి స్టుడియోల్లో జరుగుతున్న పులివెందుల ప్రొడక్షన్స్ వారి ‘అన్నాచెల్లెలు.. మధ్యలో వదిన’ సినిమా షూటింగ్ కథ, కొద్దిగానే బయటకు లీకయింది. అందులో ఇంకా ఎన్ని మలుపులు.. ఇంకెన్ని పోరాటాలు.. మరెన్ని కోర్టు సీన్లు.. అన్నా చెల్లెల డైలాగులు.. వదినా-ఆడబిడ్డ పవర్‌ఫుల్ డైలాగులుంటాయోనన్న ఉత్కంఠ అభిమానులలో ఉత్కంఠ రేపుతోంది.
‘‘అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కోరకే
నీకన్నా నాకెవరే’’
‘చిట్టిచెల్లెలు’ సినిమాలో.. ఎన్టీఓడు చిన్నప్పుడు, తన చెల్లికోసం పాడిన పాట ఇది. ఇప్పుడు ఈ పాట జగన్..షర్మిల..మధ్యలో భారతీరెడ్డి కథను గుర్తుకు తెస్తోంది. పాత సినిమాల్లో అంటే బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్‌మన్ కలర్ రోజుల్లో వచ్చిన సినిమా కథలన్నీ రచయితలు, చెల్లి కోసం అన్నయ్యలు చేసిన త్యాగాలతోనే తిప్పేవారు. అందులో అన్నాచెల్లెళ్ల ప్రేమకు అడ్డుపడే క్యారెక్టరుగా వదినను చూపించేవారు. భర్తకు తరచూ ఆడబిడ్డపై పితూరీలు చెప్పడమో.. ఆమెను బయటకు పంపించేందుకు చేసే కుట్రలు-కుతంత్రాలూ ఎక్కువగా చూపేవారు. అవన్నీ సూపర్ డూపర్ హిట్టయిన సినిమాలు.
మరికొన్ని సినిమాల్లో వదినే చొరవ తీసుకుని, ఆడపడచును ఆదుకునే కథలూ లేకపోలేదు. కాకపోతే వాటి సంఖ్య తక్కువనుకోండి. కలర్ సినిమాలు వచ్చిన తర్వాత.. గ్రామంలో చెల్లికి అన్యాయం చేసి, టౌన్‌లో బాగా ఆస్తి సంపాదించిన మామ పొగరు అణచివేసిన అల్లుడు, ఆ తర్వాత అదే టౌనుకు వెళ్లి ఆయన కూతురును పెళ్లిచేసుకునే కథలు వస్తున్నాయి.
ఇక ఇప్పుడు మళ్లీ కొద్దిగా లీకయిన, పులివెందుల ప్రొడక్షన్స్ వారి ‘‘అన్నాచెల్లెలు.. మధ్యలో వదిన’’సినిమా కథలోకి వెళితే అన్న జగన్-వదిన భారతీరెడ్డి షేర్ల కోసం తల్లి-చెల్లిని ఎలా వేధిస్తున్నారో చెల్లి షర్మిలమ్మ బయటపెడుతున్న బ్యాక్‌గ్రౌండ్ కథ రక్తికడుతోంది.
అది చాలక.. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. ‘జగన్..భారతి.. మధ్యలో షర్మిల’ సినిమాలో చిరంజీవి పాత్ర హటాత్తుగా ఎంటరవడం, జగన్‌కు మహా ఇబ్బందిగా మారింది. అదేంటి? అసలు లోటస్‌పాండ్ వయా తాడేపల్లి టు పులివెందుల కథకూ, మెగాస్టార్ చిరంజీవికి సంబంధమేమిటని బుర్రలు బరుక్కుంటున్నారు కదా? ప్లీజ్. ఆపనిచేయకండి. అసలే ఈమధ్య ఫ్యామిలీవార్ సినిమాలతో, జనాలకు ఉన్న ఆ కొద్దిపాటి జుట్టు కూడా రాలిపోతోంది.
విషయమేమిటంటే.. తన తల్లి-చెల్లికి రాసిచ్చిన షేర్లు రద్దు చేసి, మళ్లీ వాటిని తనకు ఇచ్చేయాలంటూ వైసీపీ అధినేత జగన్ ఎన్‌సీఎల్‌టీ కోర్టుకు ఈడ్చిన సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సమయంలోనే.. చిరంజీవి తన ఇద్దరు చెల్లెమ్మలకు రెండేసి ఎకరాల భూమిని, అది కూడా అత్యంత ఖరీదైన ప్రాంతంలోని భూమిని పుట్టింటి బహుమతిగా ఇవ్వడం.. పులివెందుల ఫ్యామిలీ చావుకొచ్చి పడింది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకు రావడమంటే ఇదేనేమో?! దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు మార్కెట్‌లో తెగ వైరల్ అవడంతో, జగనన్నకు ‘సపోర్టింగు ఇచ్చుకునేవాళ్లకు’ మహా ఇబ్బందిగా మారింది.
ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌లో భార్య, చెల్లిని పక్కనే కూర్చోబెట్టుకుని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు.. చెల్లెమ్మల పట్ల చిరంజీవికి ఉన్న ప్రేమానురాగాలు-జగన్‌కు చెల్లిపై ఉన్న ఉత్తుత్తి ప్రేమానురాగాలను బయటపెట్టాయి. ఇక వాటిపై నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలు, చేస్తున్న విమర్శలతో జగనాభిమానులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఆ వేదికపై చిరంజీవి ఏమన్నారంటే.. ‘‘నా భార్య నన్ను ఆ మధ్య ఒక కోరిక కోరింది. అదేమిటంటే కోకాపేటలో మనకు ఉన్న భూమిలో రెండు ఎకరాలు మీ చెల్లెళ్ల విజయదుర్గ-మాధవికి ఇవ్వండి. అది వారికి ఇంటిగానో, ఫాంహౌసుగానో ఉపయోగపడుతుందని కోరింది. సహజంగా కొడుకు, కూతుళ్లు పెద్దవాళ్లైన తర్వాత ఏ భార్యయినా వారి కోసమే ఆలోచిస్తుంది. కానీ నా భార్య నా చెల్లెళ్లకు పుట్టింటి బహుమతిగా ఇవ్వాలని కోరిందంటే, తన పెద్దమనసుకు నాకు ఆనందం వేసింది.
నాకూ నిజమే కదా అనిపించింది. నేను నా చెల్లెళ్లకు అన్నీ చేశాను. వారిని బాగా చూసుకున్నా. వాళ్ల పిల్లలు వృద్ధిలోకి వచ్చేవరకూ అన్నీ నేనే చూసుకున్నా. కానీ వాళ్ల పిల్లలు పెద్దవాళ్లయి, వాళ్ల దారిలో వాళ్లు వెళితే నా చెల్లెమ్మలను ఎవరు చూస్తారనిపించింది. అదే భూమి ఇస్తే అక్కడే ఇల్లు కట్టుకుంటారు కదా అనిపించింది. కానీ నేను పనిలోపడి ఆ విషయం మర్చిపోతే, మళ్లీ నా భార్య గుర్తు చేసింది. దానితో రాఖీ పండుగు రోజు వాళ్లు వచ్చినప్పుడు, నా చేతికి రాఖీ కట్టిన తర్వాత వారికి కోకాపేటలో రెండకరాల భూమి గిఫ్ట్‌డీడ్ పేపర్లు బహుమతిగా ఇచ్చాన’’ని వివరించారు.
అయితే ఇంతకూ ఇప్పుడు కోకాపేటలో ఎకరం భూమి విలువ ఎంతో తెలుసా? జస్ట్ వంద కోట్లు. అంటే దాదాపు నాలుగవందల కోట్లు విలువచేసే బంగారం లాంటి భూమిని, ఆయన తన చెల్లెమ్మల కోసం పెద్దమనసుతో ఇచ్చేశారన్నమాట. దటీజ్ చిరంజీవి! ‘‘అదీ చిరంజీవి-సురేఖ, జగన్-భారతీకి తేడా’’ అంటూ మెగా అభిమానులు తెగ పోస్టులు పెట్టేస్తున్నారు.
ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే.. షర్మిలకు వదిన భారతీరెడ్డి, తాను ఇచ్చిన షేర్లు తిరిగి వాపసు చేయాలని, ఆడబిడ్డను కోర్టుకీడ్చారు.. అదే చిరంజీవి భార్య సురేఖ వదినగా, తన ఇద్దరు ఆడపడచులకు రెండేసి ఎకరాల భూమిని పుట్టింటి బహుమతిగా, భర్త చిరంజీవితో ఇప్పించడం!
చిరంజీవి స్వయంగా తన భూమిలో రెండేసి ఎకరాలు ఇద్దరు చెల్లమ్మలకు పెద్దమనసుతో ఇవ్వగా… అక్కడ నా అక్కచెల్లెమ్మలని భారీ డైలాగులు చెప్పే జగన్ మాత్రం సతీసమేతంగా.. తల్లి-చెల్లికి ఇచ్చిన షేర్లను తిరిగి గుంజుకునేందుకు, వారిద్దరినీ కోర్టుకు ఈడ్చిన వైనం సోషల్‌మీడియా సైనికులకు చేతినిండా పనికల్పిస్తోంది.