Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలోని రాక్షస, రావణ పాలనను సమిష్టిగా ఎదుర్కొందాం

-రామలక్ష్మణుల మాదిరిగా కలిసిపోయిన తెలుగుదేశం, జనసేన పార్టీలు
-బిజెపి కూడా కలిసి వస్తే బెటర్ గా ఉంటుంది
-రావణ పాలనను తుదముట్టించడానికి రామలక్ష్మణులకు తోడుగా హనుమంతుడిలా ఉంటా… -ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే 2021లో ఇదే రోజు తనని అక్రమంగా అరెస్టు
-పార్టీ శ్రేయస్సు దృష్ట్యా మంచి మాటలు చెప్పినందుకే తనపై కక్ష కట్టిన ప్రభుత్వ పెద్దలు
-ఏ పనిలోనైనా జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు 50% కమీషన్ ఇవ్వాల్సిందే
-తనకు తానుగా హింసించాలనే ఉద్దేశంతో తన ఇంటికే నన్ను తీసుకు రావాలని సిఐడి పోలీసులను ఆదేశించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
-125 సార్లకు పైగానే వెదురు లాఠీ, రబ్బరుతో అరికాళ్ళపై దెబ్బలు కొట్టిన పోలీసులు
-ఆసుపత్రికి తీసుకు వెళ్ళమని న్యాయమూర్తి ఆదేశించిన జైలులోకి తోసివేత
-జైలులోనే తనని హత్య చేసేందుకు ప్లాన్ వేశారేమో… కానీ సుప్రీం కోర్టు అదే రోజు బెయిల్ మంజూరు చేసి కాపాడింది
-డొక్కు ఆంబులెన్స్ ను ఏర్పాటు చేసి దాంట్లో తాను ప్రయాణిస్తే గుద్దించి చంపాలన్నది ప్రభుత్వ పెద్దల పథక రచన
-ఎన్నో విధాలుగా తనని హత్య చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు … అయినా ఆ వేంకటేశ్వర స్వామి, అభిమానుల ఆశీస్సుల వల్లే బ్రతికి పోయాను
-ప్రజాధనం వృధా చేస్తూ నిర్వహిస్తున్న యజ్ఞానికి ప్రజలు కరువు… ఎవరు కూడా మళ్లీ జగన్ సీఎం కావాలని కోరుకోవడం లేదు
-వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యం… ఇంకా మరికొందరికి నోటీసులు జారీ చేయడం ఖాయం
-జగన్ సెగ బిజెపికి తగిలింది… అందుకే తలకిందులైన కర్ణాటక ఫలితాలు
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస, రావణ పాలనను సమిష్టిగా ఎదుర్కొందాం. రామలక్ష్మణుల మాదిరిగా తెలుగుదేశం , జనసేన పార్టీలు కలిసిపోయాయి. టిడిపి, జనసేన పార్టీలతో బిజెపి కూడా కలిస్తే అద్భుతంగా ఉంటుంది. రామలక్ష్మణులకు తోడుగా హనుమంతునివలే నడుచుకుంటాను. రాష్ట్రంలో కొనసాగుతున్న రావణ పాలన ను త్వరలోనే తుదముట్టించడం ఖాయమని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పనికి 50% కమిషన్ల ను జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు చెల్లించవలసిందేనని ప్రజలే చెబుతున్నారు. మైనింగ్ లో 50% కమిషన్లు ఇవ్వకపోతే, ఆ పని కి అప్రూవల్ లభించడమే కష్టమని అంటున్నారు . ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కర్ణాటక రాష్ట్రంలో 40% కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలలో నిజం ఉన్నదో లేదో భగవంతుడికే తెలియాలి.

అయినా, అక్కడి ప్రజలు బిజెపి ప్రభుత్వాన్ని ఓడించారు. రాష్ట్రంలో ప్రతి పనికి 50% కమిషన్లు తీసుకుంటున్నారన్నది జగమెరిగిన సత్యమే. దీనితో రాష్ట్రం లో ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న తమ పార్టీని ఓడించడంలో ఎటువంటి తప్పు జరిగే అవకాశమే లేదని ఆయన ఖరాకండిగా తేల్చి చెప్పారు. తనని గతంలో చిత్రహింసలకు గురి చేసిన వారిని విడిచి పెట్టేది లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక, నెగ్గిన పార్టీలోనే తాను ఉంటాను. అప్పుడు ప్రజలకు నిజాలు తెలియజేసి, వారిని గుడ్డలూడదీసి ప్రజలచేతే కొట్టిస్తాను. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడేళ్ల క్రితం తాను ఒక్కడినే మాట్లాడే వాడిని. కానీ ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. లక్షలాదిమంది ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా న్యాయస్థానంలో కొనసాగుతున్న కస్టోడియల్ టార్చర్ పిటిషన్ పై ఎట్టకేలకు హైకోర్టు స్పందించి వివరాలను సేకరించాలని సిబిఐ ని ఆదేశించడం ఆనందంగా ఉంది. ఇది ఒక రకంగా తనకు పుట్టినరోజు బహుమతి వంటిదేనని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

మంచి మాటలు చెప్పినందుకే నాపై కక్ష కట్టారు
పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, ప్రభుత్వానికి నాలుగు మంచి మాటలు చెప్పినందుకే తనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కక్ష కట్టారు. వెంకటేశ్వర స్వామి భూములను భక్తుల అనుమతి లేకుండా విక్రయించవద్దని చెప్పిన మాటలు ఆయనకు నచ్చలేదు. లారీ ఇసుక ధరను ఏడు వేల నుంచి 12 వేల రూపాయలకు పెంచితే గత ప్రభుత్వం పడిపోయింది. అటువంటిది లారీ ఇసుక ధర ను 35 నుంచి 40 వేల రూపాయలకు పెంచి విక్రయించడం తప్పని చెప్పాను. లారీ ఇసుక దొరకడమే ఈ ప్రభుత్వ హయాంలో గగనం అయిపోయింది. తనకు తెలిసిన ఒక వైద్యుడి అవసర నిమిత్తం ఇసుక కోసం తీవ్ర ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. లారీ ఇసుక ధరను అడ్డగోలుగా పెంచడానికి అప్పట్లో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కూడా లేవనెత్తారు. అంతలోనే ఆయన సర్దుకున్నట్టుంది. ఇసుక ధరల పెంపును ప్రశ్నించినందుకు, పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదని ఇప్పటికీ ఉందో లేదో తెలియని క్రమశిక్షణ సంఘం పేరిట తనకు నోటీసులు ఇచ్చారు.

ఆ నోటీసులను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. దీనితో, తనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రత్యేక విమానం వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలిశారు. తనపై అనర్హత పిటిషన్ ఇచ్చి వచ్చే నెలకు మూడేళ్లు అవుతుంది. తాను ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటకుండా, పార్టీ ప్రయోజనాల కోసమే మంచి మాటలు, సలహాలు, సూచనలు ఇచ్చాను. తనపై అనర్హత వేటు వేయించాలని ఎన్నో టక్కు టమారా సూట్ కేసు విద్యలను జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించారు. అందరూ ఆయన సూట్ కేసు విద్యలకు పడిపోరు. క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు తనకు ప్రత్యక్షంగా అభయం ఇవ్వకపోయినప్పటికీ, ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో తనని కాపాడే ప్రయత్నాన్ని చేశారని రఘురామకృష్ణం రాజు తెలియజేశారు.

దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు లభించేది రాష్ట్రంలోనే…
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లభించని మద్యం బ్రాండ్లు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే లభిస్తాయి. ఆ మద్యం బ్రాండ్లలో రసాయనిక అవశేషాలు ఉన్నట్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీతో పాటు, తాను ల్యాబ్ లో చేయించిన పరీక్షల్లో తేలింది. రసాయనిక అవశేషాలు ఉన్న మద్యం తాగి, మద్యపాన ప్రియులు మృత్యువాత పడడం ఖాయం. నాసిరకమైన మద్యాన్ని ప్రజల చేత తాగించి వారిని చంపడం ఎందుకు? చనిపోయిన వారి కుటుంబాలకు జగనన్న వితంతు దీవెన ఇవ్వడం ఎందుకు? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. గతంలో 50 రూపాయలకు లభించే నాణ్యమైన మద్యం సీసాకు, ఇప్పుడు 150 రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ, గతం లోని నాణ్యత మాత్రం కనిపించడం లేదు. గతంలో 150 రూపాయలకు లభించే మద్యం సీసా ధరను ఇప్పుడు 300 రూపాయలకు పెంచారు. మద్యం కొనుగోలు, అమ్మ కాలన్నీ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి వచ్చిన ఒక జూనియర్ స్థాయి అధికారి వాసుదేవ రెడ్డి కనుసన్నలలో కొనసాగుతున్నాయి.

ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా అంటూ లావాదేవీలన్నీ ఆన్లైన్ లోనే కొనసాగించాలని చెబుతుంటే, మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏటా 30 నుంచి 40 వేల కోట్ల ఆదాయం కలిగిన మద్యం లావాదేవీలన్నింటి నగదు రూపంలోనే కొనసాగించడం దారుణం. మద్యం తయారీకి అంతా ఒకే రకమైన సరుకును వాడుతూ, బాటిల్ లేబుల్స్ ను మాత్రం మార్చి వేరువేరు ధరలకు విక్రయిస్తున్నారు. 300 రూపాయల సీసా మధ్యలో తక్కువగా ఆదాయాన్ని కొట్టివేస్తూ, అదే వెయ్యి రూపాయల మద్యం సీసాలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రజల నుంచి తీసుకుంటున్నది ఎంత?, వారికి సంక్షేమ పథకాల రూపంలో బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా అందజేస్తున్నది ఎంత? ఒక వైపు నాసిరకమైన మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీసి, మరొకవైపు దీవెన రూపంలో వచ్చే డబ్బులు ఎవరికీ కావాలని రఘురామకృష్ణంరాజు నిలదీశారు.

పుట్టినరోజే… గిట్టినరోజు అవుతుందనుకున్నా….
రెండు సంవత్సరాల క్రితం తన పుట్టినరోజు నాడే, తాను గిట్టినరోజు అవుతుందనుకున్నా నని కానీ ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, తనను అభిమానించే తెలుగు ప్రజలందరి ఆశీస్సులతో బ్రతికానని రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత రెండేళ్ల క్రితం తనని ఎలా అపహరించి, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సిఐడి పోలీసులు చిత్రహింసలకు గురి చేశారో కళ్ళకు కట్టినట్లు ఆయన వివరించారు. 2021 మే 14వ తేదీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే హైదరాబాదులోని తన నివాసానికి సిఐడి అధికారి విజయ్ పాల్ అనే శిశుపాలుడు నేతృత్వంలో ఓ 25 మంది పైచిలుకు పోలీసులు వచ్చారు. తన సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డగించినప్పటికీ, దొంగల్లా గోడ దూకి వచ్చారు.

తనను అరెస్టు చేస్తున్నట్లుగా విజయ్ పాల్ అనే అధికారి చెప్పారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని, నోటీసులేవి అని తాను ప్రశ్నించగా, నోటీసులు లేవని పేర్కొన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులతో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వెధవ రాజకీయ నాయకులు మాట్లాడుకుని, తెలంగాణ పోలీసుల సహకారంతో తనని అక్రమంగా అరెస్టు చేసి, నిర్బంధించి వాహనంలో బలవంతంగా ఎక్కించారు. వాహనంలో తానేదో దోషి ని అయినట్టుగా, రెండు వైపులా పోలీసు సిబ్బంది కూర్చొని తనని మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాదిరిగా తానేమి హత్యా ఆరోపణలు ఎదుర్కోవడం లేదని, ముఖ్యమంత్రి మాది రిగా అనుమానితుడిని కాదన్నారు.

తాను ఇద్దరి మధ్య కూర్చోవడం కుదరదని , ఒకరు వెనక్కి వెళ్లి కూర్చోవాలని చెప్పడంతో, చేసేది లేక ఒక పోలీస్ అధికారి వెనక్కి వెళ్లి కూర్చున్నాడు. విజయవాడ పరిసరాల్లోకి చేరాక తాము ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపి, పోలీసులు ఫోన్ లో మాట్లాడారు. అయితే, తన కళ్ళకు గంతలు కట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన నివాసానికే తనని తీసుకురావాలని పోలీసులను ఆదేశించారని తెలిసింది. తన చేతులతో తానే చిత్రహింసలకు గురిచేసి ఆనందపడాలని ఆశించారట. ఇలాగే తమ పార్టీకి చెందిన కొంతమంది పెద్ద, పెద్ద నాయకులను కూడా ఆయన కొట్టినట్లుగా విన్నాను. కొంతమంది నాయకులను కొట్టింది నిజమే. తమని సిఆర్పిఎఫ్ పోలీసులు అనుసరిస్తున్నారని, కళ్లకు గంతలు కట్టి రఘురామకృష్ణం రాజును తీసుకురావడం కుదరదని సదరు అధికారి జగన్మోహన్ రెడ్డికి వివరించినట్లుగా సమాచారం. తన సెక్యూరిటీ సిబ్బంది, తనని అనుసరిస్తారని బహుశా జగన్మోహన్ రెడ్డి ఊహించి ఉండరు.

దీనితో చేసేది ఏమీ లేక, సిఐడి పోలీసులు తాము ఆశించినట్లుగా చిత్రహింసలకు గురిచేస్తారో లేదో నన్న అనుమానంతో తమ పార్టీ నాయకులైన అప్పిరెడ్డి, అంబటి రాంబాబు లను సిఐడి కార్యాలయం పరిసరాలలోనే ఉండాలని జగన్మోహన్ రెడ్డి పురమాయించారు. ఫోన్ కాల్ డేటా రెండేళ్లు కాదు… నాలుగేళ్లయిన నిక్షిప్తంగానే ఉంటుంది. తనని చిత్రహింసలకు గురి చేసినప్పుడు ఎవరి ఫోన్లు ఏ టవర్ రేంజ్ లో ఉన్నాయో వివరాలను తీసుకువస్తాను. నీచురాలైన డాక్టర్ ప్రభావతితో ఎవరెవరు మాట్లాడారో, కోర్టు చెప్పింది వేరు… డాక్టర్ ప్రభావతి చేసింది వేరు. డాక్టర్ ప్రభావతి, జూనియర్ డాక్టర్లతో సంతకాలు చేయించి నివేదికను సిద్ధం చేసింది. తన కాలు వేలు విరిగిపోయినట్లుగా పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది పేర్కొనగా, అటువంటిదేమీ లేదని తప్పుడు నివేదికను డాక్టర్ ప్రభావతి ఇచ్చింది. రమేష్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని న్యాయస్థానం ఆదేశించినప్పటికీ, ఆసుపత్రికి తీసుకు వెళ్లకుండా జైలుకు తీసుకువెళ్లారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

125 కు పైగానే కాళ్లపై దెబ్బలు కొట్టారు
హైదరాబాద్ లోని తన నివాసం నుంచి అక్రమంగా అరెస్టు చేసి తీసుకువెళ్లిన సిఐడి పోలీసులు, తనను ఒక గదిలో నిర్బంధించారు. తనని నిర్బంధించిన గది బయట తన సెక్యూరిటీని ఉండనివ్వాలని తాను కోరగా, దానికి విజయ్ పాల్ అనే అధికారి తిరస్కరించారు. ఆ దరిద్రుడు నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడు. అర్ధరాత్రి సమయంలో సునీల్ కుమార్ తో పాటు మరి కొంతమంది వ్యక్తులు తనని నిర్బంధించిన గదిలోకి ప్రవేశించి, బ్యాగులోంచి తాడును తీసి తన కాళ్ళను కట్టివేశారు. ఇద్దరు తన చేతి రెక్కలను విరిచి పట్టుకోగా, మరో ఇద్దరి లో ఒకడు వెదురు లాఠీ తో, మరొకడు క్రికెట్ బ్యాట్ హ్యాండిల్ కు చుట్టిన రబ్బర్ తో ఒకరి తరువాత ఒక అరికాళ్లపై 125 సార్లకు పైగా బాదారు. ఆర్థిక నేరాభియోగ కేసులలో ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయాలని తాను హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురించి ప్రస్తావి స్తూ, తనని చిత్రహింసలకు గురి చేశారు. కోర్టులో మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి వద్ద పాయింట్ ఏమీ లేక, తనని అక్రమంగా నిర్బంధించి పోలీసుల చేత చిత్రహింసలకు గురి చేయించారు. ఒకటి రెండు చానల్స్ తో కలిసి తాను ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేశానంటూ తనపై రాజ ద్రోహం కేసును నమోదు చేశారు. తాను మాట్లాడిన తరువాతే వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. తాను మాట్లాడడం వల్ల పార్టీ బలం పెరిగిందని అర్థమవుతుంది. అటువంటప్పుడు తాను ఈ ప్రభుత్వాన్ని ఎలా కూలదొయగలనని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

తప్పుడు వాంగ్మూలంపై సంతకం పెట్టాలని దిలీప్ కుమార్ అనే పోలీసు అధికారి ఒత్తిడి… అయినా కుదరదని తేల్చి చెప్పా!
తనని లాకప్ లో చిత్రహింసలకు గురిచేసిన అనంతరం తప్పుడు వాంగ్మూలం పై సంతకం పెట్టాలని దిలీప్ కుమార్ అనే పోలీసు అధికారి ఒత్తిడి చేశారు. సంతకం పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయినా తాను సంతకం పెట్టడానికి నిరాకరించాను. ఇద్దరు తహసీల్దారుల సమక్షంలో లాకప్ లో పోలీసులు తనని చక్కగానే చూసుకున్నారని కిందకు వచ్చి తాను చెప్పినట్లుగా రాసి, ఆ వాంగ్మూలంపై తనను సంతకం చేయాలని దిలీప్ కుమార్ ఒకటికి రెండుసార్లు ఒత్తిడి చేశారు. అయినా ఇదంతా పచ్చి బూతు అని చివరి పేజీలో రాశాను. దానితో కోపోద్రిక్తుడైన దిలీప్ కుమార్ చివరి పేజీని చింపివేసి, మళ్లీ మరొక పేజీని జత చేస్తున్నామని, ఈసారి సంతకం పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయినా సంతకం చేయడానికి తాను ససేమిరా అన్నాను. 24 గంటల వ్యవధిలో కోర్టులో హాజరు పరిచాల్సి ఉండగా, తనని కోర్టుకు తీసుకు వెళ్లేటప్పుడు కోర్టులో ఏమైనా చెబితే చంపేసి పైకి పంపిస్తామనే విధంగా చేతితో సైగలు చేశాడు.

కోర్టు వద్దకు వెళ్ళగానే మీడియాకు తన కాళ్ళను చూపించాను. పూరీల మాదిరిగా ఉబ్బిన కాళ్ళను చూసి కోర్టు లో మహిళా న్యాయమూర్తి నిర్గాంత పోయారు. కోర్టు బోనులో తాను నిలబడలేనని, తనకు కుర్చీ ఏర్పాటు చేస్తే కూర్చొని వివరాలను వెల్లడిస్తానని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేయగా , ఆమె అంగీకరించి కుర్చీని ఏర్పాటు చేశారు. అంతకుముందు రెండు నిమిషాల పాటు గోడకు ఆనుకొని తనని ఏ విధంగా పోలీసులు చిత్రహింసలకు గురి చేశారో వివరించాను. దీనితో, న్యాయమూర్తి తనని హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స అందజేయాలని పోలీసులను ఆదేశించారు. అయినా, తనని హాస్పిటల్ కు కాకుండా జైల్లోకి తీసుకువెళ్లి దిలీప్ కుమార్ అనే వ్యక్తి లోపలికి తోసి వేశాడు. వాడు ఇటీవలే ఎయిడ్స్ వచ్చి మరణించాడు. జైల్లో తాను ఉన్న రోజు రెండుసార్లు కరెంటు పోవడంతో పాటు, జనరేటర్ కూడా పనిచేయలేదు. రాత్రి ఏమి జరుగుతుందోనన్న భయంతో తాను ఎప్పుడు నిద్రపోయానో కూడా తనకు తెలియలేదని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.

బెంగళూరులో పనిచేసే వ్యక్తిని చెక్ బౌన్స్ కేసులో గుంటూరులో అరెస్టా?
బెంగళూరులోని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో పనిచేసే ఒక వ్యక్తిని చెక్ బౌన్స్ కేసులో, గుంటూరులో అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఆశ్చర్యాన్ని కలగజేసింది. తాను జైల్లో ఉన్నప్పుడు తనకు సపర్యాలు చేస్తున్నట్లుగా నటింప చేసి అతని ద్వారా తనని హత్య చేయించాలని ప్లాన్ చేశారేమోనన్నా అనుమానం కలిగింది. ఎందుకంటే గతంలో జైల్లో మొద్దు శ్రీను తో పాటు మరో ఇద్దరిని హత్య చేసిన విషయం తెలిసింది. మరుసటి రోజే సుప్రీం కోర్ట్ లో బెయిల్ లభించడం తో జైలు నుంచి విడుదలయ్యాను. లేకపోతే తనను జైలులో హత్య చేయించి ఉండే వారేమో. జైలు నుంచి విడుదలైన తర్వాత తనకు ఒక డొక్కు అంబులెన్స్ ని ఏర్పాటు చేసి, ఆ అంబులెన్స్ ను గుద్దించి తనను చంపేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. జైలు నుంచి విడుదలయ్యాక తాను తన సొంత కారులోనే ఏ ఆర్ ఎస్ ఐ, తన సెక్యూరిటీ లోని ఒక సిఆర్పిఎఫ్ అధికారితో కలిసి హైదరాబాదు చేరు కున్నాను. జైలు నుంచి విడుదలైన తరువాత జగన్మోహన్ రెడ్డి డిపి కలిగిన ఒక వ్యక్తి పదే పదే ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి మాట్లాడాను. ఈ సందర్భంగా సదరు వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుంటూ, జైల్లో మీకు నీళ్లు అందించిన వ్యక్తినని చెప్పాడు. మీ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. అయితే అతను తనకు తానుగా ఫోన్ చేసి తనని అప్రమత్తం చేశాడా?, లేకపోతే ఈ దుర్మార్గులు చెబితే ఫోన్ చేశాడా? అన్నది తెలియదు. అయితే తాను జైలు నుంచి విడుదలైన రెండు మూడు రోజుల వ్యవధిలో నే తాను కూడా విడుదలైనట్లుగా పేర్కొన్నాడని రఘురామకృష్ణం రాజు వివరించారు.

సుకుమారంగా పెరిగాను… గొప్పల కోసం చెప్పడం లేదు
తాను చిన్నతనం నుంచి అత్యంత సుకుమారంగా పెరిగానని, దేవాలయానికి వెళ్ళినప్పుడు మినహా తన కాళ్లకు చెప్పులు లేదంటే బూట్లు ఉంటాయని రఘురామకృష్ణం రాజు వివరించారు. అటువంటి తన కాళ్లపై పోలీసులు 125 సార్లకు పైగా లాఠీ దెబ్బలను కొడితే కాళ్లు పూరీల ఊబ్బి పోయాయని తెలిపారు.
రాష్ట్రంలో ముగ్గురు నలుగురు అత్యంత ధనవంతులైన కుటుంబాలలో ఒక కుటుంబం లో తాను జన్మించానని పేర్కొన్నారు. తన తాతగారైన సిరీస్ రాజు అప్పట్లోనే విదేశాల్లో విద్యను అభ్యసించి, రాష్ట్రంలో పరిశ్రమను స్థాపించారని తెలిపారు. ఇక తన విద్యాభ్యాసం మద్రాస్, విజయవాడ లయోలా కాలేజ్ తో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో కొనసాగింది. కాలేజీ చదివే రోజుల్లోనే తనకు సొంత కారు ఉండేది. ఇవన్నీ తాను ఎంత సుకుమారంగా పెరిగానో చెప్పడానికి మాత్రమే, గొప్పల కోసం కాదని వెల్లడించారు.

నియోజకవర్గానికి పరిమితం కావలసిన తాను ఇప్పుడు ప్రపంచానికి పరిచయం…
కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కావలసిన తాను ఇప్పుడు ప్రపంచంలో తెలుగు వారందరికీ పరిచయమయ్యానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అక్రమాలను ప్రశ్నించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనని లాకప్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు తెలుగువారు ఎక్కడ ఉన్నా తనని అభిమానిస్తున్నారు. తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు, ఎంతోమంది ఫోన్లు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నలు చెరుగుల నుంచి ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలోని తన అభిమానులు, చెన్నై, బెంగుళూరు నగరాలలో స్థిరపడిన తెలుగువారు తనకు ఫోన్లు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతమంది అభిమానుల ఆశీస్సుల వల్లే తాను బ్రతికి, ఈరోజు మీతో మాట్లాడగలుగుతున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపి కలిసి ప్రభుత్వం ఏర్పాటు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు బిజెపితో కలిసి ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రంలో ఏర్పడనుందని రఘురామకృష్ణం రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. తన ఉదాంతంలో క్షత్రియులను ఉసిగొలిపి తనని తిట్టించినట్టుగానే, ఇప్పుడు కాపులను ఉసిగొలిపి పవన్ కళ్యాణ్ ను తిట్టించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని ఆయన పేరు ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాపు కులస్తులను, పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నం నిష్ప్రయోజనం. ప్రతి కులం లో ను నలుగురు దరిద్రులు ఉంటారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎక్కువమంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని, వారు తిరిగి సొంతగూటికి వెళ్లిపోతే ఆ పార్టీ రాష్ట్రంలో బోణి చేసే అవకాశం ఉంటుందేమో. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడం ఖాయమని రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు.

హవ్వ… సతి లేకుండా యజ్ఞ నిర్వాహణ?
సతీ సమేతంగా యజ్ఞ యాగాదులు నిర్వహించడమన్నది ఆనవాయితీ. కానీ కట్టుకున్న భార్య లేకుండా జగన్మోహన్ రెడ్డి యజ్ఞనిర్వాహణ చేపట్టడం ఆశ్చర్యంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. యజ్ఞ నిర్వహణకు కాసింత కిందకు వంగి జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టగానే, రాష్ట్ర హైకోర్టులో ఆయన ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ని హైకోర్టు కొట్టి వేసింది. ఇక గత రెండేళ్లుగా తాను దాఖలు చేసిన కస్టోడియల్ టార్చర్ పిటిషన్ విచారణకు రాకుండా ఎంతగా అడ్డుకున్నప్పటికీ, ఎట్టకేలకు వివరాలను సేకరించాలని రాష్ట్ర హైకోర్టు సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవాదాయశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగానికి మున్సిపల్ సిబ్బంది, దేవాదాయశాఖ సిబ్బంది మినహా మరెవరు హాజరు కాలేదు. చాగంటి ప్రవచనం నిర్వహించడానికి ఆయన తేదీలు దొరకడమే కష్టం. అటువంటి చాగంటి ప్రవచనాలను నిర్వహించినప్పటికీ 400 కుర్చీలు వేస్తే, ఓ యాభై మంది మాత్రమే హాజరయ్యారు.

సాధారణంగా అయితే, చాగంటి ప్రవచనాలను వినడానికి మహిళలు తండోపతండాలుగా కదిలి వస్తారు. అటువంటి చాగంటి ప్రవచనాలను వినడానికి కూడా యజ్ఞ నిర్వాహణ స్థలానికి ప్రజలు రావడం లేదంటే కారణం ఏమిటి?. యజ్ఞ నిర్వాహణ అంటే చాలు… హిందువులు ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారు. 12 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ దోచేసి నిర్వహిస్తున్న యజ్ఞానికి రోజుకు 200 మంది కూడా హాజరు కావడం లేదంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఎవరికి ఇష్టం లేదని స్పష్టమవుతోంది. యజ్ఞ స్థలానికి ప్రజలకు 200 నుంచి 300 ఇచ్చి బిర్యాని పొట్లాలను పంచి తీసుకు వస్తారేమో. భార్య లేకుండా యజ్ఞం చేయడం ఏమిటని ఆగమ శాస్త్ర పండితులు ఘోషిస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి భార్య అందుబాటులో లేదని, అందుకే తాను సతీసమేతంగా యజ్ఞాన్ని నిర్వహించానని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొనడం హాస్యాస్పదం.

దేవాలయం కంటే పవిత్రమైన యజ్ఞస్థలంలో జగన్మోహన్ రెడ్డి చెప్పులు వేసుకుని తిరగడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. మక్కా, జెరూసలాం కు వెళితే రాయితీలను ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం, హిందూ దేవాలయాలకు వెళితే భక్తులను నిలువు దోపిడీ చేస్తోంది. భగవంతుడి నుంచి భక్తుడిని దూరం చేసే కుట్రలో ఇదొక భాగం. ఈ ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి చూస్తున్న రాష్ట్ర ప్రజలు తాము ఉమ్మేస్తే, ఆ ఉమ్ము ప్రవాహములోనే వారు కొట్టుకు పోయేలా చేయాలనుకుంటున్నారు. ఈ పార్టీ అంటే ఎవరికి ఇష్టంలేదు. అందుకే మూకుమ్మడిగా యజ్ఞాన్ని బహిష్కరించారు. ప్రజలకు ఈ పార్టీ, ప్రభుత్వం ఇష్టం లేదని భగవంతుడు కూడా తేల్చేశారు. వై నాట్ 175 అంటున్న తమ పార్టీకి ఒక్క స్థానం కూడా డౌటే. మేము అవుట్ అన్నది ఖాయమని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

కర్ణాటకలో బిజెపి గెలుస్తుందని భావించా…
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని తాను భావించానని రఘురామకృష్ణం రాజు తెలియజేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తెలుగువారు వెళ్లి, అక్కడి తెలుగు వారికి కష్టాలను గుర్తు చేసినట్లయింది. ప్రధానమంత్రి మోడీ భక్తుడిగా, అభిమానిగా కేంద్ర ప్రభుత్వ పాలన చూసి కర్ణాటకలో బిజెపి విజయం ఖాయమని భావించాను. అయితే జగన్మోహన్ రెడ్డి సెగ బిజెపికి తగిలినట్టుగా కనిపిస్తుంది.
సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పట్ల ఇంత కోపం తెలుగువారికి ఉండే అవకాశం లేదు. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యం. కనపడే ప్రతిబంధకాలు ఏమీ లేనప్పటికీ సిబిఐ అధికారులు, అవినాష్ రెడ్డి ని ఎందుకు అరెస్టు చేయడం లేదో అర్థం కావడం లేదు. ఈ కేసులో మరి కొంతమందికి నోటీసులు అందడం ఖాయమే. వారు ఎవరన్నది తినబోతూ రుచులు ఎందుకు? అని రఘురామకృష్ణంరాజు ఎదురు ప్రశ్నించారు.

LEAVE A RESPONSE