Suryaa.co.in

Andhra Pradesh Features

సెంట్రల్ కర్ణాటక ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి ఓ హెచ్చరిక

కర్ణాటక ఫలితాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎవరికి వారు సానుకూల – ప్రతికూల అంశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. మిగతా అంశాలు ఎలా ఉన్నా సెంట్రల్ కర్ణాటక ఫలితాలను నిశితంగా పరిశీలిస్తే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి ఓ హెచ్చరిక లాంటిదే అనక తప్పదు. సెంట్రల్ కర్ణాటక వెనుకబడిన ప్రాంతం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి , ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం మూడు రాజధానుల ఆలోచన.

వెనుకబడిన ప్రాంత ఆకాంక్షను గౌరవించడం అంటే అధికారంలో ఉన్న పార్టీ తన పరిధిలో ఉన్న ప్రతి అంశాన్ని నిజాయితీగా అమలు చేస్తూ కీలక అంశంపై దృష్టి సారించాలి. కేవలం భావోద్వేగాలతో కూడిన అంశంపై హామీ ఇచ్చి తమ పరిధిలోని అంశాల అమలులో ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తే ప్రజలు విశ్వసించరు అనడానికి సెంట్రల్ కర్ణాటక ఫలితాలు మంచి ఉదాహరణ.

అది ఎలా అంటే .. సెంట్రల్ కర్ణాటక – ఎగువభద్ర
తుంగభద్ర నదిపై ఎత్తిపోతల పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. ఎగువభద్ర ప్రాజెక్టు వల్ల వెనుకబడిన సెంట్రల్ కర్ణాటక పరిధిలోని చిక్కమంగుళూర్ ,చిత్రదుర్గ ,తూముకుర్,దావేనెగేరె ప్రాంతాల నీటి సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాయలసీమ ప్రయోజనాలను ,సీమకు ప్రత్యేక ప్యాకేజి ఉన్నా అన్నింటినీ పక్కకు నెట్టి నిబంధనలను , కోర్టు తీర్పును కూడా మరచి ఎగువ భద్రకు జాతీయ హోదా వెను వెంటనే 5 వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.

అసలు ఉద్దేశ్యం ఎగువభద్ర వల్ల ప్రయోజనం కలిగే 28 శాసనసభ నియోజకవర్గాలలో ప్రయోజనం కోసం. ఎన్నికల ముందు జాతీయ హోదా ప్రకటించి నిధులు మంజూరు చేసినా 28 నియోజకవర్గాలలో బీజేపీ గెలిచింది కేవలం దాదాపు నాలుగు , ఐదు స్థానాల్లో . అంటే ప్రభుత్వం పట్ల రాజకీయ వ్యతిరేకత , తాము చేయాల్సిన సమయంలో చేయకుండా ఎన్నికల సమయంలో భావోద్వేగాలతో కూడి సదరు ప్రాంత ప్రయోజనాలతో ముడిపడిన అంశంపై నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ప్రజలు హర్శించారు.

ఏపీ ప్రభుత్వం హెచ్చరికగా తీసుకోవాల్సిన అంశం..
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి , రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని మూడు రాజధానుల ఆలోచనను వైసీపీ ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ఈ ప్రతిపాదనలలో పరిమిత ప్రయోజనం మాత్రమే కలుగుతుందని తెలిసినా కనీసం హైకోర్టుతో బాటు న్యాయ స్వభావం కలిగి ఉన్న KRMB లాంటి కార్యాలయాలు వస్తాయి అన్న చిన్న ఆశ రాయలసీమ ప్రజలది. చారిత్రిక కారణాలు రిత్యా రాజధాని అంశంపై అమరావతి – రాయలసీమ ప్రజలకు భావోద్వేగాలతో కూడిన అనుబంధం ఉంది. విశాఖ సమాజానికి అంత ఆసక్తి ఉన్నట్లు కనపడటం లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం రాజధానిపై అనుబంధం ఏర్పాటు చేసుకున్న రాయలసీమ, అమరావతి ప్రజల మనోగతాన్ని కాకుండా విశాఖ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తుంది.

వైసీపీ ప్రభుత్వం రాయలసీమకు న్యాయ రాజధాని అని ప్రకటించి తన పరిధిలోని సీమ ప్రజల ఆకాంక్షలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకు ఉదాహరణ KRMB కార్యాలయాన్ని కర్నూలులో కాకుండా సంబంధం లేని విశాఖలో పెడుతుంది. సీమ గొంతుకలు ఎన్ని వినతులు చేసినా కనీసం ఎందుకు నిర్ణయం తీసుకున్నామో కూడా వివరణ ఇవ్వకుండా అడిగే గొంతుకలు స్థాయి ఎంత ? మాకు అధికారం ఉంది చేస్తాము అన్న రీతిలో వ్యవహరిస్తున్నది.

ఎగువభద్రకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించినా, జాతీయ రహదారిలో భాగంగా సిద్దేశ్వరం వద్ద తీగల వంతెనను కేంద్రం ప్రకటించి ముందుకు వెళుతుంటే సీమ ప్రజల చిరకాల వాంఛ సీమ నీటి సమస్య పరిష్కారానికి కీలకమైన సిద్దేశ్వరం అలుగు కోసం కనీసం స్పందించలేదు. సీమ ఉద్యమ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా తమ వైఖరి ఏమిటో కనీసం చెప్పడం లేదు. ఇక్కడ కూడా అడిగేవారు ఎంత ? మాకు బలం ఉన్నది అన్నట్లు వ్యవహరిస్తోంది.

స్థూలంగా తాము అధికారంలో ఉన్న సమయంలో చేయకుండా ఎన్నికల సమయంలో ఎగువభద్రకు జాతీయ హోదా ఇచ్చినా సెంట్రల్ కర్ణాటకలో బీజేపీని ప్రజలు తిరస్కరించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం సిద్దేశ్వరం అలుగు , KRMB ,లాంటి తన పరిధిలోని అంశాలపై ఏమాత్రం పట్టించుకోకుండా రాయలసీమకు హైకోర్టు హామీ ఇచ్చాము రాయలసీమ ప్రజలు భావోద్వేగాలతో మాతోనే ఉంటారు అనుకుంటే సెంట్రల్ కర్ణాటక ప్రజలు లాగా రాయలసీమ ప్రజలు ఆలోచిస్తే , తమ పరిస్థితి ఏమిటని అధికార దర్పంతో కాకుండా వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే తత్వం బోధపడవచ్చు.

– మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
రాయలసీమ మేధావుల ఫోరం. సమన్వయ కర్త

LEAVE A RESPONSE