Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం సమష్టి పోరాటం చేద్దాం

  • ముఖ్యమంత్రి పదవికి సుముఖంగానే ఉన్నా
  • చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి పని చేద్దాం
  • సమష్టిగా ముందుకు వెళ్లి విజయకేతనం ఎగురవేద్దాం
  • మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను  అందజేసిన పవన్ కళ్యాణ్ 

‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి నేను పూర్తి సుముఖంగా ఉన్నాను. వైసీపీని గద్దె దించే రాజకీయ ప్రయాణంలో ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం వస్తే దాన్ని కచ్చితంగా స్వీకరిస్తాను. అయితే దాని కంటే ముందు నాకు రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాలే ముఖ్యం’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో వివిధ పదవుల్లో నూతనంగా నియమించిన వారికి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… 2024లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి దూరం చేసి జనసేన- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడేలా ప్రతి కార్యకర్త బలంగా పనిచేయాలి. ఈ ప్రయాణంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి నేను సుముఖంగానే ఉంటాను. అంతకంటే ముందు రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అధిక ప్రాధాన్యం ఇస్తాను. దశాబ్దకాలంగా జనసేన రాజకీయ ప్రయాణంలో నాతో కలిసి నడిచిన, పార్టీ అభ్యున్నతి కోసం ఎల్లవేళలా కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు.

ప్రతికూల పరిస్థితుల్లోనే ఓ మనిషి అసలు స్వరూపం బయటపడుతుందని చెబుతారు. పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో నా వెంట నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలోకి రాగానే అధికారం, పదవులు వస్తాయని చాలా మంది భావించారు. వారంతా తర్వాత కాలంలో వెళ్లిపోయారు. అయితే ఎలాంటి పదవులు లేకున్నా, అధికారంలోనూ లేకపోయినా నాతో పాటు కలిసి నడిచి, పార్టీ కోసం పనిచేసిన వారు ఎందరో ఉన్నారు. వారి సేవలు, వారిని నిత్యం గుర్తుపెట్టుకుంటాను.

2024లో సమష్టిగా రాష్ట్ర బాగు కోసం, వైసీపీని తరిమికొట్టడం కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అధిగమించి పని చేద్దాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాం అనేది అంతా గుర్తు పెట్టుకోవాలి. జనసేన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీలక కార్యకర్తలే. పార్టీ నిర్ణయాలను అందరితో చర్చించిన తర్వాతే నేను నిర్ణయం తీసుకుంటాను. కేవలం 150 మంది సభ్యులతో మొదలైన జనసేన ప్రస్థానం నేడు 6.50 లక్షల క్రియాశీలక సభ్యులకు చేరింది. ప్రతిరోజూ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతూ పార్టీని ముందుకు నడిపిస్తున్న నాదెండ్ల మనోహర్ పార్టీకి వెన్నెముకగా పనిచేస్తున్నారు. ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చే ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం పార్టీ విజయం

రాష్ట్రానికి కచ్చితంగా ఓ దిశానిర్దేశం చూపేలా ఉండబోతోంది. పార్టీకి సంబంధించిన 12 కమిటీల్లో రాష్ట్ర కార్యవర్గం 200 పైచిలుకు సభ్యులు అయ్యారు. నూతనంగా రాష్ట్ర కార్యవర్గంలో చేరిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేయాలని కోరుతున్నాను’’ అన్నారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “పార్టీ కార్యవర్గంలో మరికొందరికి స్థానం కల్పిస్తూ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో జన సైనికులు, వీర మహిళలు, నాయకులని సమన్వయం చేసుకోవడం అవసరం” అన్నారు.

ఈ రోజు నియామక పత్రాలు అందుకున్నవారు…
జనసేన పి.ఎ.సి. సభ్యురాలిగా :పడాల అరుణ (విజయనగరం జిల్లా)
ఉమ్మడి విశాఖపట్నం (రూరల్) జిల్లా అధ్యక్షులుగా :పంచకర్ల రమేష్ బాబు
క్రియాశీలక సభ్యుల శిక్షణ విభాగం ఛైర్మన్ : ఈదర హరిబాబు (ప్రకాశం జిల్లా)
ప్రోటోకాల్ విభాగం ఛైర్మన్  : మల్లినీడి తిరుమలరావు (పశ్చిమ గోదావరి జిల్లా)
ఉంగుటూరు అసెంబ్లీ ఇంఛార్జ్ : పత్సమట్ల ధర్మరాజు (ఉమ్మడి ప.గో.)
ఉండి అసెంబ్లీ ఇంఛార్జ్  : జుత్తిగ నాగరాజు (ఉమ్మడి ప.గో.)

రాష్ట్ర కార్యదర్శులు:
ఆమంచి శ్రీనివాసులు (చీరాల)
పిసిని చంద్రమోహన్ (శ్రీకాకుళం జిల్లా)
రత్నం అయ్యప్ప (రాజమండ్రి రూరల్)
గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ (రాజోలు)
చాగంటి మురళీకృష్ణ (నరసాపురం)
మండలి రాజేష్ (అవనిగడ్డ)

 రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు:
చిత్తలూరు సుందర రామిరెడ్డి (నెల్లూరు)
పాతూరు నారాయణస్వామి మహేష్ (మదనపల్లె)
మేడిశెట్టి సూర్యకిరణ్ (ప్రత్తిపాడు –ఉమ్మడి తూ.గో.)

LEAVE A RESPONSE