– కాస్త సౌండ్ బాగా పెంచండమ్మా..
– రావాలి జగన్.. కావాలి జగన్..
మూడు రాజధానులతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను త్రిశంకు స్వర్గంలో నిలబెట్టిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు 26 జిల్లాల ప్రకటనతో కొత్త డ్రామాకు తెర తీశారా..? అంటే అవుననే అనుమానేలే జనాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ 30 ఏళ్ళ పాటు జనం గుర్తుంచుకునే పాలన అందిస్తాను అంటే.. ఏపీ ప్రజలు మొదట్లో ఏమో అనుకున్నారు. కానీ.. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న పిచ్చి తుగ్లక్ నిర్ణయాలతో.. ఇప్పుడు ఆ మాటల్లో ఆంతర్యాన్ని అర్ధం చేసుకుంటున్నారు.
కరువుదేశం దక్షిణాఫ్రికా మోడల్ అంటూ.. మూడు రాజధానులతో జగన్.. ఏపీ ప్రజలతో మూడు ముక్కలాటే ఆడారు. ఈ క్రమంలోనే రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్ పెట్టారు. ఆ తరువాత సీపీఎస్ రద్దును అటకెక్కించిన ఆయన.. తాను గద్దెనెక్కటానికి ప్రధాన కారకుల్లో ఒకరైన ఉద్యోగులకూ పంగనామాలు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ మాటేమో గానీ.. పీఆర్సీ అమల్లో రివర్స్ పాలసీని తీసుకొచ్చి.. ఉద్యోగుల జీతాలకు అంటకత్తెర వేశారు.
ఏపీ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ రుచి చూపించిన ఆయన.. జీతాల్లో భారీ కోతలను మిగిల్చారు. నగదు బదిలీలు, సంక్షేమ పథకాలకు సైతం మద్యం అమ్మకాల నిధులు సరిపోక పోవటంతో… రోజుకో కొత్త డ్రామాకు తెర తీస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో కేబరేలు, క్యాసినోలకు అనుమతిచ్చి.. రాష్ట్ర పరువును హోల్ సేల్‌గా బజారు కీడ్చారు. ఓవైపు పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు.. మరోవైపు ఉద్యోగుల నిరసన సెగలతో.. ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు 26 జిల్లాల ఏర్పాటు అనే కొత్త
నాటకానికి తెర లేపారు. కన్విన్స్ చేయలేక పోతే… కన్ఫ్యూజ్ చేయాలనే కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నారు.ఒక సమస్య నుంచి జనం దృష్టిని మరల్చాలంటే మరో పెద్ద సమస్యను క్రియేట్ చేయాలనే లక్ష్యంతో.. జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలతో మరో నాటకాన్ని విజయవంతంగా ఆడుతున్నారు. అయితే.. జగన్ మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టుగా 2019 నాటి పరిస్థితులు ఇప్పుడు ఏపీలో లేవు. అప్పట్లో గుడ్డిగా జగన్ మాటల్ని నమ్మి ఓటేసిన ప్రజలు.. ఇప్పుడు అతను ఆడుతున్న డైలీ డ్రామాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ఆపసోపాలు పడుతున్న జగన్ ఇప్పుడు కొత్త జిల్లాల్లో కొత్త ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బందిని ఎక్కడి నుంచి తీసుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే ప్రత్యేక హోదా డిమాండ్‌కు పాతరేసిన ఆయన.. నిరుద్యోగ యువతను చేపలు, రొయ్యలు, మటన్, చికెన్ అమ్ముకోండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. పొరుగునే ఉన్న తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేసిన కేసీఆర్.. అక్కడ కొత్తగా ఉద్యోగాలు కల్పించలేక ఏనాడో చేతులెత్తేశారు. తెలంగాణ వీధుల్లో నిరుద్యోగ యువత.. కేసీఆర్ కు వ్యతిరేకంగా దుమ్మెత్తి పోస్తున్నారు. యూనివర్సిటీల్లో ముఖ్యమంత్రి దిష్టి బొమ్మల దహనం చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది మనం కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూస్తున్న చరిత్ర. మరి 26 జిల్లాల ప్రకటనతో ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్న ఏపీ సీఎం జగన్.. బుట్టలో జనం మరోసారి పడతారో లేదో వేచి చూడాలి. అయితే… ఇప్పటికే ఏపీ ఖజానాను ఖాళీ చేసిన జగన్ అండ్ కో.. చేతిలో చిల్లిగవ్వలేక అప్పుల కోసం తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కుతోంది. ప్రభుత్వ ఆస్తులను అడ్డగోలుగా అమ్మేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 26 జిల్లాల ప్రకటనతో ఎవర్ని ఉద్ధరిస్తారో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే చెప్పాలి. మరోవైపు కొత్త జిల్లాల ప్రకటనకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి జగన్ జిల్లాకో ఎయిర్ పోర్టు అంటూ.. ప్రకటన చేశారు. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఓ స్థాయిలోనే ట్రోలింగ్ జరిగింది.
నడవటానికి సరైన రోడ్లు లేవు కానీ… జిల్లాకో ఎయిర్ పోర్టు నిర్మిస్తాడంట అంటూ జనాలు ఎకసెక్కాలు ఆడుతున్నారు. ఇంతలోనే 13 జిల్లాలను 26 ముక్కలు చేసిన జగన్.. జిల్లాకు ఓ ఎయిర్ పోర్టు చొప్పున.. 26 జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తారా అంటూ..? సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌ను అయోమయం జగన్నాధం అనే తీరుగా తయారు చేస్తున్న ఈ కలికాలపు తుగ్లక్ చర్యలకు విస్తు పోతున్నారు.
-రాధాకృష్ణ