– ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే ఏపీ గురించి మాట్లాడాలి
– నేను స్టాన్ ఫోర్డ్ వరకు వెళ్లానంటే దానికి కారణం నా ఉపాధ్యాయులు
– టీచర్ల కృషితోనే ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు
– లీప్ మోడల్ ను పకడ్బందీగా అమలుచేయాలి
– డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ
– గత ప్రభుత్వ హయాంలో వైన్ షాపుల ముందు టీచర్లు
– విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన గురుపూజోత్సవంలో మంత్రి నారా లోకేష్
– సీఎం చంద్రబాబుతో కలిసి 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేత
విజయవాడ: ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే ఏపీ గురించి మాట్లాడాలని, అందరం కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను సాకారం చేద్దామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మానవ వనరులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన గురుపూజోత్సవంలో సీఎం చంద్రబాబునాయుడు తో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. సీఎంతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. నా లైఫ్ టీచర్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామంటే ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించే కార్యక్రమం.
ఈ వేడుకలో పాల్గొన్న మీ అందరికీ పేరుపేరునా నమస్కారాలు. మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లీ దైవం, తండ్రీ దైవం, గురువు కూడా దైవమే. గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యావ్యవస్థకు, దేశానికి ఆయన అందించిన సేవలు స్మరించుకుందాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినట్టు The true teachers are those who help us think for ourselves అనేది గురువులంతా ఆచరిస్తే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిషన్ (లీప్) సక్కెస్ అవుతుంది.
చదువు ఒక వ్యక్తిని పేదరికం నుంచి బయటకు తీసుకువస్తుంది
ఒక చిన్న కథ చెబుతాను… ఇది నిజంగా జరిగిన కథ. పందొమ్మిదేళ్ళ యువకుడు 50 ఏళ్ల వ్యక్తికి డ్రైవరుగా వచ్చాడు. కారులో వెళ్తుండగా ఏం చదివావు అని అడిగాడు పెద్దాయన.. టెన్త్ ఇంగ్లీషులో ఫెయిలయ్యాను అని చెప్పాడు డ్రైవర్. నేను హెల్ప్ చేస్తాను పాసవ్వాలి అని చెప్పి… ఆఫీసు అయ్యాక ఆ డ్రైవరుకి ఇంగ్లీషు పాఠాలు చెప్పాడు ఆ పెద్దాయన. టెన్త్ పాసైన డ్రైవరుకి ఇంటర్ ఫీజు కట్టి పుస్తకాలిచ్చాడు.
ఆఫీసు అయ్యాక డ్రైవరు ఇంటర్ పుస్తకాలు, పెద్దాయన లైబ్రరీ పుస్తకాలు పోటా పోటీగా చదివేవారు. ఇంటర్ అయ్యింది.. ఈ సారి బీఏ టార్గెట్. అదీ కంప్లీట్ అయింది. పీజీ చెయ్ అన్నాడాయన. డ్రైవరు ఆలోచించాడు. తనను చదివిస్తున్న వ్యక్తి గ్రాడ్యుయేట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే అతన్ని దాటిపోతానేమో అని భయపడ్డాడు. పెద్దాయన డ్రైవరుకి విమానం టిక్కెట్టు కొని మరీ పరీక్షలకు పంపాడు. గొప్ప గురువులెప్పుడూ తమ శిష్యులు తమకంటే పైకి ఎదగాలని కోరుకుంటారు.
టెన్త్ పోయిన ఆ అబ్బాయి పీహెచ్ డీ పూర్తి చేశారు.. ఆ గొప్ప గురువు మిస్సైల్ మేన్ అబ్దుల్ కలాం. ఆ డ్రైవర్ పేరు కదిరేశన్. చదువు ఒక వ్యక్తిని పేదరికం నుంచి బయటకు తీసుకువస్తుంది అనేందుకు ఇదో ఉదాహరణ. Teaching is a very noble profession that shapes the character, caliber, and future of an individual. If the people remember me as a good teacher, that will be the biggest honour for me అన్న A.P.J.Abdul Kalam గారి స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను..
నేను స్టాన్ ఫోర్డ్ వరకు వెళ్లానంటే దానికి కారణం నా ఉపాధ్యాయులు
మిమ్మల్ని చూసిన తరువాత నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు బాగా అల్లరి చేసే వాడిని. మాది రౌడీ, గోల బ్యాచ్. మేం బ్యాంక్ బెంచర్స్. బ్యాక్ బెంచ్ నుండి స్టాన్ ఫోర్డ్ వరకూ వెళ్ళానంటే అందుకు కారణం గురువులు చూపించిన దారి. నన్ను తీర్చిదిద్దింది మంజులా మేడమ్, ప్రిన్సిపల్ రమాదేవి. ఆ తర్వాత పి.నారాయణ, ప్రొఫెసర్ రాజిరెడ్డి. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా మీ ముందు ఉన్నానంటే కారణం ఈ నలుగురు. నేను మొదట గౌరవించేది నా తల్లిని, తర్వాత ఉపాధ్యాయులను. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత బెస్ట్ టీచింగ్ ప్రాక్టీసెస్ అమలు చేస్తున్న టీచర్లను వారానికి ఒకరిని పిలిచి షైనింగ్ టీచర్ పేరుతో వారిని గౌరవిస్తున్నాను. వారి నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుసుకుంటున్నాను.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే పిలుపునకు టీచర్ల స్పందన అద్భుతం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి అని నేను ఇచ్చిన పిలుపుకు ఉపాధ్యాయులు స్పందించిన తీరు అద్భుతం. కొంతమంది టీచర్లు స్కూటర్ కు మైక్ కట్టుకొని ఊరిలో ఉన్న అన్ని వీధులు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ప్రచారం చేశారు. ఒక మహిళా టీచర్ మాట్లాడిన మాటలు నాకు చాలా బాగా గుర్తుండిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు పిల్లలను ఎందుకు చేర్చాలి అని ఒక జర్నలిస్టు మహిళా టీచర్ ను అడిగారు. ఆమె చెప్పిన సమాధానం.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే తల్లిదండ్రులకు జీరో ఇన్వెస్ట్మెంట్.. హై రిటర్న్స్ అన్నారు ఆమె. ఎలా అని ప్రశ్నించారు ఆ జర్నలిస్ట్. ప్రైవేట్ స్కూల్ లో చేర్పిస్తే ఫీజు కట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజు జీరో అన్నారు. ప్రైవేట్ స్కూల్ లో యూనిఫామ్, టై, బెల్ట్, షూస్, టెక్స్ట్ బుక్స్, నోట్స్ అన్నింటికీ డబ్బులు కట్టాలి. అదే గవర్నమెంట్ స్కూల్ లో అయితే యూనిఫామ్, టై, బెల్ట్, షూస్, టెక్స్ట్ బుక్స్, నోట్స్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అన్నీ ఫ్రీ. అంతే కాదు మా దగ్గర క్వాలిఫైడ్ అండ్ క్వాలిటీ టీచర్లు ఉంటారని ఆమె గర్వంగా చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు… కారణం ఉపాధ్యాయులే…
చంద్రబాబు నాయకత్వంలో చరిత్రలో మొదటిసారి కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్లు బోర్డులు పెట్టారు. ఇందుకు కారణం ఇక్కడున్న ఉపాధ్యాయులు. ముఖ్యమంత్రితో పనిచేయడం అంత తేలిక కాదు. ఎప్పుడూ లేనివిధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాం. ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, విద్యార్థులను అనుసంధానం చేశాం. చాలా మంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే అవసరమా అని చెప్పారు. ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం అని వారికి చెప్పా. గడిచిన ఏడాదిలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. మీ అందరితో చర్చించే తీసుకువచ్చాం. అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పడం లేదు. మీ స్వరం విన్న తర్వాతనే సంస్కరణలు తీసుకువచ్చాం. మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయి. వచ్చే నాలుగేళ్లు సంస్కరణలు ఉండవు.
లీప్ మోడల్ ను పకడ్బందీగా అమలుచేయాలని కోరుతున్నా…
ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్.. లీప్ మోడల్ ను పకడ్బందీగా మీరు అమలుచేయాలని కోరుతున్నా. కరిక్యులమ్ లో అనేక మార్పులు తీసుకువచ్చాం. ప్రైమరీ స్కూల్స్ లో తరగతికో ఉపాధ్యాయుడు విధానం తీసుకువచ్చాం. 9,600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటుచేశాం. సెమిస్టర్ వైజ్ టెక్ట్స్ బుక్స్ ను అందిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి యోగా, ఎన్ సీసీ, ఎన్ ఎస్ఎస్ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వ విద్యలో రాజకీయాలను దూరంగా పెట్టాం. ఇక్కడున్న బోర్డులో సీఎం ఫోటో కూడా లేదు. పిల్లల యూనిఫామ్స్, పుస్తకాల్లో రాజకీయ నేతలు ఫోటోలు లేవు. వివిధ కార్యక్రమాలకు గొప్ప వాళ్ల పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పెట్టాం. కడప జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం కోసం సెంట్రలైజ్జ్ కిచెన్ మోడల్ ప్రారంభించాం. రాబోయే రోజుల్లో అద్భుతమైన న్యూట్రిషియస్ ఫుడ్ అందించేలా ముందుకు వెళ్తున్నాం.
డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ
పారదర్శకంగా టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తీసుకువచ్చాం. మొదటి సారి సీనియర్ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడూ లేనివిధంగా ప్రమోషన్లు కల్పించాం. సుమారు 80శాతం మంది ఉపాధ్యాయులు చంద్రబాబు హయాంలో నియమితులైన వారేనని బలంగా నమ్ముతున్నాను. డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ. 13 డీఎస్సీ ల ద్వారా లక్షా 80వేల మంది ఉపాధ్యాయులను నియమించారు. మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు.
యువకుడిని, విద్యావంతుడిని. కానీ డీఎస్సీ అంటే ఎంత ఛాలెంజింగ్ మీ అందరికీ తెలుసు. డీఎస్సీ విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఏడాదిలోనే పూర్తిచేయడం చాలా కష్టమైన పని. చంద్రబాబు డైరెక్షన్ లో పూర్తి చేశాం. ఈ సందర్భంగా అధికారులను కూడా అభినందిస్తున్నా. గతంలో ఇచ్చిన అన్ని డీఎస్సీ నోటిఫికేషన్లు చదవాలని చెప్పా. డీఎస్సీ ఆగకూడదని చెప్పా. ఇప్పటికే దాదాపు 70 కేసులు నమోదయ్యాయి. కానీ డీఎస్సీ ఎక్కడా ఆగలేదు. సెప్టెంబర్ లో 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్ కు వస్తారు.
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా పాఠ్యాంశాలు
చాగంటి కోటేశ్వరరావు నాయకత్వంలో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించాం. ఇంటర్ లో కరిక్యులమ్ రీవ్యాంప్ చేశాం. ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. యూనివర్సిటీల్లో నియామకాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది పూర్తిచేస్తాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రా యూనివర్సిటీ గతంలో ఏడో స్థానం నుంచి ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకుంది. స్టేట్ యూనివర్సిటీ కోటాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చే దిశగా పనిచేస్తాం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కరిక్యులమ్ మెరుగుపర్చాలి. స్థానికంగా ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు లింక్ చేయాలని సీఎం గారు చెప్పారు. ఆ దిశగా ప్రయాణిస్తున్నాం.
గత ప్రభుత్వ హయాంలో వైన్ షాపుల ముందు టీచర్ల కాపలా!
ఇక్కడున్న ఉపాధ్యాయులు కూడా ఆలోచించాలి. 2019 నుంచి 2024 వరకు ఒక విచిత్రమైన పాలన చూశాం. ప్రతి రోజూ కొత్త సంస్కరణ తీసుకురావడం వల్ల దాదాపు 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరం అయ్యారు. న్యాస్, ఏఎస్ఆర్ నివేదికలో కూడా లెర్నింగ్ అవుట్ కమ్స్ లో వెనుకబడిన పరిస్థితి. ఉపాధ్యాయులు ఏకంగా వైన్ షాపుల ముందు కాపలా కాసే పరిస్థితి.
ఉపాధ్యాయ బదిలీల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఉపాధ్యాయులను ఎలక్షన్ డ్యూటీ తప్పించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. ఇన్ని కష్టాలను ఎదుర్కొని.. ఆంధ్ర రాష్ట్రంలో అద్భుత ఫలితాలు రాబోతున్నాయని మొత్తం దేశం మనవైపు చూసేవిధంగా మీరు చేసినందుకు ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు.
గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ పై దృష్టి పెట్టాలి
మంత్రిగా మీ ముందు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా ఉపాధ్యాయులు. అందుకే ఉపాధ్యాయులను కొన్ని విషయాలను కోరాలనుకుంటున్నాను. మొదటిది గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్. మన పిల్లలకు మ్యాథ్స్, లాంగ్వేజెస్ లో బేసిక్స్ రావాల్సిన అవసరం ఉంది. నేర్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. న్యాస్, అసర్ నివేదిక చూస్తే.. జాతీయ సగటు కంటే ఏపీ తక్కువగా ఉంది. ఇందులో చాలా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. బ్రిడ్జి కోర్సుల వల్ల నేను చాలా నేర్చుకున్నాను. పిల్లలకు కూడా బ్రిడ్జ్ కోర్సు చాలా అవసరం. దీనివల్ల ఈ ఎవాల్యూషన్ లో కూడా టాప్ -3 రాష్ట్రాల్లో ఏపీ నిలబడాలని, ఇందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని కోరుతున్నాను.
ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే ఏపీ గురించి మాట్లాడాలి
పోటీ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున ర్యాంకులు సాధించాలి. మనకు అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. కంటెంట్, మెటీరియల్ ఇస్తాం. మనకు వచ్చే పిల్లలు నిరుపేద కుటుంబాల నుంచి వస్తారు. వారికి సరైన దిశానిర్దేశం చేస్తే అద్భుతాలు చేస్తారు. అది చేసి చూపించాల్సిన బాధ్యత మనందరిది. విద్యలో ఢిల్లీలో మేజిక్ జరుగుతోందని అంటున్నారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను భావిస్తున్నాను.
ప్రభుత్వ విద్య గురించి ఎవరైనా మాట్లాడితే ఏపీ గురించి మాట్లాడాలి. చేసి చూపించే శక్తి మనందరికీ ఉంది. మనకు చాలా పాజిటివ్ లీడర్ షిప్ ఉంది. అందరం కలసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను కేవలం దేశానికే కాదు.. ప్రపంచానికి చేసి చూపించాలని ఉపాధ్యాయులందరినీ కోరుతున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఏంపీ కేశినేని చిన్ని, ప్రభుత్వ చీఫ్ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాసరావు, ఏపీ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ కుప్పం రాజశేఖర్, సీడాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు