-మా పరిధిలో ఉండే కేసులుకి తప్పకుండా పరిష్కారం చూపుతాము
-బాధితుల వద్దకే వొచ్చి సమస్య విని, పరిష్కారం చూపడానికే జిల్లా పర్యటనకు వస్తున్నాం..
-కమీషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి
మానవీయ విలువలు కాపాడడం కోసం ప్రజల కష్టాలను వారి వద్దకే వొచ్చి సమస్యలను వారి కోణం నుండి వినడం ద్వారా పరిష్కారం కోసం జిల్లా పర్యటన చేస్తున్నట్లు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి తెలియచేశారు.
రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో క్యాంపు కోర్టు నిర్వహించిన రాష్ట్ర మానవ హక్కుల కమీషన్, సాయంత్రం జిల్లా అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలు, మీడియా ప్రతినిధులకు మానవ హక్కుల పరిరక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో కమీషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు, సెక్రటరీ అండ్ సిఈఓ సంపర వెంకట రమణ మూర్తి పాల్గొని వివిధ అంశాలపై అధికారులకు విశదీకరించారు. ఈ సందర్భంగా కమీషన్ చైర్మన్ జస్టీస్ సీతారామమూర్తి మాట్లాడుతూ సావధాన చిత్తంతో, సహృదయంతో ప్రజల సమస్యలు వారి కోణంలో ఆలకించి పరిష్కరించాలన్నారు.
రాజ్యాంగపరమైన, చట్టపరమైన, రాజకీయపరమైన అన్ని హక్కులు మానవీయ కోణం ఉన్న అన్ని అంశాలు మానవ హక్కుల క్రిందకే వస్తాయన్నారు. ప్రజలకు రాజ్యాంగం ద్వారా కలిగిన హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వ అధికారులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రజల కోసం నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగం మనకు దైవికంగా వచ్చిన ఒక గొప్ప అవకాశం అన్నారు. ప్రజల కోసం చేసే పనులను దైవీకమైన పనులుగానే భావించాలన్నారు. ప్రజల పట్ల, దేశం పట్ల ప్రేమను పెంచుకోవాలని, ప్రజల సమస్యలను వారి కోణం నుండి ఆలోచన చేసి పరిష్కరించాలన్నారు. ఫిర్యాదు చేసే వారి పట్ల గౌరవంతో వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ వ్యవస్థలు అన్ని వత్తిడిలో పనిచేస్తున్నాయని, వాస్తవంగా కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉందన్నారు. ప్రజలకు సేవలందించేందుకు అధికారులు కొద్ది గంటలు అదనంగా పనిచేస్తే దీనిని అధిగమించ వచ్చునన్నారు. వారి వారి సమస్యలు తెలియ చెయ్యడానికి వొచ్చే ప్రజలతో సంయమనంతో వారి సమస్య విని , ప్రశాంతతో వ్యవహరించాలని, అపహాస్యం చేయవద్దని సూచించారు. మానవ హక్కుల కేసులలో రిపోర్టులు, సమాధానాలు, అభ్యంతరాలు, కౌంటర్లు దాఖలు చేసేటప్పుడు అధికారులు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులందరూ పాటించాలని, వాటిని అధికారులకు సర్క్యులర్ చేశామన్నారు. అలాగే మానవ హక్కుల పరిరక్షణ కొరకు పనిచేస్తున్న సంస్థలు జాతీయ, రాష్ట్ర మానవ హక్కల కమీషన్ పేరు స్పురించేలా తమ సంస్థ పేర్లను పెట్టుకోకూడదని ఆయన తెలియజేశారు. కక్షిదారుల సౌకర్యం కొరకు క్షేత్ర స్థాయిలో కమీషన్ నిర్వహిస్తున్న క్యాంపు కోర్టులకు మంచి స్పందన లభిస్తోందని, ఇది ఎంతో ఆత్మ సంతృప్తి ని కలుగ చేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగాంగానే రాజమహేంద్రవరంలలో క్యాంపు కోర్టులు ఏర్పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాజమహేంద్రవరంలో బుధవారం నిర్వహించిన సిట్టింగ్ లో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, తదితర శాఖలకు చెందిన మొత్తం కేసులకు సంబంధించి ఆయా శాఖల అధికారులు, ఫిర్యదుదారులతో హియరింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. వీటిలో 17 కేసులు రాగా 16 కేసులు వాదనలు వినడం, ఒక కేసు రేపటికి వాయిదా వేయడం జరిగిందని కమీషన్ కార్యాలయం తెలియజేసింది.
ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు, కమిషన్ కార్యదర్శి/ సిఈఓ సంపర వెంకట రమణ మూర్తి, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, ఆర్డీవో ఎస్. మల్లి బాబు, ఇతర జిల్లా అధికారి, క్యాంపు కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్,కమీషన్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.