– వాసుదేవరెడ్డి బెయిల్‌పై అనుమానపు మేఘాలు
– దమ్మాలపాటి కేంద్రంగా ముసురుతున్న వివాదం
– టీడీపీ లీగల్‌సెల్ నేతలది ఒకదారి.. దమ్మాలపాటి వర్గీయులది మరో దారి
– దమ్మాలపాటికి దన్నుగా నిలిచిన జస్టిస్ ఆర్కే చౌదరి
– విమర్శకులపై జస్టిస్ ఆర్కే చౌదరి ‘కొత్తపలుకు’
– నిన్న బాబును పిచ్చివాడన్న రాజగురువే ఇప్పుడు వ్యూహకర్త అంటున్నారు
– వాసుదేవరెడ్డికి వ్యతిరేకంగా వాదించని ప్రభుత్వ న్యాయవాదులు
– రేపు వాసుదేవరెడ్డి అప్రూవర్ కాకపోతే పరిస్థితి ఏమిటి?
– ఇప్పటికే అప్రూవర్ పిటిషన్ ఉపసంహరించుకున్న వాసుదేవరెడ్డి
– బెయిల్ వచ్చిన తర్వాత అడ్డం తిరిగితే ఏం చేస్తారంటున్న టీడీపీ లాయర్లు
– దమ్మాలపాటి అనుకూలవర్గ ‘లా’జికల్ వాదన నిలుస్తుందా?.. వ్యతిరేకవర్గ వాదన గెలుస్తుందా?
– మధ్యలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని సీనియర్ల ఆవేదన
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూసే రైతులకు బంగారుకుటుంబాల బాధ్యత అప్పగించడం ఏమిటి? ఇలాంటి తలతిక్క పనుల వల్లే కదా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేది? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తలమాసిన సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు తయారవుతారు.
ఆచరణ సాధ్యం కాని అలాంటి ఆలోచనలంటే బాబుకు మహా ఇష్టం. ప్రజలతో సంబంధం లేకుండా ఇచ్చే వారి సలహాలు అమలుచేస్తే ఉభయభ్రష్టత్వం తప్పదు. అసలు ఇలాంటి ఆలోచనే ప్రకృతి విరుద్ధం. బాబు ఇప్పుడు పి-4ను పట్టుకుని వేళ్లాడుతున్నారు. బాబుతో మీటింగులకు వెళ్లిన వారు ఇదెక్కడి తద్దినం అనుకుంటున్నారు. చంద్రబాబుతో వచ్చిన తంటా ఏమిటంటే, ఆయన ఏది పట్టుకుంటే దాని వెనక పరిగెడతారు. నేలవిడిచిసాముచేస్తే ఫలితం అనుభవించతప్పదు. అమరావతి విషయంలో మీపై పూలు చల్లినవాళ్లే రాళ్లు చల్లుతారు. నాకు అంతా తెలుసులే అనుకుంటే ఆయనిష్టం’’ ఇది తెలుగుదేశం పార్టీకి రాజగురువుగా కార్యకర్తలు భావించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, గత ఆదివారం పలికిన కొత్తపలుకు సారాంశం. అంటే చంద్రబాబుకు ఏ పిచ్చి పడితే, ఆపిచ్చిలో పడిపోతారన్నది రాధాకృష్ణ కవిహృదయమన్నమాట.
సీన్ కట్ చేస్తే.. ఆ అక్షరాల తడి ఆరక రెండు రోజుల ముందే.. లిక్కర్ కేసులో ప్రభుత్వానికి కొన్ని వ్యూహాలుంటాయని, అది తెలియకుండా టీడీపీ నేతలే జగన్ ట్రాప్‌లో పడుతున్నారంటూ అందుకు విరుద్ధమైన కథనం వెలువరించడమే వింత. అంటే రాజగురువు గారు, తను ఏది అనుకుంటే ప్రపంచం అంతా అదే అనుకోవాలన్నమాట.
తాను కొద్దిరోజులు చంద్రబాబు పనిమంతుడు కాదు. ఏపిచ్చిలో పడితే ఆ పిచ్చిలో పరిగెడతారని రాస్తే, ప్రపంచమంతా దానిన ఫాలో కావాల్సిందే. మళ్లీ అదే చంద్రబాబు మహా మేధావి అంటే దానినీ ఫాలో కావాల్సిందేనన్నమాట! టీడీపీకి సంబంధించినంత వరకూ తాను చెప్పిందే వేదం. చేసిందే శాసనంలా ఉండాలనుకోవాలన్నది ఆయన అభిమతమన్నది తమ్ముళ్ల ఉవాచ. సరే.. బాబు-రాధాకృష్ణ బాదరాయణ బంధం తెలిసిందే కాబట్టి, ఆయన జాతికి ఏం సందేశం ఇచ్చినా నాయకత్వం పెద్దగా ఫీలవదు.
అదే మిగిలిన వారు అలాంటి వ్యాసాలు రాస్తేనో, వీడియోలు చేస్తేనే.. వారికి ఫోన్లు, ఒత్తిళ్లు, బుజ్జగింపులు. అవసరమైతే శిరచ్ఛేదాలు! పెట్టిన వీడియోలు-వెబ్సైట్లలో పెట్టిన స్టోరీలు తీసేయిస్తారు. మరి ఆ ధైర్యం ఆర్కే వద్ద మాత్రం చేయరు. ఇలా ఎందుకు రాశారు అని అడగరు. ఎందుకంటే ఇదంతా ‘మనం మనం బరంపురం’ యవ్వారం కాబట్టి.
ఇప్పుడు లిక్కర్ కేసుపై జరుగుతున్న సిట్ విచారణలోకి వెళితే.. ఆ విచారణ సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఆ అంశంలో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేంద్రంగా టీడీపీ లాయర్లలోనే మొదలైన రచ్చ, అటు తిరిగి ఇటు ఆ కేసులో ప్రధాన నిందితుడు వాసుదేవరెడ్డి బెయిల్‌ను వివాదం చేసింది. వివి లక్ష్మీనారాయణ అనే సీనియర్ న్యాయవాది, గత ఐదేళ్లలో టీడీపీ పక్షాన జగన్ సర్కారుకు వ్యతిరేకంగా వాదించిన ప్రముఖుడిగా అందరికీ తెలిసిందే. ఆ సందర్భంలో లీగల్ సెల్ లాయర్లలో బాబు తన నివాసంలోనే గంటలపాటు సమీక్షలు నిర్వహించేవారు.
అలాంటి న్యాయవాది లక్ష్మీనారాయణ ఇప్పుడు అడ్డం తిరిగి, లిక్కర్ కేసులో నిందితులకు బెయిలిప్పించేందుకు దమ్మాలపాటి ఆ కేసులో లబ్ధిదారులతో కుమ్మక్కయ్యారన్న బాంబు పేల్చారు. వైసీపీ నియమించిన లా ఆఫీసర్లనే కొనసాగిస్తున్నారని, పార్టీకి పనిచేయని వారికి న్యాయపదవులిస్తున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. ఇవన్నీ ఆయన ఎవరి చెవిలోనే చెప్పినవి కాదు. సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టు. అది ఇంకా అంటుకుంటూనే ఉంది.
సహజంగా టీడీపీకి వ్యతిరేకంగా ఏ చిన్న వార్త దొరికినా సాక్షి దానిని పండగ పరమాన్నంలా, మొదటి పేజీలో వండి వారుస్తుంది. కానీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై అధికార పార్టీకే చె ందిన లక్ష్మీనారాయణ, అంతేసి ఆరోపణలు చేస్తే ముచ్చటగా మూడు లైన్ల వార్త కూడా రాయకపోవడమే ఆశ్చర్యం. అంతేనా? కొద్దిరోజుల క్రితం దమ్మాలపాటి వద్ద ఉండే సుబ్బారావు అనే ప్రభుత్వ న్యాయవాది, బార్ అసోసియేషన్ ఆఫీసులో దళిత న్యాయవాదులను అవమానించిన వైనం హైకోర్టులో పెను దుమారం రేపింది.
ఆ తర్వాత దళిత న్యాయవాదులు కోర్టు బయట ధర్నా చేసి, సీజేకి ఫిర్యాదు చేశారు. సహజంగా పెద్ద పత్రికలు, చానెళ్లకు హైకోర్టులో లీగల్ కరస్పాండెంట్లు ఉంటారు. ఆయా కోర్టుల్లో ఏం జరిగిందో రాయడమే వారి వృత్తి. అక్కడ ఏం జరిగినా వారికి తెలిసి తీరుతుంది. మరి సాక్షాత్తూ బార్ అసోసియేషన్‌లో అంత పెద్ద వివాదం జరిగితే, సాక్షిలో ఒక్క ముక్క రాకపోవడం ఏమిటి?
ఈనాడు,ఆంధ్రజ్యోతికి అంటే ఏవో పాలిసీలు, మొహమాటాలు, ఆదేశాలుంటాయనుకోవచ్చు. కానీ సాక్షికి అలాంటి మొహమాటాలుండవు-ఉండకూడదు కదా? మరెందుకు దమ్మాలపాటి ఎపిసోడ్‌ను ప్పిపుచ్చుతోంది? దానిబట్టి మా ఆరోపణలు నిజమే కదా అన్నది లక్ష్మీనారాయణను సమర్ధించే వారి లా పాయింటు.
దాన్నలా పక్కనపెడితే.. లిక్కర్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వాసుదేవరెడ్డి తొలుత అప్రూవర్ పిటిషన్ వేశారు. తర్వాత ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. దానితో అసలు అతగాడు నిందితుడా? సాక్షినా? అన్న సందేహం లాంటి విమర్శ తెరపైకి వచ్చింది. దానితో అప్రూవర్ పిటిషన్ ఉపసంహరించుకుని, ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అసలు లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారు జగన్ అయినప్పుడు.. ఆయన పేరు చెప్పకుండా, వాసుదేవరెడ్డిని అప్రూవర్‌గా మారిస్తే కేసుకు ఏం లాభమన్నది లక్ష్మీనారాయణ అండ్ అదర్స్ వాదన.
వివేకానందరెడ్డి కేసులో దస్తగిరి అప్రూవర్ కానంతవరకూ అక్కడ చిన్న కాగితం ముక్క ఆధారం కూడా దొరకలేదు. కానీ అప్పటికే అరెస్టయి, రిమాండులో ఉన్న దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా మార్చిన తర్వాతనే.. గొడ్డలి వేటు నిజాలు, ఇతర నిందితులంతా కలుగునుంచి బయటకొచ్చారు. అంటే అటు సీబీఐ-ఇటు కోర్టు కూడా.. దస్తగరి అప్రూవర్‌గా మారడం వల్ల, కేసుకు లాభమని నమ్మినందుకే, అతనిని అప్రూవర్‌గా మారేందుకు అనుమతించారు.
సహజంగా ఏ కేసులో అయినా నిందితుడు అప్రూవర్‌గా మారితే అతని వల్ల కేసుకు లాభం ఉంటుందని భావిస్తేనే అతగాడిప్రూవర్ పిటిషన్‌ను కోర్టు అంగీకరిస్తుంది. అసలు అప్రూవర్ పిటిషన్ పోలీసులే వేస్తారు. కానీ ఈ కేసులో నిందితుడు వాసుదేవరెడ్డి పిటిషన్ వేయడమే విచిత్రం.
కానీ లిక్కర్ కేసులో సిట్ బలమైన ఆధారాలు సంపాదించింది. ప్రాధమిక చార్జిషీట్ బలంగా బిగించింది. 11 కోట్లనగదు స్వాధీనం చేసుకుంది. నిందితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుంది. అంతా బాగానే ఉన్నా లిక్కర్ డబ్బు చివరాఖరకు ఎవరికి చేరిందన్నది మాత్రం తేల్చలేదు. అది తేల్చితే కథ సుఖాంతమయినట్లే. వాసుదేవరెడ్డితో ఆ పనిచేయించేందుకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆయన బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించడం లేదని, ఒకవేళ వ్యతిరేకిస్తే జైలుకి వెళ్లే వాసుదేవరెడ్డి నుంచి, నిజాలు రాబట్టలేమని ప్రభుత్వ న్యాయవాదులు చేస్తున్న వాదన. అందుకే వాసుదేవరెడ్డికి పరోక్షంగా సహకరిస్తున్నారని, కేసుపరంగా అది తప్పెలా అవుతుందన్నది దమ్మాలపాటికి మద్దతుగా మాట్లాడే మేధావుల ప్రశ్న కూడా!
అంటే అతగాడిని అప్రూవర్‌గా మార్చి నిజాలు కక్కించి, ఆయన చేతులు తాడేపల్లి ప్యాలెసు వైపు చూపించాలన్నది ప్రాసిక్యూషన్ వ్యూహమన్నది.. దమ్మాలపాటి పక్షాన వకాలత్ తీసుకుని, ఆయనను విమర్శించే వారిపై ఎదురుదాడి చేస్తున్న విశ్లేషకులు, యూట్యూబర్ల వాదన. ఆ వ్యూహం తెలియక, లా గురించి అక్షరం ముక్క తెలియకుండా దమ్మాలపాటిని విమర్శిస్తున్నారన్నది వారి వాదన..వేదన!
బాగానే వుంది. కాసేపు వారి వాదనే నిజమనుకుందాం. ఇప్పుడు లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి వేసుకున్న బెయిల్ పిటిషన్‌ను, వ్యూహకర్తల ఎత్తుగడ ప్రకారమే, ప్రాసిక్యూషన్ వ్యతిరేకించలేదట. అంటే లిక్కర్ కేసులో నిందితుడైన వాసుదేవరెడ్డికి బెయిలిస్తే, అతను ఇతరులను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఎక్కడికీ పారిపోయే అవకాశం లేనందున, ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని ప్రాసిక్యూషన్ వాదించలేదన్నమాట. ఆ ప్రకారంగా.. ఎలాగూ ప్రాసిక్యూషన్ కూడా వ్యతిరేకించనందువల్ల, సహజంగా న్యాయస్థానం వాసుదేవరెడ్డికి బెయిల్ మంజూరు చేసే అవకాశం లేకపోలేదు.
రేపు బెయిల్ వచ్చిన వాసుదేవరెడ్డి మరి అప్రూవర్‌గా మారతారా? ఒకవేళ జడ్జి గారు వాసుదేవరెడ్డిని రిమాండ్‌కు పంపిన తర్వాత అప్రూవర్‌గా మార్చుకోమని ఆదేశిస్తే ఎలా? లేక ఎలాగూ బెయిల్ వచ్చింది కాబట్టి అప్రూవర్‌గా మారాల్సిన పనేంటని రెడ్డిగారు ఝలక్ ఇచ్చి వెళితే అప్పుడు పరిస్థితి ఏమిటి?
ఎందుకంటే వాసుదేవరెడ్డి తన అప్రూవర్ పిటిషన్ ఇప్పటికే ఉపసంహరించుకుని, కేవలం బెయిల్ పిటిషన్ మాత్రమే వేసుకున్నారు. మరి రేపు బెయిల్ వచ్చిన తర్వాత, అప్రూవర్‌పై అడ్డం తిరిగితే ఆ నేర ం ఎవరిదన్నది ప్రశ్న. పోనీ అప్పుడు మళ్లీ బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ వేస్తే.. అంతకుముందు బెయిల్ పిటిషన్నే వ్యతిరేకించని ప్రభుత్వమే, ఇప్పుడు మళ్లీ బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ వేస్తే ఎలాంటి సంకేతాలు వెళతాయన్నది న్యాయవాది లక్ష్మీనారాయణ అండ్ అదర్స్ వాదన.
ఈరకంగా దమ్మాలపాటి-లక్ష్మీనారాయణ అనుకూల-వ్యతిరేకంగా జరుగుతున్న వాదనలోకి ఆంధ్రజ్యోతి జస్టిస్ చౌదరిలా రంగప్రవేశం చేసి, సహజంగానే దమ్మాలపాటికి అనుకూల తీర్పు ప్రకటించే యడం టీడీపీ లాయర్లకు రుచించడం లేదు. అసలు ప్రభుత్వం వ్యూహం అద్భుతమని, అది అందరికీ చెప్పడం కుదరదని తేల్చేసింది. పైగా దమ్మాలపాటిని విమర్శిస్తున్న వారంతా జగన్ వ్యూహంలో చిక్కుకుని, కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తన తీర్పులో పేర్కొంది.
వారంతా లీగల్ టీమ్‌పై అభాండాలు వేస్తున్నారని, సాంకేతిక కారణాలు తెలియక చెత్త పోస్టులు పెడుతున్నారంటూ ఇచ్చిన, ‘చెత్త తీర్పు’పై టీడీపీ న్యాయవాదులు విరుచుకుపడుతున్నారు. ఇదే లైన్లో ఇప్పుడు అదే సోషల్‌మీడియాలో దమ్మాలపాటికి అనుకూలంగా కథనాలు వండి వార్చారని, ఆంధ్ర జ్యోతి కూడా అదే బాదరాయణ బంధంతో ఇప్పుడు అదే అనుసరిస్తోందని టీడీపీ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు.
రేపు వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారి, జగన్ పేరు చెబితే మంచిదే. కానీ ముందస్తు బెయిల్ తీసుకుని తర్వాత అప్రూవర్‌గా మారకపోతే ఏం చేస్తారన్న తమ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా, తమపై ఎదురుదాడి చేయడం, ఐదేళ్లు జగన్ సర్కారుపై యుద్ధం చేసిన తమపై వైసీపీ ముద్ర వేసి వ్యక్తిత్వ హననం చేయడంపై లక్ష్మీనారాయణ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.. మీడియా-సోషల్‌మీడియాను ఆ ఇద్దరిలో ఎవరు, ఎలా వాడుకుంటారో చూడాలి. విశేషమేమిటంటే.. దమ్మాలపాటికి వ్యతిరేకంగా మాట్లాడి, జగన్ ట్రాప్‌లో పడుతున్నారని చెబుతున్న మేధావులంతా న్యాయనిపుణులా అంటే కాదు. కానీ కేసులో వ్యూహాల గురించి మాట్లాడటమే వింత!