– ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్యలేవి?
– జస్టిస్ మదన్ బి.లోకుర్ కమిషన్ రిపోర్ట్ పై ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు?
– ఆ రిపోర్ట్ ను ఎందుకు దాచిపెట్టారు?
– గొర్రెల స్కాంలో సూత్రధారులపై చర్యలేవి?
– ట్విట్టర్ టిల్లును విచారణకు పిలిచి డ్రామాలాడుతున్నారే తప్ప చర్యలేవి?
– కేసీఆర్ సొంత బిడ్డ కేసీఆర్ కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు బండి సంజయ్
కరీంనగర్: తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క పైసా ఇయ్యని ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సర్పంచులు చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వకుండా మోసం చేసింది.
కేంద్ర నిధుల కోసమే స్థానిక సంస్థలు నిర్వహించాలనుకుంటున్నారు. ఆ నిధులను దొబ్బి పోవడానికే సీఎం ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మోదీ నిధులిస్తున్నారు కాబట్టి ఆయన వారసులుగా పోటీ చేస్తున్న బీజేపీ కార్యకర్తలను గెలిపించాలని ప్రజలను కోరుతున్నా.
ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రజల దారి మళ్లించేందుకు అసెంబ్లీలో కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయి. ప్రపంచంలో అత్యంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కాం. కేసీఆర్ సొంత బిడ్డ కేసీఆర్ కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని మొట్టమొదట డిమాండ్ చేసింది నేనే. 20 నెలలుగా విచారణ చేయకుండా కేసును నీరుగార్చిన చరిత్ర కాంగ్రెస్ దే.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో సంబంధం లేకుండా ఎందుకు సీబీఐ విచారణ జరపాలని లేఖ రాయడం లేదు? కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు, అధికారుల ఇండ్లపై దాడుల్లో వందల, వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్యలేవి? యాక్షన్ టేకెన్ రిపోర్ట్(ఏటీఆర్) ఏది? సీబీఐకి ఇచ్చి చేతులు దులుపుకుని కోర్టులో సరైన వాదనలు విన్పించకుండా కేసును నీరుగార్చి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడాలనే కుట్రలు చేస్తారా? కాళేశ్వరం స్కాం బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపైనా జస్టిస్ మదన్ బి.లోకుర్ కమిషన్ నివేదిక ఇచ్చింది కదా? ఆ రిపోర్ట్ పై ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ రిపోర్ట్ ను ఎందుకు దాచిపెట్టారు? బీఆర్ఎస్ నుండి ఎన్ని పైసలు తీసుకున్నరు?.. సీబీఐ జరపాలని లేఖ ఎందుకు రాయడం లేదు? కోర్టు ఎక్కడా ఈ స్కాంపై సీబీఐ విచారణ వద్దని చెప్పలేదు కదా?
గొర్రెల స్కాంలో సూత్రధారులపై చర్యలేవి? వందల కోట్ల అవినీతి బయటపడ్డా ఇంకా ఎందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు? వాళ్లను కాపాడుతున్నందుకు ఎన్ని వందల కోట్ల ముడుపులు ముట్టాయి? సీబీఐ విచారణ ఎందుకు జరిపి ప్రజాధనాన్ని దోచుకున్న దొంగలను ఎందుకు జైలుకు పంపడం లేదు? వాళ్ల ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?
ఫార్ములా ఈ రేస్ స్కాం పేరుతో ప్రతిసారి ట్విట్టర్ టిల్లును విచారణకు పిలిచి డ్రామాలాడుతున్నారే తప్ప చర్యలేవి? తప్పు జరిగిందని, అవినీతి జరిగిందని మీరే అనేకసార్లు చెప్పారు కదా? ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ స్కాంలో విదేశీ సంస్థ పాత్ర ఉంది కదా? మరి ఈ కేసును సీబీఐ విచారణ ఎందుకు ఇవ్వడం లేదు?
ఫోన్ ట్యాపింగ్ కేసును డైలీ సీరియల్ లా రెండేండ్ల నుండి ఎందుకు డ్రామాలాడుతున్నట్లు? పెద్దాయన (కేసీఆర్) చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలమిచ్చారు కదా? తండ్రీ కొడుకు కలిసి వేల కుటుంబాల జీవితాలను నాశనం చేశారు కదా? మరి వాళ్లపై చర్యలేవి?
ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు, విదేశీ సంస్థలు ఇమిడి ఉన్నాయి కదా? కేంద్ర పెద్దల, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు మీరే చెప్పారు కదా? మరి ఈ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు? విదేశాల నుండి నువ్వు రాకపోతే ప్రభాకర్ రావు ఆస్తులు జప్తు చేస్తామని కోర్టులో వాదించిన ప్రభుత్వం ప్రభాకర్ రావు వచ్చాక ఎందుకు వదిలేసినట్లు?
ఇన్ని స్కాంలు జరిగితే విచారణ చేయకుండా, కాళేశ్వరం అంశాన్ని దారి మళ్లించడానికి కాంగ్రెస్ లోని కొందరు నాయకులు బీఆర్ఎస్ తో కుమ్కక్కై, కవిత అంశాన్ని తెరమీదకు తెచ్చి పార్టీ అంతర్గత అంశంపై చర్చ జరిగేలా చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఇవా? కాళేశ్వరం స్కాంపై సీబీఐ విచారణ చేసేందుకు సిద్ధమైందని తెలిసింది. వెంటనే ఆ స్కాంకు సంబంధించిన ఆధారాలు సీబీఐకి అందించాలి.
అట్లాకాకుండా బీఆర్ఎస్ ను కాపాడేందుకు కావాలనే కోర్టులో బలహీన వాదనలు చేయడం సరికాదు. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలపై రామచంద్రరావు ఆధ్వర్యంలో గల్లీగల్లీలో ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం. నక్సలైట్ల విషయంలో మా లైన్లు వెరీ క్లియర్. వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతాం. అభివ్రుద్ది, సంక్షేమ ఫలాలను ఆదివాసీ గూడెంలకు, తండాలకు, మారుమూల పల్లెలకు అందిస్తాం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు మల్క కొమరయ్య, అంజిరెడ్డిలను గెలిపించేందుకు మేమంతా కష్టపడ్డాం. బీజేపీ కార్యకర్తల కమిట్ మెంట్, మొండి పట్టుదల, కసితోనే ఈ గెలుపు సాధ్యమైంది. రామచంద్రరావు ఈ బాధ్యత అప్పగించినా కష్టపడి పనిచేసేందుకు సిద్ధం. మీ నాయకత్వంలో పనిచేస్తూ తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసేలా చేద్దాం.
కార్యకర్తలారా… మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత నాది. అట్లాగే గెలిసే అభ్యర్థులకే టిక్కెట్లు ఇస్తాం. సర్వే చేస్తున్నాం. ఇందులో వర్గాలకు తావు లేదు. అట్లాగే కష్టపడి పనిచేసే కార్యకర్తలు గెలిచే అవకాశం లేకపోతే పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులిచ్చి న్యాయం చేస్తాం.