– 2023 జనవరి 27న కుప్పం నుండి ప్రారంభం
– ఏడాది పాటు ప్రజల మధ్య ఉండే విధంగా రూట్ మ్యాప్
– యువత భాగస్వామ్యంతో ముందుకు సాగుతాం
– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
గుడివాడ, నవంబర్ 11: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
2023 జనవరి 27వ తేదీన నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి ఇచ్ఛాపురం వరకు ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండే విధంగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతూ వస్తోందన్నారు. ముఖ్యంగా యువత అన్నిరంగాల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతూ వస్తున్న రైతుల, మహిళల సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో పాటు యువతను కూడా పెద్దఎత్తున భాగస్వాములుగా చేస్తామన్నారు.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల నుండి ప్రతిపక్ష నాయకుడి వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. కుప్పంలో చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా వైసీపీ గూండాలు ఎలా ప్రవర్తించారో రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను చూసి నందిగామ రోడ్ షోలో రాళ్ళ దాడులు చేశారన్నారు.
పైగా దాడులకు పాల్పడుతున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రోడ్లపై గుంతలను పూడ్చలేని ప్రభుత్వం పేదల ఇళ్ళ కూల్చివేతలకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇళ్ళ కూల్చివేతలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేసిందన్నారు. కొన్ని చోట్ల న్యాయ సహాయం చేసి కూల్చివేతలను అడ్డుకోవడం జరిగిందన్నారు. రాజకీయ కక్షతోనే ఇప్పటం గ్రామంలో ఇళ్ళను కూల్చివేశారన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని రోడ్డు విస్తరణ ఇప్పటం గ్రామంలోనే ఎందుకు జరిగిందో ప్రజలకు అర్ధమైందన్నారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ గెలిస్తే ఇళ్ళు కూల్చివేస్తారని అవాస్తవాలను ప్రచారం చేశారన్నారు. మంగళగిరిలో ఇప్పుడు పేదల ఇళ్ళు కూల్చుతుంది ఎవరో ప్రజలు గ్రహించారన్నారు. వచ్చే ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలని, తెలుగుదేశం పార్టీ పాలన రానుందని శిష్ట్లా లోహిత్ చెప్పారు.