Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురానున్న నారా లోకేష్ పాదయాత్ర

– రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తథ్యం
– రాష్ట్ర వినాశనమే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
– తుగ్లక్ పాలనలో నామరూపాల్లేకుండా పోయిన నవ్యాంధ్ర
– లోకేష్ వేసే ప్రతి అడుగులోనూ ప్రజల ఆశలు, ఆశయాలు
– రాష్ట్ర భవిష్యత్తు కోసం చేపట్టే పాదయాత్రను జయప్రదం చేయండి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

అమరావతి, నవంబర్ 26: 2023 జనవరి 27వ తేదీ నుండి నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్ర తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురానుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయం ద్వారా శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యువకెరటం నారా లోకేష్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం కానుందన్నారు. తడ నుండి ఇచ్చాపురం వరకు ఏడాది పాటు ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. సైకో ప్రభుత్వంలో తల్లడిల్లుతున్న ప్రజల హృదయాంతరాల్లోకి తొంగి చూసేలా నారా లోకేష్ పాదయాత్ర ఉంటుందన్నారు.

ఈ పాదయాత్రతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తథ్యమన్నారు. 2014కు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మీ కోసం యాత్రను చేపట్టారన్నారు. ఈ యాత్ర ప్రజల్లోకి ఎంతగా చొచ్చుకు వెళ్ళిందో అందరికీ తెలుసని గుర్తుచేశారు. నారా లోకేష్ పాదయాత్ర మీ కోసం యాత్రకు వెయ్యి రెట్లు విజయవంతమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వినాశనమే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోందన్నారు. ప్రభుత్వ దమనకాండను తిప్పికొట్టే రామబాణంలా నారా లోకేష్ పాదయాత్ర ఉంటుందన్నారు. ప్రభుత్వం సంక్షేమం పేరుతో అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు.

ప్రజాగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రజల భవిష్యత్తుపై నారా లోకేష్ ఎనలేని నమ్మకం కల్గిస్తారన్నారు. రాష్ట్ర భవిష్యత్తులో ప్రతి ఒక్కరినీ భాగస్వాములుగా చేయడమే లక్ష్యంగా నారా లోకేష్ పాదయాత్ర జరుగుతుందన్నారు. జగన్మోహనరెడ్డి తుగ్లక్ పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ నామరూపాల్లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని తెలిపారు.

నారా లోకేష్ వేసే ప్రతి అడుగులో ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఆలోచనలు కన్పిస్తాయన్నారు. ఇక అధికార పార్టీకి నిద్ర లేని రాత్రులే మిగులుతాయని చెప్పారు. రాష్ట్ర, ప్రజల భవిష్యత్తు కోసం చేపట్టనున్న నారా లోకేష్ పాదయాత్రకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. యువత ప్రతినిధిగా, వారి భవిష్యత్తు కోసం జనంలోకి వస్తున్న నారా లోకేష్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. యువశక్తి ముందుకు వచ్చి పాదయాత్రలో పోటెత్తాలన్నారు. అభిమాన నేత నారా లోకేష్ పాదయాత్రను రాష్ట్ర ప్రజలంతా ఆదరించి అక్కున చేర్చుకోవాలని శిష్ట్లా లోహిత్ పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE