– జగన్ జమానాలో రెడ్లకు అన్యాయమేనన్న లోకేష్
– రెడ్లకు బిల్లులు ఆపారని లోకేష్ వెల్లడి
– మీకు గౌరవం ఏదని రెడ్లకు ప్రశ్న
– జగన్ చుట్టూ ఉన్న రెడ్లకే లబ్ది అని విమర్శ
– టీడీపీ హయాంలో రెడ్లను గౌరవించామన్న లోకేష్
– రెడ్లను గుండెల్లో పెట్టుకునే పార్టీ టీడీపీ ఒక్కటేనని స్పష్టీకరణ
– రెడ్ల అసంతృప్తిపై లోకేష్ బాణాలు
– రెడ్లకు లోకేష్ వల
– టీడీపీని వీడిన వారిలో కమ్మవారే ఎక్కువ
– ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్న రెడ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
పప్పు అంటూ తనపై రాజకీయ ప్రత్యర్థులు వేసిన ముద్రను విజయవంతంగా చెరిపివేసి, జనక్షేత్రంలోకి వెళ్లి రాజకీయనేతగా రాటుతేలుతున్న టీడీపీ యువనేత లోకేష్..బలమైన రెడ్డి సామాజికవర్గంపై రాజకీయ వలపు బాణం సంధిస్తున్నారా? ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై రెడ్లలో బలంగా పేరుకుపోయిన అసంతృప్తిని, సద్వినియోగం చేసుకునే వ్యూహం రచిస్తున్నారా? బిల్లులు ఇవ్వక, వడ్డీ భారాన్ని మోస్తున్న సగటు రెడ్డి హృదయాన్ని గెలిచే ప్రయత్నం చేస్తున్నారా? జగన్ చుట్టూ ఉన్న రెడ్లకు తప్ప, సామాన్య రెడ్లకు ఏం జరగడం లేదన్న నిజాన్ని లోకేష్ ఆ వర్గంలో బలంగా నాటేలా చేస్తున్నారా? .. రాయలసీమలో జరుగుతున్న లోకేష్ యువగళం పాదయాత్రలో, లోకేష్ ప్రసంగాల తీరు అందుకు అవుననే సమాధానం ఇస్తోంది.
ఆంధ్రా రాజకీయాల్లో రెడ్డి-కమ్మ వర్గాలు భిన్నధృవాలు. టీడీపీ ఏర్పడక ముందు కమ్మవర్గం సైతం, కాంగ్రెస్‌లోనే ఉండేది. టీడీపీ ఆవిర్భావం తర్వాత కమ్మ వర్గం ఆ పార్టీ వైపు పూర్తిగా మొగ్గుచూపగా, రెడ్లు కాంగ్రెస్ శిబిరంలో నిలిచారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కమ్మ వర్గంలో చీలికలొచ్చి కొందరు కాంగ్రెస్-మరికొందరు టీడీపీగా విడిపోయారు. కృష్ణా జిల్లాలో కమ్మవర్గం కొంతమేరకు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతోంది.
అయితే.. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన ముఖ్యమైన రెడ్డి కుటుంబాలు ఇంకా అదే పార్టీని అంటిపెట్టుకోవడాన్ని విస్మరించకూడదు. రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలోని రెడ్లు ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతుండగా.. అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీలోని కమ్మ నేతలు, అధికార పార్టీలోకి వెళ్లడం సాధారణంగా మారింది. అప్పటికీ-ఇప్పటికీ రెడ్లే టీడీపీకి అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
కోస్తాలో కమ్మ-రెడ్డి వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్యం- ఘర్షణలు, హత్యలు జరిగినా.. ఆ కుల సంస్కృతి రాయలసీమకు విస్తరించలేదు. కారణం సీమలో చిత్తూరు, అనంతపురం మినహా.. మిగిలిన జిల్లాల్లో కమ్మ వర్గ సంఖ్యాబలం లేకపోవడమే. కోస్తాలో కమ్మ-కాపు వర్గాల మధ్య కులద్వేషం ఉంది. గుంటూరు-కృష్ణా జిల్లా కాపులు కాంగ్రెస్‌ను ఆదరిస్తే, గోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర కాపులు టీడీపీని ఆదరించేవారు.
దశాబ్దాల నుంచి కమ్మవర్గం వ్యాపారాల్లో స్థిరపిడతే, రెడ్లు రాజకీయాల్లో విస్తరించారు. వైఎస్ హయాం ప్రారంభమైన తర్వాతనే.. రెడ్లు కూడా వ్యాపారాలు, కాంట్రాక్టులు, విద్యా-వైద్య రంగాల్లో రాణించడం ప్రారంభించారు. ఆంధ్రా-తెలంగాణ-కర్నాటక రాష్ర్టాల్లో ఉన్న కొన్ని బడా కంపెనీల్లో, రెడ్లవి అనేకం ఉండటం ప్రస్తావ నార్హం. ఈ రాష్ర్టాల్లో సబ్ కాంట్రాక్టులు చేసే వారిలో రెడ్లే ఎక్కువ.
జగన్ పార్టీ స్థాపించిన తర్వాత, కాంగ్రెస్‌లో ఉన్న రెడ్లలో మెజారిటీ శాతం వైసీపీలో చేరారు. అగ్రనేతలు సహా, నియోజకవర్గ ప్రముఖులు వైసీపీ తీర్థం తీసుకున్నారు. జగన్‌ను సీఎంగా చూసేందుకు రాష్ట్ర స్థాయి నుంచి- గ్రామ స్థాయి రెడ్డి కాంట్రాక్టర్ల వరకూ ఆర్ధికసాయం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో పార్టీ ఓడినప్పటికీ, వైసీపీనే అంటిపెట్టుకున్నారు.
రెండోసారి జరిగిన ఎన్నికల్లో కూడా.. రెడ్డి కాంట్రాక్టర్లు, భూస్వాములు, ధనవంతులు, పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు ఎవరి స్థాయిలో వారు పోటీలు పడి మరీ, శ్రమదానం చేసి పార్టీని గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. వీరిలో వైసీపీకి సంబంధించిన వివిధ స్థాయి నేతలే కావడం ప్రస్తావనార్హం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గ్రామ స్థాయి నుంఈ జిల్లా స్థాయి రెడ్డి కాంట్రాక్టర్లకు పలు కాంట్రాక్టులు దక్కాయి. అయితే బిల్లులు నిలిచిపోవడం, ఎమ్మెల్యేలు కూడా నిస్సహాయత వ్యక్తం చేయడంతో.. రెడ్డి కాంట్రాక్టర్లు, నేతలలో అసంతృప్తి మొదలయింది. దానికితోతు.. అంతకుముందు వరకూ గ్రామాల్లో, విపరీతమైన గౌరవ మర్యాదలు, పెత్తనం సాగించిన రెడ్ల హవాకు వాలంటీర్ల వ్యవస్థ చెక్ పెట్టినట్టయింది.
గతంలో ప్రజలు ఏ పనికావాలన్నా, రెడ్ల దగ్గరకే వెళ్లే సంస్కృతి ఉండేది. వాలంటీర్లు వచ్చిన తర్వాత జనం, వారి వద్దకు వెళ్లడంపూర్తిగా మానేశారు. ఎవరికి ఏ పథకాలు ఇవ్వాలో వాలంటీర్లే నిర్ణయిస్తుండటమే దానికి కారణం. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల పాత్ర పెరిగింది. దీనితో అటు.. చేసిన పనులకు బిల్లులు రాక, ఇటు గ్రామాల్లో తరాల నుంచి సంపాదించుకున్న పెత్తనం కోల్పోయి, జనం దగ్గరకు రాకపోవడంతో.. రెడ్లలో జగన్ ప్రభుత్వంపై అసహనం, అసంతృప్తి, ఆగ్రహం పెరిగిపోయింది. దానితో ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు డమ్మీలన్న భావన స్థిరపడింది.
ఇటీవల వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో జరిగిన.. పార్టీ సర్పంచుల సమావేశంలోనూ, రెడ్డి సర్పంచుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పులు చేసి మరీ పూర్తి చేసిన పనులకు, బిల్లులు ఎప్పుడిస్తారని నిలదీశారు. వడ్డీలు తెచ్చి పనులు చేశామని మొత్తుకున్నారు. గ్రామాల్లో తమ పరువుపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జి మంత్రులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని, మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. మాకే పనులు కాకపోతే ఎన్నికల్లో పార్టీకి ఓటు వేయమని ఎలా చెబుతామని, ఇంకొందరు నిర్మొహమాటంగా ప్రశ్నించారు. వీరిలో రెడ్డి సర్పంచులే ఎక్కువ కావడం గమనార్హం. వారి ప్రశ్నలకు సజ్జల నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు.
ఇక పూర్తి స్థాయిలో రెడ్ల హవా ఉన్న నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నర్సరావుపేట జిల్లాల్లో కూడా.. కాంట్రాక్టు పనులు చేస్తున్న వైసీపీ రెడ్డి నేతలు, జగన్ సర్కారుపై ఇదే కారణాలతో పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో చందాలు తీసుకుని గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్ల ఒత్తిడి భరించలేకపోతున్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని ప్రకాశం-నెల్లూరు జిల్లా డీఆర్సీ సమావేశాల్లోనే, ఎమ్మెల్యేలు జిల్లా ఇన్చార్జి మంత్రులను నిలదీసిన ఘటనలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వైసీపీ సర్పంచి.. బిల్లులు రాక సహనం కోల్పోయి.. వైసీపీలో ఉన్నందుకు తన చెప్పుతో తానే కొట్టుకున్న వీడియో, సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసింది. ఇలాంటి అసంతృప్తి ప్రతి మండలంలోనూ రెడ్డి నేతల్లో నాటుకుపోయింది.
కాగా పార్టీకి మూలస్తంభాలయిన రెడ్లు.. అసంతృప్తితో ఉన్న విషయాన్ని, గెలిచిన ఏడాదిన్నరకే పార్టీ నాయకత్వం గ్రహించినట్లు సమాచారం. అయితే ఆర్ధిక పరిస్థితి సహకరించకపోవడంతో, బిల్లుల చెల్లింపు విషయంలో మౌనంగా ఉన్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా సమన్వయకర్తలంతా ఉత్సవ విగ్రహాలేనని రెడ్డి నేతలకు అనుభవపూర్వకంగా స్పష్టమయింది.
తమ సమస్యలు- అసంతృప్తిని, జగన్ దృష్టికి తీసుకు వెళ్లే ధైర్యం పార్టీలో ఎవరికీ లేదన్న విషయం కూడా, రెడ్డి వర్గానికి అర్ధమయింది. సీఎం పేషీలో కీలక వ్యక్తులను పట్టుకున్న వారికే, పనులు అవుతున్నాయన్న ప్రచారం విస్తృతస్థాయిలో జరుగుతోంది. బిల్లుల చెల్లింపు కూడా ఆ పద్ధతిలోనే జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోందని పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.
అందుకే మంత్రులు, , నియోజకవర్గ సమన్వయ కర్తలు, సలహాదారులంతా పోస్టుమ్యాన్ ఉద్యోగాలు చేస్తున్నారన్న వాస్తవం, రెడ్డి వర్గం గ్రిహ ంచింది. వీరెవరికీ జగన్ సమయం కూడా ఇవ్వరన్న ప్రచారం ఇప్పటికే బలపడింది. తాము విజయవాడకు వెళ్లి మొరపెట్టుకున్నా.. దాని వల్ల చార్జీల ఖర్చు తప్ప, ఉపయోగం లేదన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి.
ఈవిధంగా క్షేత్రస్థాయిలో.. రెడ్లు ఎదుర్కొంటున్న అవమానాలు తెలుసుకున్న టీడీపీ యువనేత లోకేష్.. వారిని దరి చేర్చుకునే ప్రయత్నాలకు, తెరలేపడ ం ఆసక్తికలిగిస్తోంది. రాయలసీమలో రెడ్ల ప్రభావం ఉన్న మండలాల్లో పాదయాత్ర చేస్తున్న లోకేష్.. రెడ్లకు జగన్ సర్కారులో కించిత్తు గౌరవ మర్యాదలు లేవన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
వైసీపీ కోసం ఇంత చేసిన మీకు జగన్‌రెడ్డి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. జగన్ పాలనలో రెడ్లు కూడా బాగుపడలేదని, కేవలం జగన్ చుట్టూ ఉన్న రెడ్లు, పారిశ్రామికవేత్తలే బాగుపడుతున్నారన్న లోకేష్
అస్త్రం.. సూటిగా రెడ్లకు తగులుతోంది. ఇది రెడ్డి సామాజికవర్గానికి ఎక్కడ తాకాలో అక్కడ తాకుతోంది.
టీడీపీలోనే రెడ్లకు గౌరవం ఉండేదన్న లోకేష్ మాటలు, వారిలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. దాని ప్రభావం.. రేపటి ఎన్నికల్లో రెడ్లు, పోలింగ్ రోజున మౌనవ్రతం పాటించేలా చేస్తే, పార్టీకి పెను ప్రమాదమేనన్ననది వైసీపీ సీనియర్ల ఆందోళన.
నిజానికి టీడీపీ విపక్షంలోకి మారిన తర్వాత ఎంపీలు సుజనాచౌదరి, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే కరణం బలరాం, వల్లభనేని వంశీ సహా.. అనేకమంది మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి కమ్మవర్గ నేతలు పార్టీలు మారారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. కానీ తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకున్న రెడ్డి నేతలు మాత్రం టీడీపీలోనే కొనసాగుతుండటం గమనార్హం. ప్రధానంగా రాయలసీమలోని టీడీపీ రెడ్డి నేతలే ఇప్పుడు ఆ పార్టీకి దన్నుగా నిలుస్తుండటం విశేషం.