లోక్‌సభకూ ముందస్తు?

– ఐదు రాష్ర్టాల ఎన్నికలే కారణమా?
– మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లో బీజేపీకి ఎదురుగాలి?
– తెలంగాణలో అవకాశాలు మృగ్యం
– ఆ ఎన్నికలపై కర్నాటక ఫలితాల ప్రభావం
– మోదీ ఇమేజ్‌ దెబ్బకుండా ఉండేందుకే ముందస్తు ఎన్నికలు?
– పార్టీలో మోదీపై వ్యతిరేకతకు ‘ముందస్తు’ అడ్డుకట్ట
– ఏపీలోనూ తెలంగాణతో పాటే ఎన్నికలు?
– జగన్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌?
– తెలంగాణ-ఆంధ్రాలోనూ ఒకేసారి ఎన్నికలు?
– ఏపీలో సెప్టెంబర్‌ లో అసెంబ్లీ రద్దు చేసే అవకాశం?
( మార్తి సుబ్రహ్మణ్యం)

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ముందస్తు’ ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు కూడా చేరాయా?.. నవంబర్‌-డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయా?.. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ, భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను బట్టి ఇది నిజమేననిపిస్తుంది.

నిజానికి లోక్‌సభ కాలపరిమితి వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకూ ఉంది. ఈ ఏడాది తెలంగాణ, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా పెద్ద రాష్ర్టాలయిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీకి పూర్తి ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. చత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీకి సానుకూల వాతావరణం లేదంటున్నారు.

ఈ ప్రతికూల పరిస్థితిలో పార్టీ ఓడితే అది మోదీ నాయకత్వంపైనే ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న చర్చకు తెరలేచింది. ఈ పరిణామాలు తప్పించుకోవాలంటే, ముందస్తు ఎన్నికలే పరిష్కారమన్న అభిప్రాయం బీజేపీ నాయకత్వంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణ బీజేపీలో అరుపులు-కేకలు-సవాళ్లే తప్ప, క్షేత్రస్థాయిలో బీజేపీకి యుద్ధంలో నిలబడి పోరాడే సిపాయిలే లేరు.గట్టిగా ఓ రెండు డజన్ల నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్ధులు లేరు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వచ్చి చేరితే తప్ప, దిక్కులేని పరిస్థితి. పోనీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికేమైనా, గౌరవం దక్కుతుందా అంటే అదీ లేదు. ఈ కారణాలతోనే బీజేపీలో చేరిన వారు ఎక్కువకాలం మనుగడ సాగించలేక, వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు, కాంగ్రెస్‌ వైపు చూస్తున్న పరిస్థితి.

చేరికల కమిటీ చైర్మన్‌, సుదీర్ఘకాలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పోరాడే యోధుడయిన ఈటల రాజేందర్‌ లాంటి సీనియరే, పార్టీలో ఇప్పటికీ సర్దుకోలేకపోతున్నారు. అమిత్‌షా సమక్షంలో జరిగిన కోర్‌కమిటీలోనే ఈటల.. ‘‘నాకు ఎలాంటి పదవులూ వద్దు. కార్యకర్తగా పనిచేస్తా. నేను కొట్లాడడానికి రాలేదు. పనిచేయడానికి వచ్చా’’నని నిర్మొహమాటంగా చెప్పారంటే, తెలంగాణ బీజేపీలో ఐకమత్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.

ఇతర పార్టీల నుంచి చేరిన పెద్ద నేతలకు అసలు పార్టీలో పనిలేదు. ఈ కారణాల వల్లనే మరో రెండు నెలలలోగా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, తిరిగి వెనక్కి వెళ్లిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆమేరకు, ఇప్పటికే చాలామంది బీజేపీ నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం, తన వ్యవహారశైలి మార్చుకుంటున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, నాలుగడుగులు వెనక్కి తగ్గేందుకు సైతం సిద్ధమవుతున్నారు. తాను నాయకుడిని కాదని, సోనియా-ఖర్గే మాత్రమే పార్టీకి నాయకులని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో చేరాలనుకునే సీనియర్లకు.. రేవంత్‌రెడ్డి అడ్డంకి కాబోడన్న సంకేతాన్ని, ఆయన విజయవంతంగా ఇచ్చినట్లు కనిపిస్తోంది.

బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లడానికి అనేక కారణాలున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కర్నాటక పరాజయ ప్రభావం, వివిధ రాష్ర్టాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విజయం కాంగ్రెస్‌కు టానిక్‌లా పనిచేస్తోంది. కర్నాటకలో పార్టీ గెలిస్తే, దాని ప్రభావం తెలంగాణలో విపరీతంగా ఉంటుందని బీజేపీ ఆశించింది. అయితే పార్టీ ఓడిపోవడం.. అక్కడ కాంగ్రెస్‌ గెలవడంతో.. ఆ విజయప్రభావం, తెలంగాణలో కాంగ్రెస్‌కు అక్కరకొస్తోంది. ఈ విషయంలో బీజేపీ అంచనాలు ఘోరంగా విఫలమయ్యాయి.

ఒకవేళ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో పార్టీ విజయం సాధించకపోతే.. ఆ ప్రభావం పార్టీలో మోదీ నాయకత్వంపై , అంతర్గతంగా వ్యతిరేకత మొదలయ్యే ప్రమాదం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ ఐదురాష్ర్టాల్లో ఎన్నికలను బీజేపీ సెమీ ఫైనల్‌గా భావిస్తోంది. అలాంటి పరిస్థితిలో పార్టీ పరాజయం పాలైతే, ఆర్‌ఎస్‌ఎస్‌ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

నిజానికి ఆర్‌ఎస్‌ఎస్‌ తొమ్మిదేళ్ల క్రితం వరకూ బీజేపీని శాసించేది. మోదీ షా శకం ప్రారంభమైన తర్వాత, ఆరెస్సెస్‌ కూడా చివరకు వారిద్దరి ఆదేశాల మేరకు పనిచేస్తోందన్న చర్చ అటు సంఘ్‌కూ ఇబ్బందికరంగా మారింది. రాష్ర్టాల్లో సంఘ్‌ తరఫున పనిచేసే సంఘటనా మంత్రులు, పూర్తిగా బీజేపీ చెప్పుచేతల్లో పనిచేస్తున్నారన్న విమర్శ బలంగా వినిపిస్తోంది.

ఇప్పటికే మోదీ-షా ధాటికి గడ్కరీ, రాజ్‌నాధ్‌సింగ్‌ ఠాకూర్‌ వంటి ప్రముఖులు మౌనంగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిని సైతం ఉత్సవ విగ్రహంగా మార్చి, అంతా అమిత్‌షానే నడిపిస్తున్నారన్న ప్రచారం పార్టీలో బహిరంగంగానే వినిపిస్తోంది. ఐదు రాష్ర్టాల్లో పార్టీ ఓడిపోతే, మౌనంగా ఉండే శక్తులు తిరిగి పనిచేయడం ప్రారంభిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది.

ఇన్ని తీసివేతలు-కూడికల తర్వాత.. లోక్‌సభకూ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అప్పుడు ‘స్థానిక వ్యతిరేకత’ అంశం మరుగునబడి,జాతీయ స్థాయి అంశాలు తెరపైకి వస్తాయన్నది బీజేపీ అంచనాగా కనిపిస్తోంది. ఆలోగా మోదీ సర్కారు సాధించిన విజయాలను.. జాతీయ స్థాయిలో యుద్ధప్రాతిపదికన ప్రచారం చేయడం, పార్టీ బలహీనంగా ఉన్న రాష్ర్టాలపై దృష్టి సారించడం, పొత్తు అంశాలపై దృష్టి సారించి, అప్పుడు ఎన్నికల యుద్ధానికి వెళ్లాలన్నది బీజేపీ వ్యూహమంటున్నారు.

కాగా ఏపీలో కూడా ముందస్తు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఆ మేరకు సీఎం జగన్‌ కూడా కేంద్ర పెద్దల నుంచి హామీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బహుశా తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా సెప్టెంబర్‌లో, అసెంబ్లీ రద్దు చేసే అవకాశాలున్నట్లు విస్తృస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో పెరుగుతున్న వ్యతిరేకత, నిధుల సమస్య జగన్‌ సర్కారుకు చిక్కులు తెస్తున్నాయి.

ఉద్యోగులకు నెల నెలా జీతాలివ్వడం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో, ఇటు సొంత పార్టీ క్యాడర్‌లోనూ వ్యతిరేక పెల్లుబుకుతున్న దృష్ట్యా.. వ్యతిరేకత మరింత పెరగకుండా ఉండాలంటే, ముందస్తు ఎన్నికలే ఉత్తమమన్నది జగన్‌ యోచన అంటున్నారు.

Leave a Reply