-నంద్యాల యువగళం సభలో యువత ప్రశ్నలు – నారా లోకేష్ సమాధానాలు
షేక్ నిజాం,యాంకర్: మైనార్టీలపై వైసీపీకి ఎక్కడలేని ప్రేమ వచ్చింది. 4 శాతం రిజర్వేషన్లపై రాజకీయం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది?
నారా లోకేష్- మైనార్టీల్లో పేదరికం ఎక్కువగా ఉంది. కుల, మతాలకు అతీతంగా తెలుగువారు ఎక్కడున్నా నెం.1గా ఉండాలనేది మా లక్ష్యం. అన్న ఎన్టీఆర్ దేశంలోనే తొలిసారిగా మైనార్టీ కార్పోరేషన్ ఏర్పాటుచేశారు. ఆ స్ఫూర్తితో చంద్రబాబు గారు హైదరాబాద్ లో హజ్ భవనం నిర్మించారు, హజ్ యాత్రికులకు సబ్సీడీ ఇచ్చారు. దుల్హన్, రంజాన్ తోఫా అందించారు. రంజాన్ సమయంలో మసీదులకు రంగుల కోసం నిధులు అందజేశాం. ఇవి ఎన్నికల కోసం చేసినవి కావు. ఇది చిత్తశుద్ధితో పేదరికం నిర్మూలన కోసం చేశాం. బాధ్యతతో చేశాం. ఇక్కడున్న ఎంపీ గారిని నేను ప్రశ్నిస్తున్నా.. సీఏఏకు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది వైకాపా ఎంపీలు. విజయసాయిరెడ్డి సీఏఏకు మద్దతుగా రాజ్యసభలో మాట్లాడారు. నేడు తెల్లకాగితాల దుష్ప్రచారం చేస్తున్నారు. నిజం గడపదాటేలోగా అబద్ధం ప్రపంచం చుట్టివస్తుంది. నెల రోజులు ఓపిక పట్టండి. సీఏఏ వల్ల మైనార్టీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు అన్ని విధాల అండగా ఉంటాం.
యువతి: వైకాపా వేధింపుల వల్ల అబ్దుల్ సలాం గారి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై మైనార్టీలు చాలా బాధపడ్డారు. అలాంటి నేరాలను ఎలా అదుపుచేస్తారు?
నారా లోకేష్- చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురజాల నియోజకవర్గంలో మైనార్టీ బాలికపై అత్యాచారం జరిగితే చంద్రబాబు గారు పోలీసులను వెంటనే అప్రమత్తం చేశారు. ఎన్ని పోలీసు బలగాల కావాలో తీసుకోమన్నారు. దీంతో 24 గంటల్లో నిందితుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. చంద్రబాబు అంటే రౌడీలకు, స్మగ్లర్లకు భయం. ఇస్లాంలో ఆత్మహత్య మహాపాపం. అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్యకు కారణం వైకాపా నాయకుల వేధింపులే. పలమనేరులో మిస్బా అనే విద్యార్థి ఆత్మహత్యకు వైకాపా నేతలే కారణం. ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. నిందితులపై కేసు కూడా పెట్టలేదు. నెలరోజులు ఓపిక పట్టండి. చంద్రబాబు-పవనన్న ప్రభుత్వం రాబోతోంది. విచారణ చేసి నిందితులకు శిక్ష పడే వరకు వదిలిపెట్టం.
షేక్ నిజాం, యాంకర్: వైకాపా ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. వంద మందికి పైగా మైనార్టీలు దౌర్జన్యాలకు, అత్యాచారాలకు గురయ్యారు. దీనిపై ఏవిధంగా చర్యలు తీసుకుంటారు?
నారా లోకేష్- వైసీపీ ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలపై దాడులు పెరిగాయి. అమర్ నాథ్ గౌడ్ అనే విద్యార్థి తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితులపై చర్యలు తీసుకునే బాధ్యత మాది.
యువకుడు: రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు. అయినా రాయలసీమ అంటే కరువు అనే గుర్తుకువస్తుంది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు?
తెలుగుగంగ తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ. హంద్రీనీవా 90శాతం పూర్తిచేసింది, 90శాతం సబ్సీడీపై డ్రిప్ పరికరాలు ఇచ్చింది, హార్టికల్చర్ ను రాయలసీమలో పెద్దఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. అనంతకు కియా పరిశ్రమను తీసుకువచ్చింది చంద్రబాబు. షామీని రాయలసీమకు తీసుకువచ్చింది చంద్రబాబు. కర్నూలు పార్లమెంట్ చాలా వెనుకబడి ఉంది. రెండు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తే కర్నూలు సస్యశ్యామలం అవుతుంది. మేం వచ్చిన తర్వాత వాటిని యుద్ధప్రాతిపదికిన పూర్తిచేస్తాం. మిషన్ రాయలసీమలో భాగంగా నేను అనేక హామీలు ఇచ్చా. ఆటోమోటివ్ హబ్ గా, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్టర్ క్లస్టర్ గా హార్టికల్చర్ హబ్ గా, స్పోర్ట్స్ హబ్ గా, డిఫెన్స్ హబ్ గా రాయలసీమను తీర్చిదిద్దుతాం.
యువత: మధ్య తరగతి కుటుంబం బతకాలంటే చాలా కష్టమైంది. అన్ని ధరలు పెరిగాయి. కరెంట్ బిల్లు పెరిగిపోయింది. మీరు ఎలా నియంత్రిస్తారు.
నారా లోకేష్ – జగన్ రెడ్డి అప్పుల అప్పారావు. జగన్ రెడ్డి వద్ద రెడ్ బటన్, బునుగు బటన్ ఉంటుంది. బునుగు బటన్ నొక్కి అకౌంట్ లో రూ.10వేసి, రెడ్ బటన్ తో వంద లాక్కుంటున్నారు. కరెంట్ ఛార్జీలు 9సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారు. చెత్తపై పన్ను వేశారు. చివరకు క్వార్టర్ ధరలు పెంచారు. బటన్ నొక్కడమే కాదు… అభివృద్ధి చేయాలి. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. పన్నుల భారం తగ్గించాలి. చెత్త పన్ను మేం తీసివేస్తాం. ఇంటి పన్ను తగ్గిస్తాం. పద్ధతి ప్రకారం పెట్రోల్, డీజిల్ పై వేసిన పన్నులు కూడా తగ్గిస్తాం. మన ప్రాంతానికి పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. గతంలో మెగా సీడ్ పార్క్, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకువచ్చా. జగన్ రెడ్డి చేతగానితనం వల్ల అవి వెళ్లిపోయాయి. కేవలం సంక్షేమం ఒక్కటే కాదు.. పేదరికం నుంచి బయటకు తీసుకురావాలంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
యువతి: మహిళలకు రాత్రిపూట కూడా బస్ సౌకర్యం కల్పించాలి.
నారా లోకేష్ – ముందు మహిళలకు భద్రత కల్పించాలి. ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రి జబర్దస్త్ ఆంటీ రోజా నాకు చీరలు, గాజులు పెడతామని చెప్పారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మేం వచ్చిన తర్వాత మార్పులు తీసుకువస్తాం.
యువతి: మీ ఇన్ స్పిరేషన్ ఎవరు?
నారా లోకేష్- నా ఇన్ స్పిరేషన్ మొదట వాజ్ పేయి గారు. రెండో వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు, మూడో వ్యక్తి చంద్రబాబునాయుడు గారు, నాలుగో వ్యక్తి సింగపూర్ ను మత్స్యకార గ్రామం నుంచి ను పైనాన్షియల్ హబ్ గా చేసిన వ్యక్తి లీక్వా న్యూర్. పేదరికం లేని దేశంగా తీర్చిదిద్దారు.
రాధిక: మాకు ఫీజు రీయింబర్స్ మెంట్ కావాలి.
నారా లోకేష్- విద్యాదీవెన, వసతి దీవెన తీసుకువచ్చి ఇబ్బందులు పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం అమలుచేస్తాం. చదువుకు మా కుటుంబం ప్రాధాన్యత ఇస్తుంది. స్కూల్, పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య పథకాలను మేం మళ్లీ తీసుకువస్తాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
యువకుడు: నంద్యాల ఉపఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు గారు అనేక హామీలు ఇచ్చారు. మీరు వచ్చిన తర్వాత అవి పూర్తిచేస్తారా? నంద్యాలలో అభివృద్ధి పేరుతో ఇళ్లు కూల్చిసిన వారికి న్యాయం చేయాలి.
నారా లోకేష్ – నంద్యాలలో పసుపు జెండా ఎగరేస్తే ఆగిపోయిన పనులు పూర్తిచేసే బాధ్యత మేం తీసుకుంటాం. సండే ఎమ్మెల్యేకు బైబై చెప్పిండి. శాశ్వతంగా హాలిడే ఇవ్వండి. ఆనాడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగితే.. మాకు సండే ఎమ్మెల్యే వద్దని రాశారు. మేం వచ్చిన తర్వాత ఆగిపోయిన పనులు పూర్తిచేస్తాం. ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయం చేసే బాధ్యత మాది.
షేక్ నిజాం, యాంకర్: పాతబస్తీలో అల్లర్లు ఎక్కువగా జరిగేప్పుడు చంద్రబాబు గారు కమిటీ వేసి మైనార్టీలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందజేశారు.
నారా లోకేష్- ఆనాడు హైదరాబాద్ లో శాంతిభద్రతలు రక్షించాం కాబట్టే 15 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫార్మాసిటీ, బయోటెక్ పార్క్ ఉంది. దీనికి కారణం శాంతిభద్రతలను పరిరక్షించడమే. ఏపీలో శాంతిభద్రతలు దారితప్పాయి. మేం వచ్చిన తర్వాత దారిలో పెడతాం. మైనార్టీల్లో పేదరికానికి కారణం చదువు మధ్యలో నిలిపివేయడమే. వారు పై చదువులు చదవాలి. ఆ విధంగా చర్యలు తీసుకుంటాం.
షేక్ నిజాం, యాంకర్: సీఏఏ,ఎన్ఆర్సీకి మద్దతిచ్చిన వైకాపా ఎంపీలు మళ్లీ టీడీపీపై నిందలు వేస్తున్నారు. దీనిని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు?
నారా లోకేష్- టీడీపీ హయాంలోనే మైనార్టీ సోదరులు అభివృద్ధి చెందారు. ముస్లీం సోదరులను లోక్ సభకు, రాజ్యసభకరు పంపాం. కౌన్సిల్ ఛైర్మన్ గా ముస్లీం మైనార్టీలను ప్రోత్సహించింది తెలుగుదేశం. రాజకీయంగా మైనార్టీలకు అవకాశం కల్పించింది టీడీపీ. ముందుముందు అనేక సంక్షేమ కార్యక్రమాలు మైనార్టీలకు అందిస్తాం.
యువతి: నారా లోకేష్ – ఫార్మసీ సెక్టార్ చాలా ముఖ్యం. ఈ ఐదేళ్లలో ఈ రంగంలో ఎక్కడా ఉద్యోగాలు రాలేదు. మీరు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అంటున్నారు. ఇందులో ఫార్మా రంగంలో ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు?
నారా లోకేష్- అన్ని రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రైవేటు, ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పిస్తాం. స్వయం ఉపాధి ద్వారా కూడా ఉద్యోగాలు కల్పిస్తాం.
షేక్ నిజాం, యాంకర్: 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్, మోడీ ఫోటోలు ఉన్నాయి. ఇప్పటి మేనిఫెస్టోలో మోడీ ఫోటో ఎందుకు లేదు?
నారా లోకేష్- అది బీజేపీ సిద్ధాంత పరంగా నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో సింగిల్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో వారి సొంత మేనిఫెస్టో ఇవ్వాలనుకుంటే మోడీ గారి ఫోటో లేకుండా ఇవ్వాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీ మేం నిలబెట్టుకుంటాం.
షేక్ నిజాం, యాంకర్: సూపర్ సిక్స్ హామీలు బాగున్నాయి. మేనిఫెస్టో రూపకల్పనలో మీ భాగస్వామ్యం ఉందా?
నారా లోకేష్ – యువగళం ద్వారా 3132 కి.మీ పాదయాత్ర చేశా. ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా. అవి తెలుసుకున్న తర్వాత చంద్రబాబునాయుడు, పవనన్నతో చర్చించి బాబు-సూపర్ 6 హామీలు రూపొందించాం. ఆ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి కష్టాలు, కన్నీరు నుంచి ఆ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. హామీలను అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
యువతి: ఫార్మ్ డీ స్టూడెంట్ ను నేను. ఇది కొత్త కోర్సు. ఏదైనా ఆసుపత్రికి వెళితే మాకు మినిమమ్ రెస్పెక్ట్ లేదు. గ్రాడ్యుయేషన్ తర్వాత మాకు ఏమైనా ఉద్యోగాలు ఉంటాయా?
నారా లోకేష్- ఎకో సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ గా ఉద్యోగాలు వస్తాయి. ఫార్మ్ డీ విషయంలో పరిశీలించిన తర్వాత స్పందిస్తా.
నిఖిల్: నేను ఎంబీయే పూర్తిచేశాను. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎలానో దేశానికి బెంగళూరు అలా తయారైంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో కూడా అలాంటి సిటీ గుర్తుకువచ్చే విధంగా చేయగలరా?
నారా లోకేష్ –ఏపీ అంటే కియా గుర్తుకువస్తుంది. ఏనాడైనా ఊహించామా? చంద్రబాబునాయుడు గారు ఒక్కో జిల్లాకో ఒక్కో ప్రాధాన్యత ఇచ్చారు. ఎకో సిస్టమ్ తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించారు. చిత్తూరు, అనంత, కర్నూలులో చేశాం. ఇంకా చేయాల్సింది ఉంది. పోర్టులు, ఫిషరీస్, డిఫెన్స్ తీసుకురావచ్చు. ఆ విధానం మళ్లీ తీసుకువస్తాం.
షేక్ నిజాం, యాంకర్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నారు. మరోవైపు టౌన్ సర్వీసులు లేవు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
నారా లోకేష్- దామాషా ప్రకారం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రూట్స్
షేక్ నిజాం, యాంకర్: ఐటీగా ఏం నగరాన్ని ఎంచుకుంటారు?
నారా లోకేష్- విశాఖలో ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
యువతి: నంద్యాలలో సీడ్ పార్క్ ను చంద్రబాబు గారు ఘనంగా ప్రారంభించారు. వైసీపీ రాగానే నిలిచిపోయింది. మీ ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేస్తారు?
నారా లోకేష్- నంద్యాల పట్టణంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేస్తాం. ఆగిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మెగా సీడ్ పార్క్, అబ్దుల్ హక్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ పనులు పూర్తిచేస్తాం.
యువకుడు: మీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లను తీసేస్తామంటున్నారు. వారి జీతాలు పెంచాలి.
నారా లోకేష్- వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. వారి జీతాలను రూ.10వేలకు పెంచుతాం. వారిని ప్రజాప్రతినిధులతో అనుసంధానిస్తాం. అప్పుడే మెరుగైన సంక్షేమ పథకాలు అందించగలం.
యువతి: ఉద్యోగం కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి. వైనాట్ ఏపీ?
నారా లోకేష్- వైనాట్ ఏపీ అని మీరు అంటున్నారు.. మేలుకో ఆంధ్రుడా అని మేం అంటున్నాం. ఎన్నాళ్లు కులం, మతం పేరుతో ఓట్లేస్తాం. ఒక్క అవకాశం పేరుతో జగన్ రెడ్డి అంతా నాశనం చేశారు. కోడిగుడ్డు మంత్రి వల్ల హెచ్ ఎస్ బీసీ పొరుగున తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఫస్ట్ టైం ఓటర్లు.. ఎవరైతే మీకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తారో, మీ భవిష్యత్ గురించి ఆలోచిస్తారో, పరిశ్రమలు తీసుకువస్తారో వారిని గెలిపించాలి.
యువతి: ఆదోనిలో అన్న క్యాంటీన్ ద్వారా రైతులకు రూ.5కే భోజనం పెట్టారు. తిరిగి అన్న క్యాంటీన్లను తీసుకువస్తారా?
నారా లోకేష్- మూసేసిన అన్య క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాం. మూడు పూట్లా భోజనం పెడతాం. మేనిఫెస్టోలో కూడా ఈ హామీని పొందుపర్చడం జరిగింది.
యువతి: అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడో చోట అత్యాచారం జరుగుతోంది. దిశా యాప్ వల్ల ఉపయోగం లేదు.
నారా లోకేష్- అధికారంలో ఉన్న వారే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మా తల్లి గారిని అవమానిస్తే జగన్ రెడ్డి ప్రోత్సహించారు. చంద్రబాబు గారంటే రౌడీలకు భయం. చట్టాలు అందరికీ సమానంగా అమలు చేసేవారు. ఈ ప్రభుత్వంలో చట్టం కొందరికి చుట్టం అయింది. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్ రీవ్యాంప్ చేయాలి. మహిళలను గౌరవించే విధంగా విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది.
షేక్ నిజాం, యాంకర్: డబుల్ బెడ్ రూం ఇళ్లు లక్ష కట్టినా ఇప్పటికీ పొందని వాళ్లు ఉన్నారు. దీనికోసం ఏం చేస్తారు?
నారా లోకేష్ – గతంలో టిడ్కో ఇళ్లను నాణ్యతలో రాజీపడకుండా నిర్మించాం. ఆయా టిడ్కో కాలనీల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషిచేశాం. వచ్చే ప్రభుత్వం వీటన్నింటిని ముందుకు తీసుకెళ్తాం.
యువకుడు: ముస్లీంలు అంటేనే బీజేపీ పట్ల వ్యతిరేకత ఉండేవారు. అలాంటి బీజేపీతో మీరు పొత్తు పెట్టుకున్నారు. మాకు ఎలాంటి భద్రత, భరోసా ఇస్తారు? నంద్యాలలో ముస్లీంలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలి.
నారా లోకేష్ – టీడీపీ-బీజేపీ పొత్తు కొత్త కాదు. 2014లో పెట్టుకున్నాం. రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలు తీసుకువచ్చాం. రంజాన్ సమయంలో మసీదులకు నిధులు ఇచ్చాం. టీడీపీ హయాంలో మైనార్టీలపై ఏనాడూ దాడులు జరగలేదు. మీకు అన్ని విధాల అండగా ఉంటాం. నంద్యాలలో 10వేల ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభిస్తే వైసీపీ వచ్చిన తర్వాత నిలిపివేశారు. భూదందాలు తప్ప సండే ఎమ్మెల్యే ఏనాడూ పట్టించుకోలేదు.
యువకుడు: స్థానిక సంస్థల్లో పోటీకీ నేను రెండు సార్లు నామినేషన్ వేస్తే.. వైసీపీ నాయకులు అనేక ఇబ్బందులు పెట్టారు. పోటీచేసి ఉంటే నేను సర్పంచ్ లేక ఎంపీటీసీ అయ్యేవాడిని. నన్ను తిరగనివ్వకుండా నా స్వేచ్ఛను హరించారు.
నారా లోకేష్ – యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలి. తెలుగుదేశం ఏనాడు వైకాపా నాయకులను ఇబ్బంది పెట్టలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ తప్పూ చేయని చంద్రబాబునాయుడును 53 రోజులు జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నా, బయట ఉన్నా సింహం సింహమే. అందుకే జగన్ ను వేటాడేందుకు వచ్చింది ఈ సింహం. చంద్రబాబునాయుడు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టరు. ఆయన చేసిన ప్రతి తప్పుకు చర్యలు మేం తీసుకుంటాం, వదిలిపెట్టం. మీ లాంటి యువకులను ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టింది. ఎంపీటీసీగా, సర్పంచ్ గా పోటీచేయాలనుకుంటే వారి పిల్లలపై కేసులు పెట్టారు. పాస్ పోర్టులు రాకుండా చేశారు. నెల రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. అక్రమ కేసులు ఎత్తివేసే బాధ్యత తీసుకుంటాం.
సద్దాం హుస్సేన్: గత ఐదేళ్లుగా జాబ్ కేలండర్ విడుదల చేస్తానని జగన్ మభ్యపెట్టి మోసం చేశారు. కోచింగ్ ల కోసం తల్లిదండ్రుల వద్దే చేయిచాచి మేం డబ్బులు అడిగే పరిస్థితి. మీరు మెగా డీఎస్సీ ప్రకటిస్తామన్నందుకు సంతోషంగా ఉంది. మీపై మాకు నమ్మకం ఉంది. 25వేల పోస్టులు భర్తీ చేస్తారని మాట ఇవ్వాలి.
నారా లోకేష్ – డీఎస్సీ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ అనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఐదేళ్లలో పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాం. సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ప్యూన్ నుంచి గ్రూప్స్ వరకు పోస్టులు భర్తీ చేస్తాం. యూనిఫైడ్ జాబ్ కేలండర్ తీసుకువస్తాం.
షేక్ నిజాం, యాంకర్: పారిశ్రామికవేత్తలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు. మీ పాలసీ ఏమిటి?
నారా లోకేష్ – చాలా మంది పారిశ్రామికవేత్తలు నన్ను కలిశారు. ప్రోత్సహకాలు ఇచ్చి పరిశ్రమలు తీసుకువస్తాం. చంద్రబాబు అనేక పరిశ్రమలను తీసుకువచ్చారు. కియాను తీసుకువచ్చింది చంద్రబాబు. పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకువస్తాం. అందుకు కావాల్సిన పాలసీ రూపొందిస్తాం.
వైష్ణవి: అమరావతిని రాజధాని చేస్తామంటున్నారు. విశాఖలో ఐటీ అంటున్నారు. మరి కర్నూలు పరిస్థితి ఏమిటి సార్? ఓసీకి రిజర్వేషన్ లేదు. మాకు రిజర్వేషన్ కల్పిస్తారా?
నారా లోకేష్ – కర్నూలు హార్టికల్చర్ హబ్ గా చేస్తాం. రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తాం. సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకువస్తాం. మెగా సీడ్ పార్క్ ఏర్పాటుచేస్తాం, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తిచేస్తాం. లాజిస్టిక్ హబ్ గా చేసే బాధ్యత తీసుకుంటాం. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు 10శాతం రిజర్వేషన్ అమలుచేస్తే వైసీపీ రద్దు చేసింది. మేం మళ్లీ తీసుకువస్తాం. బడుగు, బలహీన వర్గాలకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్ తీసుకువస్తాం.
పురందేశ్వరి: కోవిడ్ సమయంలో మా డాడీ చనిపోయారు. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. నేను, మా చెల్లి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం.
నారా లోకేష్- నెల రోజులు ఓపిక పట్టండి. మిమ్మల్ని, మీ చెల్లిని చదివించే బాధ్యత తెలుగుదేశం-జనసేన తీసుకుంటుంది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం పూర్తిస్థాయిలో అమలుచేస్తాం.