– రూ. వేల కోట్ల పెట్టుబడికి రంగం సిద్ధం: ఇంటిగ్రేటెడ్ క్లస్టర్‌పై లోకేష్ సంచలన ప్రతిపాదన
చరిత్రలో తొలిసారిగా ఇండియాకు ఎయిర్‌బస్ గ్లోబల్ బోర్డు! అనంతపురం సహా మూడు విభాగాల కీలక ప్రాజెక్టులపై చర్చలు; దేశంలోనే అగ్ర ఏరోస్పేస్ హబ్‌గా ఏపీ లక్ష్యం.
ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న ఎయిర్‌బస్ (Airbus) సంస్థ, భారతదేశంలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కీలక అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా, ఎయిర్‌బస్ చైర్మన్ రెనే ఒబెర్మాన్ సహా మొత్తం గ్లోబల్ బోర్డు సభ్యులు ప్రత్యేకంగా భారత పర్యటనకు రావడం, రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ మంత్రి నారా లోకేష్‌తో కీలక భేటీ నిర్వహించడం సంచలనంగా మారింది.
ఒక ప్రాజెక్టు కాదు… మూడు విభాగాల క్లస్టర్!
ఎయిర్‌బస్ నుండి కేవలం ఒక ఫ్యాక్టరీని మాత్రమే ఆశించకుండా, ఏకంగా మూడు ప్రధాన విభాగాల కార్యకలాపాలను ఏకతాటిపైకి తెచ్చే ‘మల్టీ-డివిజన్ ఇంటిగ్రేటెడ్ ఏరోస్పేస్ క్లస్టర్’ (MDIAS) ప్రతిపాదనను మంత్రి లోకేష్ వారికి ప్రతిపాదనలు చేశారు అని తెలుస్తోంది.
1. హెలికాప్టర్ల విభాగం (Airbus Helicopters):
పెట్టుబడికి అత్యంత ఉత్సాహం చూపిస్తున్న విభాగం ఇదే. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) భాగస్వామ్యంతో తయారు చేయనున్న అత్యంత ప్రజాదరణ పొందిన H125 హెలికాప్టర్ల తుది అసెంబ్లీ కేంద్రం (FAL) ఏర్పాటుకు ఎంపిక చేసిన నాలుగు ప్రదేశాలలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఒక బలమైన పోటీదారుగా నిలిచింది. FAL దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందించింది.
H130 భాగాల తయారీ: ఇది మాత్రమే కాక, H130 హెలికాప్టర్ల ఫ్యూజ్‌లేజ్ (ప్రధాన భాగం) తయారీకి సంబంధించిన కాంట్రాక్టులు ఇప్పటికే ఇవ్వడం, ఏపీలో హెలికాప్టర్ల తయారీ సప్లయ్ చైన్ పటిష్టం కానుందనే సంకేతాలు ఇస్తోంది.
MRO కేంద్రం: దేశంలో పెరుగుతున్న విమానయాన అవసరాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్‌లో ఒక భారీ MRO (నిర్వహణ, మరమ్మత్తు & ఓవర్‌హాల్) హబ్ ఏర్పాటు చేయాలని లోకేష్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
2. రక్షణ రంగంలో ఆసక్తి (Airbus Defence and Space):
ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ విభాగం కూడా ఏపీపై తన గత ఆసక్తిని ముందుకు తెచ్చింది. ముఖ్యంగా, C295 రవాణా విమానాల కార్యక్రమాలు, మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలకు అవసరమైన విడిభాగాల తయారీ, సమీకృత రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను రాష్ట్రంలో నెలకొల్పడానికి ఈ విభాగం సిద్ధమవుతోంది.
3. వాణిజ్య విమానాల విభాగం (Airbus Commercial):
భారతదేశంలో 850కి పైగా ఎయిర్‌బస్ విమానాల బలగం ఉంది. ఈ వాణిజ్య విమానాల విడిభాగాల తయారీకి, కీలక సప్లయ్ ఛైన్ ను బలోపేతం చేయడానికి ఏపీలోని MSMEలను భాగస్వాములను చేయాలనే ప్రతిపాదనలు ఈ చర్చల్లో ప్రధానంగా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ‘ఏరోస్పేస్ కారిడార్’ అస్త్రం:
ఎయిర్‌బస్ బోర్డు సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి లోకేష్, వారి బహుళ-విభాగాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘ఏరోస్పేస్ కారిడార్లను’ రాష్ట్రం అందిస్తుందని స్పష్టం చేశారు.
సప్లయర్స్, MSMEలు మరియు ఎయిర్‌బస్ ప్రధాన యూనిట్లు ఒకే ఏకోసిస్టంలో పనిచేసే ఈ సమగ్ర క్లస్టర్ ప్రతిపాదనకు ఎయిర్‌బస్ బోర్డు సానుకూలంగా స్పందించింది.
భారీ పెట్టుబడులను ఆకర్షించి, ఆంధ్రప్రదేశ్‌ను దేశ ఏరోస్పేస్ తయారీ రంగానికి కొత్త దిక్సూచిగా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో ఏపీ నుంచే ప్రపంచస్థాయి విమాన భాగాల ఉత్పత్తి జరగడం ఖాయమని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు విశ్వసిస్తున్నాయి.