– లోకేష్‌కు సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఫిర్యాదు
– ‘మేడమ్ సార్’ జోక్యంపై లోకేష్‌కు ఫిర్యాదు చేసిన నరేంద్ర?
– తనపై ఆంధ్రజ్యోతిలో వ్యతిరేక కథనం రాయించడంపై ఆగ్రహం
– రాసిన విలేకరి భద్రత కోసం ఏకంగా పత్రికాధిపతికి లేఖ రాసిన మేడమ్?
– వాస్తవాలు వివరిస్తూ డాక్యుమెంట్లు ఇచ్చిన నరేంద్ర?
– రాసిన విలేకరికి సంగం డైరీ సెంటర్లు?
-రైతుపక్షం వహించినందుకే తనపై తప్పుడు రాతలని ధూళిపాళ్ల ఫిర్యాదు?
– నే డు గుంటూరు ‘మేడమ్సార్’ రుబాబుపై రైతుల ప్రెస్‌మీట్?
– ఆడియో టేపులు విడుదల చేయనున్న బాధిత రైతాంగం?
– నరేంద్ర తప్పేమీ లేదంటూ మీడియాకెక్కిన రైతులు
– మేడమ్ సార్ పెత్తనమేమిటని రైతుల ఆగ్రహం
– ఇప్పటికే ‘మేడమ్ సార్’పై ఉమ్మడి జిల్లాలో టీడీపీ సీనియర్ల ఫిర్యాదుల వెల్లువ
– గతంలో ఎమ్మెల్యే యరపతినేని, ఇప్పుడు గుంటూరు మేయర్‌తోనూ ‘మేడమ్ సార్’ పంచాయితీ
– గుంటూరులో మేయర్ ఫొటో లేకుండానే మేడమ్ ఫ్లెక్సీలు
– రియల్ఎస్టేట్ దందాతో పార్టీ ఇమేజీని డ్యామేజీ చేస్తున్నారంటున్న సీనియర్లు
– దర్శి వైసీపీ ఎమ్మెల్యేతో వ్యాపారబంధమంటూ విమనాస్త్రాలు
– ఇంతకూ ఎమ్మెల్యే.. సారా? మేడమా?
– గుంటూరు జిల్లా టీడీపీలో ‘భూ’కంపం
( మార్తి సుబ్రహ్మణ్యం)
నిజానికి ఆమేమీ తొలి నుంచీ పార్టీ జెండా పట్టిన పసుపు కార్యకర్తేమీ కాదు. జగన్ జమానాకు వ్యతిరేకంగా.. మిగిలిన మహిళా నేతల మాదిరిగా, కొంగుబిగించిన వీరనారి అంతకంటే కాదు. కేసులు, జైళ్లకెళ్లిన మహిళా నేత కూడా కాదు. అయినా ఏదో ఒక మార్గంలో.. ఆ ‘సాంబశివుడి’ దయతో, అమరావతి జిల్లా కేంద్రంలోని ఓ నియోజకవర్గం నుంచి, టీడీపీ టికెట్ దక్కించుకున్న అదృష్టవంతురాలు.
అదేమీ అల్లాటప్పా నియోజకవర్గం కాదు. కమ్మ వర్గం దండిగా.. కాపులు మెండుగా ఉన్న టీడీపీకి తిరుగులేని పట్టున్న నియోజవకర్గం. అందుకే సునాయాసంగా గెలిచేశారు. మరి అనుకోకుండా వచ్చిన అలాంటి అవకాశాన్ని మేడమ్ గారు, ఏ స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి? అందరినీ సమన్వయం చేసుకుని నలుగురినీ మెప్పించొద్దూ?!
కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు భిన్నం. కారణం మేడమ్ కానేకాదు. ఆమె పేరుతో అధికారం చెలాయిస్తున్న ‘మేడమ్సార్’..ట! ఆయన రియల్ఎస్టేట్ సామ్రాజ్య విస్తరణే ఇప్పుడు, టీడీపీలో ‘భూ’ ంపం సృష్టిస్తోంది. అది సీనియర్ టీడీపీ ఎమ్మెల్యేలను నాయకత్వానికి ఫిర్యాదుచేసే వరకూ వెళ్లింది. ఇదీ ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో ‘మేడమ్సార్’ సృష్టిస్తున్న ‘భూ’కంపం!
ధూళిపాళ్ల నరేంద్ర.. ఇది రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ పాలనపై అసెంబ్లీలో చెలరేగిన.. ఇప్పటి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమ, తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేం నరేందర్‌రెడ్డి, అమర్నాధ్రెడ్డి వంటి యువగళాలలో ఒక గళం. అటు వైఎస్.. ఇటు కేసీఆర్‌పై జమిలిగా విరుచుకుపడి, ఒంటికాలిపై లేచిన యంగ్టర్కుల్లో ఒకరు నరేంద్ర! ఒకరకంగా వీరంతా అప్పట్లో పసుపు పతాకకు ప్రతినిధులు!! తండ్రి ధూళిపాళ్ల వీరయ్యచౌదరి, టీడీపీ ఆవిర్భావ సభ్యుల్లో ఒకరు. అయినా నరేంద్రకు ఇప్పటివరకూ మంత్రి పదవి రాలేదు. అది వేరే విషయం.
అంతేనా?.. జగన్ నియంతృత్వాన్ని సవాల్ చేస్తున్నారన్న కసితో, పగపట్టిన వైసీపీ సర్కారు మాయోపాయానికి బలైపోయి, జైలుకు వెళ్లిన పోరాట యోద్ధ నరేంద్ర. సంగం డైరీని మూసి వేసి, ఉమ్మడి గుంటూరు జిల్లాలో అమూల్ నోటి నిండా పాలు నింపాలన్న జగన్ ఆశలను నరేంద్ర అడియాశలు చేయడమే దానికి కారణం.
అలాంటి ధూళిపాళ్ల నరేంద్ర.. తనపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోంద ంటూ, నాయ త్వానికి ఫిర్యాదు చేస్తారని ఎవరైనా ఊహిస్తారా? పార్టీలో కొత్తగా వచ్చిన రియల్టర్లు మీడియాలో తనకు వ్యతిరేకంగా కథనాలు రాయిస్తున్నారని, నాయకత్వం ముందు ఆరోపిస్తారని ఎవరైనా ఊహిస్తారా? నో.. నెవర్!
కానీ ఇప్పుడు జరిగింది అదే!! పార్టీలో గుంటూరు జిల్లా కేంద్రంలో.. కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే భర్త భూదందాను అడ్డుకున్న తనపై, ఆంధ్రజ్యోతిలో కథనం రాయించారని, నేరుగా యువనేత లోకేష్‌కే ఫిర్యాదు చేసిన ధూళిపాళ్ల నరేంద్ర తెగువ.. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో ‘భూ’కంపానికి కారణమవుతోంది. ఇదే ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో హాట్‌టాపిక్!
ఇక గుంటూరుకు వెళితే.. గత ఎన్నికలకు ముందు టీడీపీకి ఎలాంటి సంబంధం లేకపోయినా, ఒక బీసీ మహిళకు గుంటూరు జిల్లా ప్రధాన కేంద్రం నుంచి టీడీపీ సీటిచ్చారు. ఆమె భర్త కమ్మవర్గానికి చెందిన వారు కావడం కూడా అందుకు కలసివచ్చింది. ఎందుకంటే అది కమ్మ ప్రభావిత- కాపు ఆధిపత్య నియోజకవర్గం కాబట్టి! సహజంగా కమ్మ-కాపులు కలవడంతో మేడమ్ గారి ఎన్నిక నల్లేరుపై నడకయింది.
అంతకుముందు మేడమ్ గారి భర్తకు రియల్ఎస్టేట్ వ్యాపారాలున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని, వెంచర్లు వేయడం మేడమ్సార్ వృత్తి. దర్శిలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేతో బాదరాయణ వ్యాపారబంధం ఉండటం కలసి వచ్చి, అది గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మి ఓటమికి కలసివచ్చిందనేది దర్శి తమ్ముళ్ల ఆరోపణ.
ఆ కంపెనీలో మేడమ్ కూడా ఒక డైరక్టరేనట. కానీ ఏమాటకు ఆ మాట. మేడమ్ గారి పాత్ర అటు వ్యాపారంలో గానీ, రాజకీయాల్లోగానీ నామమాత్రమేనట. అధికారిక ఎమ్మెల్యే ఆమె అయినప్పటికీ, అనధికారికంగా అసలు ఎమ్మెల్యే మాత్రం మేడమ్సారేన ని.. ఏమి కావాలన్నా, చివరకు మార్కెటింగ్ యార్డు సెక్రటరి పోస్టు కావాలన్నా మేడమ్సార్నే కలవాలన్నది బహిరంగ రహస్యమేనట!
మేడమ్ ఎమ్మెల్యే అయిన తర్వాత.. ‘మేడమ్సార్’ హోదాను అడ్డుపెట్టుకుని, సార్.. తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించడ ం ప్రారంభించారు. ఆ క్రమంలో ఇతర నియోజవకర్గాల్లోని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలతోనూ ఘర్షణ పెట్టుకోవడం ప్రారంభించారట. ఆ రకంగా గురజాల టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నియోజవర్గంలో కూడా.. కాళ్లు, వేళ్లు పెట్టి వెంచర్ల వ్యాపారం చేయడం వివాదానికి కారణమయింది.
ఇప్పుడు పొన్నూరు సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతోనూ కిరికిరి పంచాయతీ పెట్టుకోవటం.. అది కాస్తా యువనేత నారా లోకేష్ వరకూ వెళ్లడం, బాధిత రైతులంతా నరేంద్రకు బాసటగా, గుంటూరు మేడమ్సార్కు వ్యతిరేకంగా మీడియాకెక్కడం పార్టీ పరువును రోడ్డుపాలుచేసినట్టయింది.
అసలేం జరిగిందంటే.. కాజా టోల్‌ప్లాజా సమీపంలో టీడీపీకి చెందిన ఒక రైతుకు కొంత పొలం ఉంది. ఆయన అనేకమంది వద్ద అప్పు చేశారు. అది అమ్మినా కూడా తీర్చలేనన్ని బాకీలున్నాయి. నిజానికి ఆ భూమి బ్యాంకు లోనులో ఉంది. దానిని తీర్చకపోవడంతో బ్యాంకు అధికారులు వేలం వేశారు. అయినా దానిని అమ్మినా అప్పులు మొత్తం తీర్చలేని పరిస్థితి.
ఈ క్రమంలో మేడమ్సార్ ఎమ్మెల్యే గారి రియల్ఎస్టేట్ రంగ ప్రవేశం చేసి దానిని కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగింది. దానిని రిజిస్ట్రేషన్ చేసుకునే దశలో విషయం తెలిసిన రైతులు అడ్డుకున్నారు. ఆ భూమి ‘మేడమ్ సార్ కంపెనీకి’ అమ్మేస్తే తమ సంగతేమిటని ఆందోళనకు దిగారు. ఆ విషయాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చే యాలని మొరపెట్టుకున్నారు. దానికి స్పందించిన నరేంద్ర.. బాధిత రైతులకు న్యాయం చేసే వరకూ, ఆ భూమిని రిజిస్ట్రర్ చేయవద్దని అధికారులకు సూచించారు.
నిజానికి రైతుల దగ్గర అప్పులు చేసిన రైతుకు ఆ స్థలం వెనకే మరికొంత భూమి ఉంది. కాబట్టి మేడమ్సార్ కంపెనీ నష్టపోకుండా, ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయంచుకోవాలని మేడమ్ సార్ కంపెనీకి సూచించారట. అందుకు అంగీకరించని ‘మేడమ్సార్’.. ఆంధ్రజ్యోతిలో నరేంద్రకు వ్యతిరేకంగా కథనం రాయించడం రచ్చకు దారితీసింది. నరేంద్ర సబ్ రిజిస్ట్రార్లను బెదిరించి, తన వారికి భూములు రాయించుకుంటున్నారన్నది దాని సారాంశం.
దానితో ఆగ్రహం చెందిన బాధిత రైతులు, నరేంద్రకు మద్దతుగా, మేడమ్సార్ కంపెనీకి వ్యతిరేకంగా ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టడం సంచలనం సృష్టించింది. తక్కెళ్లపాడు కల్యాణమండపం వ్యవహారంలో నరేంద్ర తప్పేమీలేదని, తామంతా వెళ్లి ఆయన కలిస్తేనే పరిష్కారం చేసుకోమని చెప్పారంటూ తక్కెళ్లపాడు గ్రామ టీడీపీ నేతలు ప్రెస్మీట్లో వెల్లడించారు.
ఈ నేపథ్యంలో తనను కావాలని లక్ష్యంగా చేసుకుని ఆంధ్రజ్యోతిలో కథనం రాయించిన మేడమ్సార్తో అమీతుమీ తేల్చుకునేందుకు నరేంద్ర సిద్ధమయ్యారు. అందులో భాగంగా మంత్రి, యువనేత లోకేష్‌ను కలిశారు. పైకి ఇది మర్యాదపూర్వకంగానే కలిపినప్పటికీ.. భూదందాలు చేస్తున్న మేడమ్ సార్‌పై ఫిర్యాదు చేసేందుకేనన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
విశ్వసనీయ సమాచార ప్రకారం.. పత్రికలో తనపై వచ్చిన కథనం, సదరు మేడమ్సార్ రాయించిందేనని, సదరు విలేకరి ఆయనతో సన్నిహితంగా ఉంటారని లోకేష్‌కు వివరించారట. నిజానికి సదరు విలేకరి జీవనభృతికి గుంటూరులోనే తాను సంగం డైరీ సెంటర్లు ఇప్పించానని కూడా చెప్పారని తెలిసింది. అందులో ఇసుమంత నిజం కూడా లేదని, రైతుల కోరిక మేరకే తాను మాట్లాడానని చెప్పారట. కాగా దానిపై తాను విచారిస్తానని లోకేష్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇదిలాఉండగా.. ‘మేడమ్సార్’ తీరుపై గుంటూరు టీడీపీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారట. పార్టీకి సంబంధం లేకపోయినా, ముక్కూమొహం తెలియకపోయినా మేడమ్‌ను గెలిపించిన నాయకులకు, కనీస గౌరవం కూడా ఇవ్వరా? నాయకుల ఫొటోలు ఫ్లెక్సీల్లో వేయరా? వీళ్లను చూసి మేం ఓట్లు వేశామా? వన్‌టైమ్ ఎమ్మెల్యేగా మిగిలిపోతారా? అని రుసరుసలాడుతున్నారట.
నిజానికి ద్వారకాతిరుమలరావు డీ జీపీగా ఉన్నప్పుడు.. నార్త్క్లబ్పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానిని మూసివేయించారు. తనకు ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి, ఆ క్లబ్ నిర్వహణ అప్పగించడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. అక్కడ ఏ వ్యాపారం చేసుకోవాలన్నా, శివారు ప్రాంతాల్లో వెంచర్లు వేయాలన్నా మేడమ్సార్ అనుమతి కావాలన్న మెలిక, పార్టీని భ్రష్టుపట్టిస్తోందని టీడీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యువనేత లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఇలాంటి ధిక్కారచర్యలు జరుగుతుంటే.. ఇక మిగిలిన జిల్లాల్లో ఎమ్మెల్యే కుటుంబసభ్యుల నిర్వాకాలు, ఇంకెంత భయంకరంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదని, టీడీపీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.