-విదేశాలకు వెళ్లకుండా నోటీస్ జారీ
పెనమలూరు: డెప్యూటీ తహసీల్దార్ విజయకుమార్ పై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు, పెనమలూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి బోడె ప్రసాద్ కోసం కృష్ణా జిల్లా పోలీసులు వేట సాగిస్తున్నారు.
మూడు రోజులుగా కనిపించకుండా పారిపోవటంతో ఆయనను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విదేశాలకు వెళ్తున్నాడని సమాచారం అందటంతో లుక్ అవుట్ సర్క్యూలర్(ఎల్ ఓ సీ) కూడా జారీ చేశారు..
పోలీసుల అదుపులో తొమ్మిది మంది..
ఈ నెల 17వ తేదీన పెనమలూరులో రేషన్ షాపును తనిఖీ చేస్తున్న డెప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, వీఆర్వో మంగరాజుపై బోడెప్రసాద్ అతని అనుచరులతో కలిసి విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో రెవెన్యూ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగటంతో బోడెప్రసాద్ పలాయనం చిత్తగించారు. అయితే ఈ దాడికి సంబంధించి పోలీసులు బోడె అనుచరులు 9 మందిని అరెస్టు చేశారు. మమ్మల్ని బలిపశువులను చేసి నాయకుడు పారిపోవడం ఏమిటని కేసులో ఉన్న యువత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెంట ఉన్న అనుచరులకే న్యాయం చేయని వ్యక్తి.. ఇక ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు.
కఠిన శిక్ష తప్పదు..
కాగా బోడెప్రసాద్ ఆస్ట్రేలియాకు పారిపోతున్నాడని పోలీసులకు సమాచారం అందటంతో లుక్అవుట్ నోటీసు పోలీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాన నిందితుడు బోడె ప్రసాద్ ను పట్టుకొనేందుకు పోలీసు బృందాలతో గాలిస్తున్నామని పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తనిఖీలకు వెళ్లే సమయంలో పోలీసులను వెంట తీసుకెళ్లాలని సూచించారు. పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ శుక్రవారం వివరాలు తెలుపుతూ లుక్అవుట్ నోటీసు అన్ని ఎయిర్పోర్టులకు సీఐడీ ద్వారా పంపామన్నారు. బోడె ప్రసాద్ తో పాటు కేసులో ప్రధాన నిందితులను పట్టుకోవటానికి ఏడు పోలీసు బృందాలు రంగంలోకి దించామని తెలిపారు.