ఎందుకు నీకు
ఆట శివా
బంధాలు
అనుబంధాలు
ఎందుకు కల్పిస్తావు?
ఎందుకు
మాయ చేసి
వాటిలో మమ్ము
మేము మరచేలా
చేసి
నిన్ను మరచేలా
చేస్తావు?
మైమరచినపుడు
అదనుచూసి
దూరం చేసి
ఎందుకు
నీ అస్థిత్వాన్ని
తెలియచేస్తావు?
ఎందుకు
సుఖములు
సంతోషములు
కలిగిస్తావు?
వాటి
ఆస్వాదనలో
నిన్ను
మరచామని
ఎందుకు
మరల
కష్టముల
పాలు చేసి
నిన్ను గుర్తుకు
తెప్పిస్తావు?
ఎందుకు
అనుకున్నవి
అందిస్తావు?
ఆనందించేలా
చేస్తావు
అలా మునిగిపోయిన
తరుణాన
అపజయాల పాలు చేసి
నీ పాదాలు పట్టిస్తావు
ఆటకు
సమ ఉజ్జీలు
ఉండాలి కదా
సాంబ శివా.
అజ్ఞానినైన నాతొ
నీకు ఆటలేల?
జ్ఞానమునో
సుజ్ఞానమునో,
విజ్ఞానమునో ఇమ్ము.
నీతో
ఆటకు సిద్దము
నేను.
సర్వేశ్వరా
వాత్సల్యము తో
నన్ను బ్రోవుము
నీ ఆటల
అలసినాను,
డస్సినాను.
నీ పాదములనే
శరణువేడినాను
నీవు తప్ప
గతి లేదని నమ్మినాను
నీ
కృపా కటాక్ష వీక్షణముల
కరుణ కురిపించి
నీ ఒడిన
నన్ను సేద దీరనిమ్ము
– బి. సతీష్‌కుమార్