జగన్ రెడ్డి, వైఎస్ కలిపి పెంచింది కేవలం రూ.375 మాత్రమే
రూ.3000 పెన్షన్ హామీ అమలెప్పుడు.?
– తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు
“వృద్ధుల పెన్షన్ రూ.2000 నుండి రూ.3000లకు పెంచుతా… అవసరమైతే రూ.4000లకు పెంచుతా” అంటూ 06.02.2019న తిరుపతి సభలో జగన్ ఊదరకొట్టారు. మే 31, 2019న ప్రమాణ స్వీకార సభలో మాటమార్చి ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ పోతానన్నారు. అధికారం చేపట్టి ఇప్పటికీ మూడేళ్లు ముగియవస్తున్న పెంచి ఇచ్చింది కేవలం రూ. 250 మాత్రమే. ఇదేనా మాట తప్పను.. మడమ తిప్పను అంటే.?
దేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ల పథకం ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. 40 సంవత్సరాల క్రితం రూ.35 పెన్షన్ తో మొదలు పెట్టిన ఘనత తెలుగుదేశానికే దక్కింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానిని రూ.75 లు చేశారు. 2014 లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రూ.200 ఉన్న పెన్షన్ మొత్తాన్ని రూ.1000 చేశారు. తర్వాత రూ. 2000 చేశారు. మొత్తం ఐదు సంవత్సరాలలో రూ.1,800 పెంచి 54.25 లక్షల మందికి అందించారు. కానీ జగన్ రెడ్డి రెండున్నర సంవత్సరాలలో రూ. 250 పెంచి ఒకొక్కరికీ రూ. 23,250 ఎగనామం పెట్టి 54.25 లక్షల పెన్షన్ దారులకు రూ. 12,613 కోట్లు మోసం చేశాడు.
చంద్రబాబు నాయుడు రూ.1800 పెంచినా ప్రచారం చేసుకోలేదు.కానీ జగన్ రెడ్డి రూ.250 పెంచి.. రూ.20 కోట్లు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికి మూడుసార్ల ప్రచారంతో రూ. 60 కోట్లు ప్రజాధనం వృధా చేశాడు. వయోపరిమితి తగ్గించడంతో లక్షలాది మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చానని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి.. కొత్తగా ఎంత మందికి పెన్షన్లు మంజూరు చేశారో సమాధానం చెప్పాలి.
అధికారికం లెక్కల ప్రకారమే ప్రస్తుతం మొత్తం పెన్షన్ దారులు 60 లక్షలు కూడా లేరు. ఇది మాట తప్పుడు మడమ తిప్పుడు కాదా?ఇచ్చిన హామీ మేరకు రూ.2500 పెన్షన్ పెంచుతున్నాం అంటూ సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. ఇచ్చిన హామీ ఏమిటి.? అమలు చేస్తున్నదేమిటి.? అనే విషయంపై ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
కుటుంబాలు కలిసి ఉంటేనే సంతోషమని నాడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు అందేవి. కానీ నేడు.. ఇంట్లో ఒక్కరికి మాత్రమే పెన్షన్ అంటూ ముసలోళ్ల నోటి దగ్గర కూడును కూడా లాక్కుంటున్నారు. ఒక రేషన్ కార్డులో ఇద్దరు పెన్షన్ దారులుంటే పెన్షన్ ఇవ్వబోమనడం దుర్మార్గం కాదా.? వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులు, అంగవైకల్యం, వితంతు పిల్లలు ఉంటే ఎవరో ఒకరికే పెన్షన్ అనడం దుర్మార్గం. నేడు జగన్ రెడ్డి పాలనలో పెన్షన్ కావాలంటే కుటుంబాలు గా విడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఒకే ఇంట్లో పది పదవులుండొచ్చు..కానీ ఇద్దరికి పెన్షన్ ఉండకూడదా?
ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి, బాబాయి టీటీడీ ఛైర్మన్, తమ్ముడు ఎంపీగా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, ఆయన తమ్ముడు ఎమ్మెల్యే, కుమారుడు ఎంపీ. ముఖ్యమంత్రి ఆయన అనుయాయుల కుటుంబాలు పదుల సంఖ్యలో రాజకీయ పదవులు పొందారు. ఏ-2 రెడ్డి అయితే పదుల సంఖ్యలో పదవులు అనుభవిస్తూ.. కోట్లాది రూపాయిలు జీతంగా బొక్కుతున్నాడు. కానీ.. పేద వాడికి ఇచ్చే పెన్షన్ విషయంలో మాత్రం, కుటుంబానికి ఒకరికే అనే నిబంధన ఎంత వరకు సమంజసం?