యువతీ యువకుల మధ్య ప్రేమ వ్యవహారాలు రక్తపాతం వరకు వెళ్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో పట్టపగలే ఓ యువతి తన ప్రియుడిపైకి కత్తి దూసింది. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరై ఆపై లైంగిక వాంఛలు తీర్చుకున్నాక ముఖం చాటేయాలని చూసిన ప్రియుడిని నడిరోడ్డుపై కత్తితో పొడిచేసింది. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా
నగరానికి చెందిన ఓ జంట కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి పేరుతో ఆ ప్రియురాలికి మరింత దగ్గరయ్యాడు ఆ యువకుడు. శారీరక సంబంధం కూడా పెట్టుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో మన లవ్ వర్కౌట్ కాదంటూ ప్రియురాలిని దూరం పెడుతూ వచ్చాడా యువకుడు. అతని చేతిలో మోసపోయానని భావించిన ఆ యువతి.. ప్రతీకారంతో రగిలిపోయింది. ఈ క్రమంలో నడిరోడ్డులో ప్రియుడిపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడు రక్తపు మడుగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటే ఆ యువకుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని యువతిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడినట్లు తెలుస్తోంది.