ఇన్ని సంవత్సరాల జీవన పయనంలో కుటుంబ ప్రేమలు సరే కుటుంబానికి బయట నాకు ఎదురైన మనుష్యులెందుకో ఇప్పుడు బాగా గుర్తుకొస్తున్నారు.
నాతో స్నేహం లోనో,ప్రేమలోనో పడ్డవాళ్ళు,నేనుగా వెతుక్కుని ప్రేమించినవాళ్ళు
ఎంతమంది గురించి రాయను. వాళ్ళంతా ఏమైనారని రాయను?
పొంగిపొర్లిన ప్రేమలన్నీ ఎటు మర్లిపోయాయని రాయను?
సమ్మోహనమైన, ఆత్మికమైన బంధాల్లోకి అధాటుగా వచ్చిపడ్డ యాత్రికతని గురించి ఎలా రాయను?
నడిచిన జీవితమంతా వెలుగుదివ్వెల్ని చిమ్మిన ఆ మనుష్యులంతా ఇప్పుడలా ఎందుకు లేరు?
గమ్మత్తైన అమాయకత్వం తో అలరారిన ఆ బంధాల్లోకి గడుసుదనం,పెళుసుదనం ఎలా ఎప్పుడు ప్రవేశించాయి?
నెలవంకని చూస్తూనో,నిండు పున్నమి వెన్నెలని గుండెల్లోకి లాక్కుంటూనో చెట్టు కిందో, చెరువు గట్టు మీదో గంటల్ని క్షణాల్లా కరిగించిన ఆ సమయాలు ఎంత సమ్మోహనాలు?
ఇప్పుడు లేవా అంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి కానీ కొన్ని పురాతన ప్రేమలు
బీటలు పడ్డ కోటల్లాగా మారిపోయాయెందుకో?
అప్పుడప్పుడూ ఆ బీటల్లోంచి ఓ పచ్చటి లేత మొక్క కనిపించినపుడు మనసెందుకుకో పారవశ్యంతో చిందులేస్తుంది.
నిజానికి చిందులేసే వయసా ఇది?!
ఓ మూల కూర్చుని కునికిపాట్లు పడాల్సిన సమయం లో చెదిరిపోయిన ప్రేమ కావ్యాల పేజీలు తిప్పుతూ ఒప్పులగుప్ప ఆడడం,
నా ప్రేమ గంగానది లాగానో,మహా నది లాగానో ఉరవళ్ళు,పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంటే గట్ల వెంబడి నడిచిన వాళ్ళందరూ చిన్న చిన్న ప్రవాహాలై కదిలి వెళ్ళిపోయారు.
కొందరు నాతో కలిసిపోయారు.ఇంకొందరు నా నుంచి విడిపోయి వేరు ప్రవాహాలై సాగిపోయారు.ఎంతటి సజీవ దృశ్యమది?
ముందుకు సాగిపోయిన ప్రవాహాలను వెనక్కి మళ్ళించడం సాద్యమయ్యే పని కాదు.
ఒకనాడు నన్ను ముంచెత్తిన ప్రేమ ప్రవాహాలు నన్ను హత్తుకుంటూ,వదులుకుంటూ ముందుకెళ్ళి పోయాయి.
గుండె పొరల్లో ఇంకిపోయిన ప్రవాహాలవి.
జీవితపు ఒక్కో దశలో ఒక్కో రూపంలో ఒక్కో పేరుతో నాతో మమేకమైన నేస్తాలు ఎంత భిన్నమైనవాళ్ళో నేను వర్ణించతగను.
ఆనందపు అలల మీద నాతో నాట్యం చేయించగలరు.
పంటచేలో పాలకంకిలా నవ్వించగలరు.
ఎడారిలో కూడా నా కోసం కోయిలతో పాడించగలరు.
నేను నిశ్శబ్దంలో కూరుకుపోయినప్పుడు ఢమరుకాలై శబ్దతరంగాలు నాచుట్టూ సృష్టించగలరు.
నా పెదవి అంచు మీద చిరునవ్వు సంతకాలు వీళ్ళు.
ఎందుకనో కొంతమంది కొన్ని చిరునవ్వుల్ని ఎత్తుకెళ్ళిపోయారు.
మళ్ళీ నవ్వుకుందాం రారమ్మంటే మూతిముడుచుకు కూర్చున్నారు.
స్నేహంలోకి అభిజాత్యాలు,అంతస్థుల అంతరాలు చేరితే ఆ స్నేహం స్నేహరూపాన్ని కోల్పోతుంది.
నన్ను దాటుకుని వెళ్ళిపోయిన వాళ్ళంతా ఏదో ఒక రోజు తిరిగి రావచ్చు,రాకపోనూ వొచ్చు.
కానీ వాళ్ళు నా జీవితం మీద వేసిన ప్రేమ ముద్ర బహు సుందరం.
నా లోపలంతా నిండిపోయిన ఈ ముద్రలు,అవి వెదజల్లే పరిమళాలు నన్ను నిత్యనూతనంగా ఉంచే వాటిల్లో ప్రధమ స్థానం పొందాయి.
-కె. సత్యవతి