Suryaa.co.in

National

నవంబర్ 8 మంగళవారం 2022న చంద్రగ్రహణం

గ్రహణ కాల ప్రత్యేక విధులు ఎలా నిర్వహించాలి?
చంద్రగ్రహణ సమయం 8 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2గంటల 48 నిమిషాల నుంచి సాయంత్రం 6గంటల 18 నిమిషాల వరకు..!!

గ్రహణం అంటే ఏమిటి? గ్రహణ సమయం అంటే ఏమిటి?
గ్రహణం అనేదానికి వేదాలకు ముఖ్యమైన ఆరు అంగాల్లో ఒకటైన జ్యోతిషం ప్రకారం సూర్య గ్రహాన్ని, చంద్రగ్రహాన్ని ఛాయాగ్రహాలైన రాహుకేతువులు పీడించడంగా చెప్పవచ్చు. ఆధునికులు చంద్రుడిని గ్రహంగా అంగీకరించరు. అది వేరేసంగతి.

గ్రహణానికి ముఖ్యమైనవి సమయాలు
ఇక్కడ మరో విచిత్రం చంద్రగ్రహణం నాడు జరుగుతోంది.
ఈ ఏడాది చంద్రగ్రహణం నవంబర్ 8వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున రానుంది. రాహుగ్రస్త చంద్రగ్రహణం స్పర్శ కాలం మధ్యాహ్నం 2.38 కాగా మధ్యకాలం సాయంత్రం 4.29 మోక్షకాలం సాయంత్రం 6.18 అవుతోంది. అంటే చంద్రగ్రహణంతోటే చంద్రోదయం కాబోతోంది కనుక దీన్ని రాహుగ్రస్తోదయ చంద్రగ్రహణంగా చెబుతారు. దీని వలన కూడా గ్రహణ విధులు మారిపోతాయి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో గ్రహణ సమయంలో ఎలా విధులు నిర్వర్తించాలో అంతా తెలుసుకోవాలి. ముందుగా ఈ గ్రహణ సమయంలో భరణీ నక్షత్రం వారు చంద్రగ్రహణం చూడరాదు. మేషరాశి వారు చంద్రగ్రహణం నాడు శాంతి చేయించుకోవాలి.

గ్రహణం సమయం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి?
ఇది మంచి ప్రశ్న. గ్రహణ కాలం చాలా ఉత్తమమైన సమయం. చాలా అరుదైన సమయం. చాలా యోగదాయకమైన సమయం. ఈ సమయంలో చేసే సాధనలు కోటిరెట్లు ఉత్తమ ఫలాలను ఇస్తాయి. జపాలు కోటి రెట్లు అవుతాయి. దానాలు లక్షల రెట్లు అవుతాయి. అంటే ప్రతీ రూపాయి లక్షరూపాయల దానంతో సమానం అవుతుంది. ధ్యానం, నిధిధ్యాసం, సమాధి, ప్రాణాయామాది సాధనలకు అనుకూలం. కనుక అనవసరమైన సంభాషణలు చేయరాదు. వృథాపనుల్లో ఉండరాదు. ఇంద్రియలోలత్వం కూడదు. నోటికీ నాలుకకూ విశ్రాంతి ఇవ్వాలి. అంటే మౌనం, నిరాహారం పాటించాలి. ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి. వృథాగా బయట తిరగడం చంద్ర కిరణాలు పొందడం చేయరాదు. చంద్రాదులను చూడడానికి ప్రయత్నించరాదు.

గాయత్రీ జపం చేయవచ్చా?
చేయవచ్చా కాదు. చేయాలి. చేసితీరాలి. గ్రహణవిముక్తి, మోక్షకాలం వరకూ చేస్తూనే ఉండాలి. కేవలం గాయత్రినే కాదు. ఎన్ని ఉపదేశాలు పొందితే ఆ మంత్రాలు అన్నీ జిపించాలి.

తర్పణాలు విడువవచ్చా?
కేవలం తర్పణాలు మాత్రమే కాదు. పిండప్రదానాలు వంటివి కూడా చేయాలి. కనీసం గోసేవ చేసుకొని పెద్దలను పేరుపేరునా తలచుకున్నా చాలు. గ్రహణాలు షణ్ణవతుల్లో భాగం. అంటే పితృదేవతార్చనలు చేయవలసిన తప్పనిసరి రోజుల జాబితా లోనిది. ఈ రోజున పెద్దల పేరిట దానాలు చేసినా తర్పణాలు విడిచినా పెద్దలు అపారంగా సంతోషించి మనసులోని కోరికలు అన్నీ తీరుస్తారు. ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా సంతృప్తి చెందుతారు. నిజానికి పితృశాపాలు, దోషాల నుంచీ విడుదల పొందడానికి జాక్ పాట్ వంటివి. జన్మదోషాలు జాతక దోషాలు కూడా ఈ సమయంలో పితృదేవతార్చనల వలన పోతాయి. దానాలు, తర్పణాదులు చేయలేని వారు కనీసం గోసేవ చేసుకున్నా సమస్త దేవతలూ సంతోషిస్తారు. అన్ని కోరికలూ తీరుస్తారు.

ఆచమనం చేయవచ్చా?
ఇది మంచి ప్రశ్నే. గ్రహణ కాలంలో నీరు కూడా త్రాగకూడదు. అయితే ఇది అందరికీ చెప్పలేదు. కేవలం కఠినమైన సాధనలు చేసే వారికి మాత్రమే చెప్పారు. గ్రహణ స్పర్శకాలానికి ముందే సంధ్యావందనాదులు ప్రారంభించి గాయత్రీ ధ్యానాదులు, అంగన్యాస కరన్యాసాదులు చేసేసుకొని జపం మొదలు మొదలు పెట్టాలి. గ్రహణ స్పర్శకాలంలోకి జపం చేస్తూ ప్రవేశించాలి. గ్రహణ మోక్షకాలం వరకూ జపం చేస్తూనే ఉండాలి. గ్రహణ మోక్ష స్నానం చేసిన తరువాత కాఫీ టీలు సేవించాలి.

స్త్రీలు స్తోత్రాలు చదువుకోవచ్చా?
స్త్రీలు స్తోత్రాదులు మాత్రమే చదువుకోవాలి. వారికి జపతపాదులు చెప్పలేదు. అయితే నేడు అనేక మంది స్త్రీలకు కూడా మంత్రోపదేశాలు చేస్తున్నారు. కనుక మంత్రోపదేశం పొందిన వారు కూడా జపాలు చేసుకోవాలి. అయితే స్త్రీలు శివ సహస్రనామం, లలితా సహస్రనామం, లలితా సప్తశతి వంటివి గీతవంటివి చదువుకోవచ్చు. లేదా నామస్మరణను చేసుకోవచ్చు. అంటే బీజాక్షరాలు మంత్రాక్షరాలు లేకుండా కేవలం నామసాధన చేయవచ్చు. లేదా పురాణ గ్రంథాలు చదువుకోవచ్చు. గర్భిణీలు, రజస్వలలు ఏమీ చేయకుండా క్రీయాశూన్యంగా పడుకోవాలి.

గ్రహణం సమయంలో ఇంట్లో దీపం వెలిగించాలా?అక్కర్లేదా?
గ్రహణ సమయానికి ముందు, తరువాత జ్యోతి ప్రజ్వలనాలు చేయవచ్చు. కార్తీక మాసం వస్తోంది కనుక స్పర్శా కాలానికి పూర్వమే దీపప్రజ్వలన చేయాలి. మోక్షం తరువాత మరలా జ్యోతి ప్రజ్వలనం చేయవచ్చు.

రాత్రి లేదా పగలు భోజనం కాక పళ్లు ఫలహారం పనికొస్తుందా?
చంద్రగ్రహణం గ్రస్తోదయం అవుతుంది. అంటే గ్రహణం ఉండగానే సూర్యాస్తమయం అవుతుంది కనుక మరునాడు సూర్యుడిని చూసేంత వరకూ అశౌచం ఉంటుంది. అంటే మరునాడు సూర్యోదయం తరువాతనే మడినీళ్ళు పట్టుకొని వండుకొని తినాలి. అప్పటి వరకూ ఏమీ తిన కూడదూ త్రాగరాదు. అలాగే చంద్రగ్రహణం గ్రస్తోదయం అవుతుంది. అంటే చంద్రోదయానికి పూర్వమే గ్రహణం ప్రారభమవుతుంది. అంటే చంద్రోదయానికి చంద్రుడు గ్రహణంలో ఉంటాడు. కనుక ఆరోజు పగలు భోజనాదులు చేయరాదు. సాయంత్రం చంద్రగ్రహణ మోక్షం తరువాతనే మడినీళ్ళు పట్టుకొని అశౌచ శుద్ధి చేసుకొని వండుకొని తినాలి.

అయితే ఈ నియమాలు అందరికీ వర్తించవు. ముఖ్యంగా పిల్లలకు బాలబాలికలకూ, గర్భవతులకు, దీర్ఘకాలప్రాణాంతక వ్యాథులు ఉన్నవారికి, బిపిలు షుగర్లు వంటి ఉన్నవారికి, వృద్ధులకూ, బాలింతలకు మినహాయింపులు ఉన్నాయి. వీరు పాటించాల్సిన అవసరం లేదు. అయితే గర్భవతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పాలుతాగే పిల్లలలకు మినహాయింపు ఉంది. తల్లిపాలకు దోషం లేదు. ఇక ఆకలికి ఆగలేని వారు దుంపలు, సగ్గుబియ్యంతో చేసినవి, అటుకులతో చేసిన పదార్థాలు పళ్ళు పాలు వంటివి తీసుకొని తీరాలి. గృహస్థులకు శుష్కోపవాసాలు చెప్పలేదు. కనుక ఫలహారాలు సేవించవచ్చు. సేవించాలి.

దానాలు గ్రహణం సమయంలోనా లేక విడిచిన తరువాతా?గ్రహణం సమయంలో అయితే బ్రాహ్మణులు దొరకరు కదా?
ఈ ప్రశ్నకు సమాధానం శాస్త్రంలో ఉన్నదాని కన్నా ఆచరణలో ఉన్నదానికే ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రహణ సమయంలో ప్రతీ బ్రాహ్మణుడూ గాయత్రినో లేదో ఏదో ఒకసావిత్రినో ఆశ్రయించి జపం చేసుకుంటూ ఉంటారు. కనుక వారు దొరకరు. అయితే నదీనదాలు పుణ్యక్షేత్రాదుల్లో కొందరు బ్రాహ్మణులు గ్రహణకాల సేవల్లో ఉంటారు. కనుక వారి సలహాప్రకారం చేసుకోవాలి.

ఇష్టదైవం ప్రీత్యర్థంఅనా చంద్ర ప్రీత్యర్థం అని జపసంకల్పం చేయాలి?
రాహుగ్రస్త చంద్రగ్రహణ దినే గ్రస్తోదయ గ్రహణ కాలే అని సంకల్పాలు చెప్పుకొనాలి. కొంత మంది సూర్యోపారగ, సోమోపారగ అని కూడా చెబుతారు. హిరణ్యశ్రాద్ధాదులు నిర్వహిస్తారు. 2022 లో ఈ ఏడాది ఇదే చివరి గ్రహణం, నాలుగు రాశులకు లాభాన్నిస్తుంది. ఇందులో భాగంగా మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభరాశికి ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో మేషం, వృషభం, కన్య, మకర రాశులకు నష్టాలు తప్పవు. మిగిలిన మీనం,ధనస్సు,తులా,సింహ ఈ నాలుగు రాశుల వారు గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు పొందుతారు.ఈ గ్రహణం రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం

చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
2022 సంవత్సరం చివరి చంద్రగ్రహణం భారతదేశంతో సహా దక్షిణ/తూర్పు యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది.

చంద్రగ్రహణం సమయం :
చంద్రగ్రహణం 2022 తేదీ: 08 నవంబర్ (మంగళవారం)
చంద్రగ్రహణం ప్రారంభ సమయం: మధ్యాహ్నం 2:38 గంటలకు
చంద్రగ్రహణం ముగిసే సమయం: సాయంత్రం 06.18 గంటలకు
సూతక కాలం ప్రారంభ సమయం: ఉదయం 09:21(ఈ లోగా పూజలు…. భోజనాలు పూర్తి చేసుకోవాలి)
సూతక కాలం ముగిసే సమయం: సాయంత్రం 06.18
గ్రహణమొక్ష కాలం తరువాత మహాప్రోక్షణ (శుద్ధి) చేసి ఆలయాలు తెరవవచ్చును.
నవంబర్ 7వ తేదీ న సాయంత్రం 4-15 ని” ల నుండి పౌర్ణమి ప్రారంభం అవుతున్నది. కావున 7 వ తేదీ న “కార్తీక పౌర్ణమి”, చంద్రపూజ, కేదారేశ్వర వ్రతములు చేసుకొనవచ్చును. Bcv
ఈ గ్రహణం భరణి నక్షత్రం, మేషరాశి నందు సంభవించుచున్నది.
కావున పైన చెప్పిన అశుభ ఫలిత రాశులవారు (మేష, వృషభ,కన్య,మకర రాశులవారు)
కేజిపావు (5 పావులు) మినుములు
కేజిపావు (5పావులు) బియ్యం, ఒక
వెండి చంద్ర బింబం,
నీలివస్త్రం,
తెల్లవస్త్రం,
మంచి ముత్యం,
1/2 లీటరు పెరుగు
శుద్ధ మొక్షాంతరమున స్నానం చేసి బింబ దర్శనం చేసుకుని దానం చేయవలెను.(లేదా తదుపరి రోజున)

– బ్రాహ్మణ చైతన్య వేదిక

LEAVE A RESPONSE