విజయవాడ : వివిధ రంగాల్లో సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న, పద్మ అవార్డుల తరహాలో రాష్ట్రంలోనూ అత్యున్నత పౌర పురస్కారాలు ఇస్తున్నామని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రంలోనూ అవార్డులు ఇస్తే బాగుంటుందని పలు సూచనలు అందాయని చెప్పారు. అన్నదాతలు, విద్యార్థులు, ప్రతి పేదవాడి కోసం దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి పనిచేశారని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైఎస్సార్ సాఫల్య, వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారాలను ప్రకటించినట్లు సీఎం వెల్లడించారు.
విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి జగన్ పాల్గొన్నారు. మొత్తం 29 మందికి వైఎస్సార్ జీవన సాఫల్య, 30 మందికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా జగన్ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయానికి ఇస్తున్న గౌవరం ఇది అని చెప్పారు.
వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారానికి రూ.10లక్షల నగదు, కాంస్య ప్రతిమ, వైఎస్సార్ సాఫల్య పురస్కారానికి రూ.5లక్షల నగదు, కాంస్య ప్రతిమ అందజేస్తున్నామన్నారు. అవార్డుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ నేపథ్యం చూడలేదని.. కేవలం మానవత, సేవ, ప్రతిభను గుర్తించి ఎంపిక చేశామని చెప్పారు. వీధి నాటకం, తోలుబొమ్మలు, కూచిపూడి నృత్యం, జానపదం, సేవలు, అన్నదాతలు..ఇలా వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి పురస్కారాలు ఇస్తున్నామని జగన్ తెలిపారు. ఇకపై ఏటా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తామని సీఎం చెప్పారు.