“తొట్టాల్ పూ మలరుమ్…”
1964లో వచ్చిన పడగోట్టి సినిమాలో ఎమ్.ఎస్. విశ్వనాద(థ)న్ – (రామమూర్తి) చేసిన పాట “తొట్టాల్ పూ మలరుమ్…”
1964 కాలానికి దక్షిణభారతదేశంలో ఇటువంటి, ఈ స్థాయి సంగీతజ్ఞతతో ఒక పాట రావడం చాల గొప్ప విషయం.
Creative excellence with great aesthetic senseతో విశ్వనాదన్ ఈ పాట చేశారు. ప్రధానంగా శుద్ధధన్యాసి లేదా ఉదయరవిచంద్రిక రాగంలో ఉంటుంది ఈ పాట. ఈ పాటలో చైనీస్ సంగీతాన్ని చాల గొప్పగా ప్రయోగించారు విశ్వనాదన్.
సినిమా పాట పరంగా విశ్వనాదన్ ఎంతటి advanced visionతో పనిచేశారో ఈ పాట తెలియజేస్తుంది. ఇలాంటి పాటలు చేసినందుకే ఇళైయరాజా (ఇళయరాజా కాదు)కు విశ్వనాదన్ అంటే విశేషమైన గౌరవం.
పాట నాయికా నాయకులు పాడుకునే సాధారణమైన వలపు గీతమే. కానీ పాటను అసాధారణమైన ఉన్నత స్థాయి పాటగా చేశారు విశ్వనాదన్.
ఆరంభం, గమనం, గతి, rhythm, interludes నిర్మాణం అత్యంత విశేషంగా అమరి పాట విశిష్టమైన పాట అయింది. ఆ కాలానికి చెందని, అందని tone and textureతో పాట అలరారుతూంటుంది.
విలంబం… పాటను, ఒక సంగీత ఖండికను విలంబం అనేది ఏ మేరకు గొప్పగా నిలుపుతుందో ఈ పాట ఒక తార్కణం. విలంబాన్ని చాల గొప్పగా పొదివి పాటను ఎంతో పొలుపుగా రూపొందించారు విశ్వనాదన్.
2002లో వచ్చిన తెలుగు హాయ్ సినిమాలో సాలూరి వాసూరావు ఈ పాటను కాస్తంత మార్చి వాడారు. ఆ తెలుగు పాట “అంతా ఇంతేలే…”
ఈ “తొట్టాల్ పూ మలరుమ్…” పాట సాహిత్యాన్ని ఎ.ఆర్. రహ్మాన్ మరోలా స్వరపరిచారు.
కవి వాలి రాసిన సాహిత్యానికి విశ్వనాదన్ సంగీతం చేశారు. రాసిన సాహిత్యానికి కూడా విశేషంగా, ఉదాత్తంగా, గొప్ప సంగీత సృజనాత్మకతతో పాట
చెయ్యచ్చు అన్న విషయాన్ని ఈ పాటతో నిరూపించారు విశ్వనాదన్.
టీ.ఎమ్. సౌందరరాజన్, పీ. సుశీల పాడారు. సుశీలతో ఎంతటి, ఎలాంటి గొప్ప పాటనైనా సాధించవచ్చు. టీ.ఎమ్. సౌందరరాజన్ గాత్రం, గానం పెళుసు. ఆయన గాత్రం, గానంతో ఇతర గాయకులతో సాధించగలిగే ఉదాత్తత, సౌందర్యం సాధించడం ఏ సంగీత దర్శకుడికైనా పరీక్షే. టీ.ఎమ్. సౌందరరాజన్తోనూ విశ్వనాదన్ గొప్ప పాటల్ని చెయ్యగలిగారు. ఈ పాట కూడా అందుకు ఒక మేలైన ఉదాహరణ.
“తొట్టాల్ పూ మలరుమ్…” ఆ కాలానికి మించిన పాటగా రూపొంది ఏ కాలంలోనైనా ఒక ఉన్నతమైన, విశేషమైన, ప్రత్యేకమైన పాటగా విలసిల్లుతూ ఉంటుంది.
వినండి
– రోచిష్మాన్
9444012279