సారీ మదనపల్లి ఫైల్స్ గురించి కాదు.
ఆ మట్టికి నిజంగా హంద్రీనీవా నీరు వస్తున్నా.. చూస్తే కాని మనసుకు నమ్మకం రాదు అని జనం వెల్లువలా వచ్చారు.
ఇందులో జనాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేదు!
రాయలసీమకు జీవధార హంద్రీనీవా సుజల స్రవంతి. ఈ ప్రాజెక్టు రాయలసీమ రైతుల ఆశలకు అక్షరరూపం. కానీ, గత ఐదేళ్లూ ఈ ప్రాజెక్టును రాజకీయాలకు వేదికగా మార్చి, కేవలం సినిమాటిక్ నాటకాలకే పరిమితం చేశారన్నది సీమ ప్రజల వేదన. ఇచ్చిన తేదీలు, చెప్పిన మాటలు, చేసిన హడావుడి వెనుక ఉన్న వాస్తవాన్ని ఒక్కసారి గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు.
26-02-2025: జగన్ మాటల్లో ‘సువర్ణాక్షరాలు’
“672 కి.మీ. దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణమ్మ కుప్పంలో ప్రవేశించడం కచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు!” అని కుప్పంలో నాటి సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పులకిస్తూ చెప్పాడు.
నీటి పంపింగ్, మోటార్లు, కాలువలో నీరు, అంతా సెట్టింగ్. రాష్ట్ర ప్రజలను ఎఱ్రివాళ్ల క్రింద జమకట్టి, సినిమా సెట్టింగులకు మించి జగన్ చేసిన డ్రామా గురించి తెలిసి ప్రజలు చిన్నబోయారు.
రాయలసీమ రైతులు తీవ్రంగా అవమానపడ్డారు. మరీ ఇంత ఘోరంగా.. తెలివి తక్కువ వారిగా ఏమార్చుతావా జగన్ అని భంగపడుతూ ఆక్రోశించారు. ఒక సీఎం ఇలా ఏమార్చాడా అని యావత్తు దేశం ఆశ్చర్యపోయింది. సోషల్‌మీడియా మొత్తం హోరెత్తిపోయింది.
కుప్పానికి నీరు రావాలంటే ఎగువున మదనపల్లి దాటాలి.
కాలువలు వెడల్పు చేయలేదు, లైనింగ్ వేయలేదు.
తీరిక ఎక్కడిది? అదే మదనపల్లి వద్ద వేలాది ఎకరాల జనం భూములు కాజేశారు. మదనపల్లి ఫైల్స్ తగలెట్టేశారు. మధ్యలో అనుమతులు లేకుండా నీటి ప్రాజెక్టుల పేరుతో పెద్దిరెడ్డి భూములతో పాటు నిధులు కూడా మింగేశాడు.
అందుకే మదనపల్లి జనం.. నీరు వస్తుంటే.. ఇది నిజమా.. కలా.. మోసమా అని చూసి, తమను తాము గిల్లుకొంటూ.. గుచ్చి గుచ్చీ ఇలా చూస్తున్నారు.
23-01-2025: ఐదేళ్ల తరువాత సీపీఎం నిద్రలేచిన వేళ
చంద్రబాబు అధికారంలోకి రాగానే సీపీఎం ధైర్యంగా నిద్రలేచి వస్తుంది. ఎందుకంటే తనేమీ చెయ్యలేదు కాబట్టి జగన్ రాలేడు. అందుకని బదులుగా సీపీఎం వస్తుంది.
“హంద్రీనీవా కాలువను పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేయాలన్న డిమాండ్‌లో సిపిఎం ఆధ్వర్యంలో రాయలసీమ వ్యాప్తంగా ధర్నాలు” అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్ గళమెత్తారు.
“2012 నుంచి నీళ్లు వస్తున్నా, ఒక్క ఎకరం ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ వెడల్పు చేయకుండా కేవలం లైనింగ్ పనులకు మాత్రమే నిధులు కేటాయించడంపైనా తీవ్ర అభ్యంతరం చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటిపోతాయని హెచ్చరించారు. అంటే అప్పటికి ఐదేళ్లు పైసా పని చెయ్యలేదు జగన్ అని మనం అర్థం చేసుకోవచ్చు.
25-04-2025: మదనపల్లెకు మొండిచెయ్యి!
అనుమతులు, పనుల కేటాయింపుల్లో పక్షపాత ధోరణితో మదనపల్లెకు మొండిచేయి చూపారని, రూ. 480.22 కోట్ల విలువైన పనులన్నీ కదిరి డివిజన్‌కు కేటాయించి మదనపల్లె కార్యాలయాన్ని నామమాత్రం చేశారంటూ అధికారులు, సిబ్బంది ఆవేదన చెందారు అంటూ ఒక వార్త వచ్చింది. అంటే కదిరి వద్ద కదలిక మొదలైంది అని అర్థం చేసుకోవచ్చు.
07-08-2025: నత్తతో పోటీ…
సీఎం చంద్రబాబు ఆదేశాల తరువాత ఆలస్యం అంటే జర్నలిస్టులు వూరుకోరు. జులై నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నా, పనులు మాత్రం నత్త నడకతో సాగాయని ఒక పత్రికలో వార్త వచ్చింది.
15-08-2025: 6 నెలల్లోనే కొలిక్కి!
ఎక్కడో శ్రీశైలం, మరెక్కడో కుప్పం! ఈ దూరాన్ని, కొండలను దాటి నీళ్లు తీసుకురావడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని హంద్రీనీవా విస్తరణ, లైనింగ్ పనులను ఎన్డీఏ ప్రభుత్వం కేవలం 6 నెలల్లోనే పూర్తి చేసిందని ఈనాడు పత్రిక ఘనంగా రాసింది.
పనులు యుద్ధ ప్రాతిపదికన జరగడంతో రాయలసీమకు నిజమైన జలకళ వచ్చింది.
హంద్రీనీవా విస్తరణ పనుల పట్ల జగన్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి చూపలేదు. రాయలసీమకు నీరివ్వాలన్న లక్ష్యం కంటే, ఎన్నికల ముందు కుప్పంలో నీటిని పారించి ఓట్లు రాబట్టుకోవాలని నాటకాలు వేశాడు. కాలువను వెడల్పు చేయకుండా, లైనింగ్ చేయకుండా, కేవలం మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి కొద్దిగా నీటిని వదిలి, కెమెరాల ముందు జలహారతి ఇచ్చి, డ్రోన్లతో చిత్రీకరించి “కుప్పంకు నీళ్లు వచ్చేశాయి” అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు. అది ఒక తాత్కాలిక ఒక్క రోజు ప్రవాహం, “ఫ్లో సెట్టింగ్” తో ప్రజలను మోసం చేసిన రోజు.
ఈ రోజు:
మదనపల్లెకు హంద్రీనీవా జలాలు చేరుకున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు జలహారతులు ఇచ్చి శ్రీశైల శివయ్య దగ్గర నుండి వచ్చిన గంగమ్మకు స్వాగతం పలికారు.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నిజమైన సందర్భం. గతంలో జరిగిన జాప్యాలు, నాటకాలు, మోసాలను పక్కనపెట్టి, వేగంగా పనులు పూర్తి చేయడం వల్లే ఈరోజు ఈ దృశ్యం సాధ్యమైంది. హంద్రీనీవా రాజకీయ క్రీడలకు అతీతంగా, నిజమైన అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది.
చంద్రుడు నిధులు కేటాయించి, నిరంతరం పర్యవేక్షించి సాకారం చేశాడు. ఎందుకంటే తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇవ్వని విజయాన్ని ఇచ్చి, జనం పెట్టుకొన్న నమ్మకాన్ని బాధ్యతగా భావించి, ప్రజలు పులకించేలా పుడమిని తడిపాడు సీమ పుత్రుడు నాయుడు.