– శృంగార వీడియోపై చర్యలకు వెనకడుగు
– ఇప్పటికే ఎంపీలందరి ఫోన్లలో ‘మాధవలీల’ సినిమా
– వీడియోను ఫోరెన్సికకు ఎవరు పంపిస్తారన్న సందిగ్ధం
– దానిపై వివరణ ఇవ్వని పోలీసు బాసులు
– మాధవ్ కు మద్దతుగా సొంత కులస్తుల ర్యాలీ
– చర్యలు తీసుకుంటే ఆ కులం వారంతా దూరమవుతారన్న భయం
– చర్యలు తీసుకోకపోతే మహిళలలో మరింత చులకన
– ఇప్పటికే సోషల్ మీడియాలో మహిళల శాపనార్ధాలు
– ప్రెస్ మీట్లలో మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీల ఇరకాటం
– మోహం చాటేసిన వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్లు
– ట్విట్టర్ లో మాధవ్ అంశాన్ని ప్రస్తావించని విజయసాయి
– వీడియో అంశంపై 11 మంది ఎంపీలు, ఢిల్లీ జర్నలిస్టులతో రఘురామకృష్ణంరాజు విందు రాజకీయం
– అడకత్తెరలో వైసీపీ బాసు జగన్
( మార్తి సుబ్రహ్మణ్యం)
అనంతపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ శృంగార వీడియో వ్యవహారం వైసీపీని నైతిక-రాజకీయ సంకటంలో పడేసింది. ఆ వీడియో లీకయి ఇన్ని రోజులవుతున్నా ఆయనపై ఎలాంటి చర్య తీసుకోకపోగా,పార్లమెంటులోని వైసీపీ ఆఫీసులో జరిగే కార్యక్రమాలకు ఎంపీ నిర్భయంగా హాజరవుతున్న ఫొటోలు, విమర్శల వేడి మరింత పెంచేందుకు కారణమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సదరు ఎంపీ తప్పు చేస్తే చర్యలుంటాయని ప్రకటించారు. అయితే దానిని ఎలా నిర్ధారిస్తారు? ఆ వీడియోను ఇప్పటివరకూ ప్రభుత్వ- పార్టీ పరంగా ఏమైనా ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారా? లేదా? ఎంపీ చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ ప్రాథమిక దర్యాప్తు చేసిందా? లేదా? సాధారణంగా అధికారపార్టీ ప్రముఖులపై ఎవరైనా పోస్టులు పెడితే, వాయువేగంతో స్పందించి, వారిపై చర్యలు తీసుకునే సీఐడీ.. నిజంగా ఎంపీ మాధవ్ వీడియోను మార్ఫింగ్ చేసినట్టయితే, మార్ఫింగ్ వీడియోను సృష్టించిన వారిని ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయలేదు? అంటే అది నిజమేనని నమ్ముతున్నారా ? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
వైసీపీ ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంపై చర్యల విషయంలో, వైసీపీ నాయకత్వం ఆచితూచి అడుగులేస్తున్న వైనంపై పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయపరమైన వివాదమయితే, దానిపై చర్యలకు సమయం తీసుకోవడంలో అర్థం ఉంటుంది కానీ, ఇలాంటి అనైతిక-పరువు తక్కువ వ్యవహారాలపై కూడా నిర్ణయాన్ని నాన్చడం వల్ల, పార్టీ ఇమేజీ రోజురోజుకూ దారుణమైన డామేజీ అవుతుందని, సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారం.. రోజూ ప్రెస్ మీట్లు పెట్టే మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలకు ఇరకాటంగా మారింది.
మీడియా ముందుకొచ్చిన వారికి మొదట మాధవ్ వ్యవహారాన్ని మీరు సమర్ధిస్తున్నారా ? వ్యతిరేకిస్తున్నారా? మాధవ్ పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారన్న ప్రశ్నలే ఎదురవుతుండటం ఇబ్బందికరంగా మారింది. దీనిపై నిర్ణయాధికారం పార్టీ అధినేత జగన్ చేతిలో తప్ప మరెవరికీ లేదు. మరి ఆ అంశంపై పార్టీ ఏం ఆలోచిస్తుందన్న విషయం, ఒక్క సీఎంకు తప్ప నరమానవుడికి తెలియదు. సజ్జల వంటి సన్నిహితులకు సైతం, నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే తెలుస్తుంది కాబట్టి, మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైసీపీ నేతలు నీళ్లు సమలాల్సి వస్తోంది. దానితో తరచూ మీడియా ముందుకొచ్చే నేతలు కూడా, మాధవ్ ఎపిసోడ్ తర్వాత ముఖం చాటేయాల్సిన దుస్థితి కనిపిస్తోంది.
ఇక టీడీపీపై విరుచుకుడే మంత్రి రోజా వంటి మహిళా మంత్రులు, మహిళా నేతలకు ఎంపీ మాధవ్ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. మాధవ్ అంశంపై ఇప్పటికే తెలుగు మహిళా నేతలు, ప్రతిరోజూ వైసీపీని దునుమాడుతున్నా, దానిపై ఎదురుదాడి చేయలేని నిస్సహాయత. వీడియోను సమర్ధించలేరు. అలాగని ఖండించలేరు. పోనీ ఫలానా తేదీలోగా దానిని తేల్చేస్తాం అని కూడా హామీ ఇవ్వలేరు. పార్టీలో ఉన్నందున, విపక్షాల మాదిరిగా ఎంపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయలేరు. అసలు వైసీపీ మహిళా నేతలు ఎంపీ వీడియో బయటకు వచ్చినప్పటి, నుంచి మీడియాలో కనిపించడం మానేశారు.
రోజా మాత్రం ‘సీఎం విచారణ జరిపిస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో కాల్ మనీ వ్యవహారంలో మహిళలను వేధించలేదా?” అన్న అరిగిపోయిన రికార్డునే వినిపించాల్సి వచ్చిందే తప్ప, ఆ వీడియో మాధవ్ ది కాదని గట్టిగా చెప్పలేకపోవడం బట్టి, ఎంపీ వీడియో వ్యవహారం పార్టీని ఏ స్థాయిలో కుదిపేస్తోందో స్పష్టమవుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో మహిళలు ఎంపీకి తిట్లు, శాపనార్ధాలు పెడుతున్నారు. ఇలాంటి వారిని పార్టీలో ఇంకా కొనసాగిస్తున్నందున, అటు జగన్ కూడా విమర్శలు ఎదుర్కోవడం అనివార్యమవుతోంది.
మాధవ్ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఆయనపై చర్యలు తీసుకోనున్నారంటూ పార్టీ ఇచ్చిన లీక్ ఫలితమివ్వకపోగా, బూమెరాంగయింది. తాజాగా మాధవ్ కు మద్దతుగా ఆయన కులసంఘం భారీ ర్యాలీ నిర్వహించడం, నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసినట్టయింది. మాధవ్ పై చర్యలు తీసుకుంటే, అనంతపురం జిల్లాలో బలమైన ఆ సామాజికవర్గం దూరమవుతుందన్న కొత్త బెంగ మొదలయింది. దీనితో ఏం చేయాలో పాలుపోని సంకట స్థితిలో పడిపోయింది.
పోనీ, ఈ సమస్యను సాంకేతిక కోణంలో ముగిద్దామనుకుంటే… సీఐడీ ఆ వీడియోను ఫోరెన్సిక్ పరీక్షకు ఇచ్చిందో లేదో తెలియదు. ఒకవేళ ఇస్తే సీఐడీ దానిని ప్రకటించి ఉండేది. నిజానికి ఈ అంశాన్ని తేల్చే అవకాశం నాయకత్వానిక లేకపోలేదు. ఇప్పుడు అనేక ఫోరెన్సిక్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. వీడియో మార్ఫింగ్ చేశారా? లేదా అన్న వాస్తవాన్ని అని వెంటనే తేల్చేస్తాయి. కానీ వైసీపీ నాయకత్వం ఆ అవకాశాన్ని వినియోగించుకుందా? లేదా? అన్నదీ తెలియదు. ఇలాంటి సంకట పరిస్థితి నుంచి, తమ పార్టీ ఎప్పుడు బయటపడుతుందో తెలియక పదార్టీ నేతలు తలలుపట్టుకుంటున్నారు.
మరోవైపు ఎంపీ మాధవ్ శృంగార వీడియో లోక్ సభ, రాజ్యసభ సభ్యులందరి ఫోన్లకు ఈ పాటికే చేరిపోయింది. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఏపీ ఎంపీలను, ఇతర రాష్ట్రాల ఎంపీలు ఇదే వీడియోపై వాకబు చేస్తున్న ఇబ్బందికర పరిస్థితి. ముఖ్యంగా సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈపాటికే తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఎంపీలకు వీడియో అంశాన్ని వివరించారు. కొద్దిరోజుల క్రితం రఘురామకృష్ణంరాజు తన నివాసంలో, వివిధ రాష్ట్రాలకు చెందిన 11 మందిచెందిన ఎంపీలు, జాతీయ మీడియాకు చెందిన ఎనిమిది మంది జర్నలిస్టులకు విందు ఇచ్చిన సందర్భంలో.. మాధవ్ అంశంలో తమ పార్టీ నాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న విషయాన్ని వివరించినట్లు తెలిసింది. ఆ సందర్భంగా జాతీయ మీడియాకు చెందిన జర్నలిస్టులు ఆ వీడియోను తీసుకుని, అనంతపురం జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నేతల ఫోన్ నెంబర్లు కూడా అడిగి తీసుకున్నట్లు సమాచారం. కాగా.. టీడీపీపై నిరంతరం సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు, తిట్ల దండకంతో అత్యంత చురుకుగా ఉండే ఎంపీ విజయసాయి.. తన పార్టీ ఎంపీ మాధవ్ వీడియోపై వస్తున్న విమర్శలతోపాటు, ఆయనపై ఏం చర్యలు తీసుకుంటారో మాత్రం చెప్పకుండా దాటవేసి, ఇతర అంశాలపై ట్వీట్ చేస్తుండటం ప్రస్తావనార్హం. దీన్నిబట్టి వైసీపీ నాయకత్వం, మాధవ్ వీడియో వ్యవహారంలో ఏ స్థాయిలో ఆత్మరక్షణలో ఉందో స్పష్టమవుతోంది.