Suryaa.co.in

Andhra Pradesh

మాధురికి మానసిక చికిత్స చేయించాలి

– ఆమెలో శృంగార పరమైన ఉన్మత్త లక్షణాలు
– తీవ్రమైన ఉద్వేగ లోపాన్ని సైకోసిస్ లక్షణంగా భావించాలి
– భార్యా పిల్లలు ఉన్న శ్రీనివాస్ తో సంబంధం పెట్టుకోవడాన్ని కాండక్టు డిజార్డర్ గా గుర్తించాలి
– శ్రీనివాస్ భార్య వాణి, కూతుళ్ళకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ అవసరం
– సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి సూచన

తిరుపతి, ఆగస్టు 12 : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో వివాహేతర బంధం వివాదంగా మారడంతో, ఆత్మ హత్యా ప్రయత్నం చేసిన దివ్వల మాధురికి మానసిక చికిత్స చేయించాలని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సలహా ఇచ్చారు. కేవలం కేసులు పెట్టి శిక్షలు వేసి, శారీరకంగా తగిలిన గాయాలకు చికిత్స చేస్తే సరిపోదన్నారు.

ప్రవర్తనను బట్టి ఆమె మానసిక రుగ్మతలతో బాద పడుతున్నట్టు భావించాలని చెప్పారు. తక్షణం విశాఖపట్నం మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించి పరీక్షలు చేయించి తగిన చికిత్స అందించాలన్నారు. ఆమెలో తీవ్రమైన డిప్రెషన్, సైకోసిస్ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఆమె మొదటి భర్తను వదిలేసి భార్యా పిల్లలు ఉన్న శ్రీనివాస్ తో సంబంధం పెట్టుకోవడాన్ని కాండక్టు డిజార్డర్ గా గుర్తించాలన్నారు.

అలాగే ఆమెలో శృంగార పరమైన ఉన్మత్త లక్షణాలు ఉన్నాయన్నారు. గతంలో కూడా ఒకసారి ఆత్మ హత్యా ప్రయత్నం చేసిందని తెలిపారు. ఈ సారి తానే స్వయంగా కారులో వెళ్లి ఆగివున్న లారీని ఢీ కొట్టి ఘోరమైన రీతిలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశారని చెప్పారు. ఇలాంటి తీవ్రమైన ఉద్వేగ లోపాన్ని సైకోసిస్ లక్షణంగా భావించాలన్నారు. శ్రీనివాస్ భార్య వాణి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలను తట్టుకోలేక ఆత్మ హత్యకు ప్రయత్నించాను అనడం నిందగా భావించాలన్నారు.

మాధురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసిందని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఆదివారం పలాస వద్ద జాతీయ రహదారిపై యాక్సిడెంట్‌ చేసినందుకు గానూ ఆమెపై కేసు నమోదు చేశారని అన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించినందుకు చట్ట ప్రకారం ఆమెపై కేసులు పెట్టారని చెప్పారు.

నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 125 కింద ఈ కేసు నమోదైందని తెలిపారు. అయితే ఇలాంటి వారికి మానసిక చికిత్స అవసరం అన్నారు. ఒక సారి సైకియాట్రిస్ట్ ద్వారా పరీక్షలు చేయిస్తే ఆమె మానసిక స్థితి తెలుసుందన్నారు. అవసరం అయితే చికిత్స చేయించాలని సూచించారు. కాగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఆయన భార్య వాణి, కూతుళ్ళకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ అవసరం అన్నారు. సామాజిక శ్రేయస్సు దృష్టితో తన అభిప్రాయం చెప్పానని ఆమె పట్ల తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE