– మధ్యంతర బెయిల్‌కు ‘సుప్రీం’ నో
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పందన తెలియజేయాలని కేంద్ర ఏజెన్సీలను కోర్టు కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరిపింది.
మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక కవిత తరుఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 5 నెలల నుంచి ఆమె జైల్లో ఉన్నారు. 463 మంది సాక్షులను విచారించామని ధర్మాసనం పేర్కొంది.
కాగా ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు బెయిల్ నిరాకరించాయి. దీంతో ఆమె ఆశలన్నీ సుప్రీంకోర్టు పైనే పెట్టుకున్నారు. ఇవాళ తనకు బెయిల్ వస్తుందని ఆమె భావించినట్టు సమాచారం. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు.
సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(క్రిమినల్) దాఖలు చేశారు. అక్కడ కూడా వాయిదా పడింది. ఇక బెయిల్ కోసం మరో వారం పాటు కవిత వేచిచూాడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడైనా బెయిల్ వస్తుందో రాదో వేచిచూడాల్సి ఉంది.
ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 50 మందిని నిందితులుగా పేర్కొన్నాయని, అందులో కవిత మాత్రమే మహిళ అని ఆమె తరఫు సీనియర్ న్యాయవాదులు గతంలో ఢిల్లీ హైకోర్టులో వాదించారు. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయని తెలిపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వాలన్నారు.