– కెసిఆర్ అరాచక పాలనను గద్దె దించడానికి సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర
– విక్రమార్క పీపుల్స్ మార్చ్ ను అభినందించిన రాహుల్ గాంధీ
-మధిర పాదయాత్ర సభలో పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
తెలంగాణ సెంటిమెంట్ పేరుతో అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం ప్రజా సంపదను బందిపోట్ల మాదిరిగా దోచుకుంటున్నారని, వీరిని రాజకీయంగా పాతర పెడితేనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుందని ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
8 ఏండ్ల టిఆర్ఎస్ అరాచక పాలనను గద్దె దించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మధిర నియోజకవర్గంలో రాజకీయ వాయుగుండంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ప్రగతి భవన్ లో మద్యం తాగి మత్తులో తూగుతున్న కెసిఆర్ పాలనను అంతమొందిస్తుందని అన్నారు.
సీఎం కేసీఆర్ దలిత బంధు పేరిట మరో సారి దళితులను దగా చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుబంధు పేరిట ఎకరానికి 5000 ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలను బందు చేసి కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. మిర్చి రైతులకు ఖమ్మం జిల్లాలో బేడీలు వేసిన దుర్మార్గుడిని ధ్వజ మెత్తారు. విద్యుత్ ఛార్జీలు పెంచి నడ్డి విరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఇచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాక్షస పాలన చేస్తున్న కెసిఆర్ పరిపాలన గద్దె దించాలని, ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత చేస్తున్న పాదయాత్రకు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారని చెప్పారు భట్టి పాదయాత్రకు యావత్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు.