Suryaa.co.in

Telangana

ఏం సాధించినవని ఫ్లెక్సీలు పెట్టుకున్నవ్ కేసీఆర్…

-దళిత బంధు, నిరుద్యోగ భ్రుతి, రుణమాఫీ, దళితులకు మూడెకరాలు
– ఎంతమందికి ఇచ్చావో వివరాలతో సహా ఫ్లెక్సీల్లో పెట్టే దమ్ముందా?
– నడిగడ్డ ఎడారిని తలపిస్తుంటే గుండె తరుక్కుపోతోంది
-ఇక్కడి ప్రజల బాధలను చూసి తెలంగాణ తల్లి రోదిస్తోంది
-ఫాంహౌజ్ కు నీళ్ల కోసం రూ.లక్ష కోట్లు పెట్టిన కేసీఆర్…
-రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టలేవా?
-బీజేపీ ఫ్లెక్సీలను తయారు చేసే, రవాణా చేసే వారిని వేధిస్తున్నారు
-టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అరిగోస పడుతున్నరు
-కేసీఆర్ పాలనను తరిమి తరిమి కొట్టడమే బీజేపీ లక్ష్యం

తెలంగాణలో ఏం సాధించారని కేసీఆర్ ఫ్రభుత్వం ఊరూరా ఫ్లెక్సీలు పెట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ కు దమ్ముంటే… ఎంతమందికి దళిత బంధు, ఉద్యోగాలు, నిరుద్యోగ భ్రుతి, దళితులకు మూడెకరాలు ఇచ్చారనే వివరాలతో గ్రామాల వారీగా ఫ్లెక్సీలు పెట్టాలని సవాల్ విసిరారు.

తన ఫాంహౌజ్ కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి 200 కి.మీల దూరంలోనున్న గోదావరి నుండి నీళ్లు తెప్పించుకున్న కేసీఆర్ నడిగడ్డకు సాగు నీరందించడం లేదని ప్రశ్నించారు. అటు జూరాల, ఇటు తుంగభద్ర మధ్య కూతవేటు దూరంలో ఉన్న నడిగడ్డ ప్రాంతానికి వెయ్యి నుండి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే నడిగడ్డ సస్యశ్యామలమయ్యేదని అన్నారు. ఎడారిని తలపిస్తున్న నడిగడ్డ ప్రాంతాన్ని చూస్తే నా గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎటు చూసినా బీళ్లుపడి నోళ్ల వెళ్లబెట్టిన భూములే కన్పిస్తున్నాయని… నడిగడ్డ భూమాతకు నిలువెల్ల గాయాలతో అల్లాడిపోతోందని వాపోయారు. బీజేపీ అధికారంలోకి వస్తే నడిగడ్డను సస్యశ్యామలం చేసి తీరుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో అత్యాచారాలు, అత్మహత్యలు, హత్యలు ఎక్కువయ్యాయన్నారు. కేసీఆర్ అండతో కొందరు టీఆర్ఎస్ నేతలు బలుపెక్కి బరితెగించి కండకావరంతో అమాయక మహిళలను చెరబడుతూ చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, అమాయక యువకులను వేధింపులకు గురిచేసి బలవన్మరణాలకు కారణమవుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని… కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర దాకా తరిమి తరిమి కొడితేనే తెలంగాణ ప్రజలు బాగుపడతారని అన్నారు. కేసీఆర్ పాలనను అంతం చేసేదాకా విశ్రమించేది లేదని, తుదిదాకా పోరాడతానని పునరుద్ఘాటించారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 6వ రోజు పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి సహా పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు ఎల్కూరు నుండి నేడిపల్లి స్టేజీ, చార్లగార్లపాడు స్టేజీ, ఎద్దులగూడెం మీదుగా మల్దకల్ మండల కేంద్రందాకా నడిచారు. ఈ సందర్భంగా మల్దకల్ మండల కేంద్రంలో భారీ ఎత్తున జనం తరలివచ్చి పాదయాత్రకు స్వాగతం పలికారు. అనంతరం వారినుద్దేశించి బండి సంజయ్, డీకే అరుణ ప్రసంగించారు. బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

ఇక్కడి లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయానికి కేసీఆర్ పైసా విదిల్చింది లేదు…కేసీఆర్ ఏ ఆలయానికి వెళ్లినా రూ. 100 కోట్లు, .. 500 కోట్లు ఇస్తమంటూ గప్పాలు కొడుతడు. పైసలిచ్చింది లేదు.. అభివృద్ధి లేదు. టీఆర్ఎస్ పాలనలో ఏ ఊరికెళ్లినా కాలేజీలు, ఆసుపత్రులు, కనీస సదుపాయాలు లేవు. కాని, కేసీఆర్ షాపులు (వైన్ షాపులు, బెల్ట్ షాపులు) మాత్రం పక్కాగా ఉన్నయ్.

కేసీఆర్ ఏం సాధించిండని ఊరూరా ఫ్లెక్సీలు పెట్టుకున్నడు? మల్దకల్ మండలంలో ఎంతమందికి దళితబంధు ఇచ్చిన్రో.. మూడు ఎకరాల భూమి ఎంతమందికి ఇచ్చిన్రో… ఎందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన్రో…. గొల్ల కురుమలను ఎందుకు వేధిస్తున్నరో… నిరుద్యోగులకు ఎంతమందికి భృతి ఎవ్వరికి ఇచ్చినవో…. గట్టు లిఫ్ట్ కింద 99వ ప్యాకేజీ పనులు ఎంతవరకు చేసినవో …. ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు చెప్పే దమ్ముందా కేసీఆర్..?

ఆర్డీఎస్ నీళ్లు రాక, నెట్టెంపాడు పనులను, గట్టు లిఫ్ట్ పనులను పూర్తిచేయకపోవడంతో ఎడారిని తలపిస్తున్న నడిగడ్డను చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. ఎటు చూసినా బీళ్లుపడి నోళ్ల వెళ్లబెట్టిన భూములే కన్పిస్తున్నాయి. నడిగడ్డ భూతల్లి నిలువెల్ల గాయాలతో అల్లాడిపోతోంది. ఫాంహౌజ్ కు నీళ్ల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి 200 కి.మీల దూరంలోనున్న గోదావరి నీళ్లు పారించుకున్న కేసీఆర్… నడిగడ్డ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 2వేల కోట్లు ఖర్చు చేసేందుకు మనసు రావడం లేదు.

రైతుబంధు పేరుతో మభ్యపెట్టి రైతులకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలన్నీ బంద్ పెట్టి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నడు. మిర్చి రైతులు తెగుళ్లతో నష్టపోతే ఆదుకోలేదు. మొన్న వరి వేస్తే ఉరేనని భయపెట్టి ఆయన ఫాంహౌస్ లో మాత్రం వరి వేసుకున్నడు. మరి ఆయన ఫాంహౌస్ లో వరి ధాన్యాన్ని ఎవ్వరికి అమ్ముకుంటున్నడో స్పష్టం చెప్పాలి.

కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అరిగోసపడుతున్నరు. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణన9 అప్పజెప్పడానికే రాష్ట్రాన్ని సాధించుకున్నది..? ప్రజలు ఆలోచించుకోవాలి. అబద్దాలతో నెట్టుకొస్తున్న కేసీఆర్ ను నేను సవాల్ చేస్తున్నా… ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చానని నిరూపిస్తే ఇక్కడి లక్ష్మీవేంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన తోమాల సేవ చేస్తా. లేకుంటే బడితె పూజ చేస్తా…

పేద ప్రజలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల మేరకు ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్రం తీసుకొస్తే… తెలంగాణలో అమలు చేయకుండా తూట్లు పొడుస్తున్నడు కేసీఆర్. పేదలకు కేంద్రం 1.4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే బీజేపీకి పేరొస్తుందని ఒక్క ఇల్లు కూడా కట్టివ్వని దుర్మార్గుడు కేసీఆర్.
అంబేద్కర్ అందించిన రాజ్యాంగం పట్ల కూడా దిగజారుడు మాటలు మాట్లాడిండు కేసీఆర్. రామాయణాన్ని రాసిన వాల్మీకి వారసులకు కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్రు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని కేసీఆర్ హామీ ఇచ్చి మోసం చేసిండు. తెలంగాణ ప్రజలకు మోసం చేస్తూ కేసీఆర్ జల్సాలు చేస్తున్నడు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ దాష్టీకాలే.. అత్యాచారాలు, హత్యలే…ఖమ్మంలో బిజెపి కార్యకర్త సాయి గణేష్ పై 15 అక్రమ కేసులు బనాయించి చావుకు కారణమైండ్రు. స్థానిక మంత్రి ప్రోద్భలంతో పోలీసులు వేధించడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నడు. ఎక్కడ టీఆర్ఎస్ నాయకుల అక్రమాలు, తప్పు బయటపడుతుందోనని సాయి గణేష్ ఆత్మహత్య ఘటనపై మరణ వాంగ్మూలం నమోదు చేయకుండా కుట్ర చేసిన్రు. కూకట్ పల్లిలో మహిళను టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడు లైంగికంగా వేధించిండు… వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది బాధిత మహిళ.

టీఆర్ఎస్ పాలనలో అక్రమాలు, అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయ్… అధికార మదం, కండకావరంతో టీఆర్ఎస్ నాయకులు అరాచకాలకు తెగబడుతున్నరు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే…. పాలమూరులో మౌలిక సదుపాయాలు, బడుగు బలహీన వర్గాలకు, రైతులకు న్యాయం జరగాలంటే,… కేంద్రమిచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు లబ్ధిదారులకు అందాలంటే కేసీఆర్ సర్కారును బొంపెట్టి… నరేంద్ర మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిందే.

LEAVE A RESPONSE