– మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం మాదాపూర్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ నివాసానికి మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి వెళ్ళి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం గోపీనాథ్ సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని, దైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, 1992 నుండి మాగంటి గోపీనాథ్, తాను ఒక సోదరుడిగా, మంచి మిత్రులుగా కలిసి రాజకీయాలలో ఉన్నామని గుర్తు చేసుకున్నారు. గత నెల 26 వ తేదీన తాను కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళామని, వెళ్ళే ముందు కూడా తాము కలుసుకున్నామని వివరించారు. ఇంతలోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు.
గోపీనాథ్ మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. భౌతికంగా గోపీనాథ్ దూరమైనప్పటికీ మూడు పర్యాయాలు ఎమ్మెల్యే గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులు కూడా ధైర్యం గా ఉండాలని కోరారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట మలక్ పేట నియోజకవర్గ ఇంచార్జి ఆజాం, అమీర్ పేట డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు నామన సంతోష్ కుమార్, అశోక్ యాదవ్, శ్రీహరి, ఆరిఫ్, హరిసింగ్, నారాయణ రాజు తదితరులు ఉన్నారు.