– ఎన్నికల ముందు ఒంగోలులో అంగరంగ వైభవంగా మహానాడు సభ
– అక్కడి నుంచే కూటమి విజయసింహనాదం
– వేదిక 17 ఎకరాలు, పార్కింగ్, భోజనశాలకు కలిపి 60 ఎకరాలు ఇచ్చిన రైతులు
– వైసీపీ సర్కారు బెదిరింపులతో తొలుత స్ధలం ఇవ్వడానికి భయపడ్డ మండవవారి పాలెం
– దానితో రంగంలోకి దిగిన కమ్మ సంఘం నేత బాపయ్యచౌదరి
– గ్రామరైతులతో డజన్లసార్లు భేటీ అయిన బాపయ్య చౌదరి
– చివరకు మెత్తబడి 60 ఎకరాలు ఇచ్చిన మండవవారి పాలెం రైతులు
– స్ధలం ఇచ్చినందుకు రైతులను వేధించిన నాటి జగన్ సర్కారు
– అయినా ధైర్యంగా ఎదుర్కొందామని రైతులకు బాపయ్య బాసట
– మహానాడుకు భూమి ఇప్పించిన రైతులకు బాబు, జనార్దన్ సన్మానాలు
– బాపయ్యను సన్మానం చేసిన బాబు
– గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కమ్మసంఘాలతో సమన్వయం చేసి ఎన్నికల ప్రచారం
– అధికారం వచ్చాక బాపయ్యకు కమ్మ కార్పొరేషన్ డైరక్టర్ ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సిఫార్సు
– బాపయ్యకు కమ్మ కార్పొరేషన్ ఇవ్వాలని కమ్మ సంఘం సిఫార్సు లేఖ
– తీరా కమ్మవారి సంఖ్య లేని మార్కాపురం నేతకు ఇచ్చిన వైచిత్రి
– కస్సుమంటున్న కమ్మ సంఘాలు
– పనిచేసిన వారికి పట్టం కట్టడం ఇలాగేనా అంటూ విసర్లు
– కష్టకాలంలో పనిచేసిన వారిని గుర్తించే కృతజ్ఞత ఇదేనా అంటూ ఆగ్రహం
– ఎమ్మెల్యే దామచర్లతోనే తేల్చుకుంటామన్న కమ్మ సంఘాలు
తమ్ముళ్లకు ‘కమ్మ’టి చేదు అనుభవం
– కమ్మ కార్పొరేషన్ కిరికిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన పేరు పావులూరి బాపయ్య చౌదరి.
వయసు 60.
వృత్తి.. వ్యవసాయం-వ్యాపారం
హోదా..టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ వాణిజ్య విభాగం ఉపాథ్యక్షుడు
ఉమ్మడి ప్రకాశం కమ్మ వైభవం అధ్యక్షుడు
ఉమ్మడి ప్రకాశం కమ్మవారి సేవా సంఘం ఉపాధ్యక్షుడు
ఇప్పుడు ఈయన గుణగణాలు, అర్హతలు.. ఇవన్నీ ఎందుకనుకుంటున్నారు కదా?
* * *
మామూలుగా అయితే సదరు బాపయ్య చౌదరి గురించి ఎవరూ పట్టించుకోవలసిన పనిలేదు. ఆయన అంత పాపులర్ ఫిగర్ కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఎన్నికల ముందు టీడీపీ ఒంగోలులో గర్జించిన ‘మహానాడు’ సదస్సుకు సదరు చౌదరి నడుంబిగించి పూనుకోకపోయినా, అక్కడ ‘మహానాడు’ జరిగి ఉంటే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ జరిగింది వేరు. అందుకే ఈ ‘కమ్మ’టి అనుభవం!
ఎన్నికల ముందు మండుటెండల్లో టీడీపీ ఒంగోలు రూరల్‌లోని మండవవారి పాలెంలో నిర్వహించిన ‘మహానాడు’ సూపర్‌డూపర్ హిట్టయింది. ఆ వేదిక నుంచే చాలామంది వైసీపీ సీనియర్లు ‘తెలుగు’ తీర్ధం తీసుకున్నారు. ‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం’ అని సగర్వంగా సంకేతాల్చిన ఆ సభ ముగిసిన తర్వాత కూడా, దాదాపు 10 గంటలపాటు రోడ్లు కిటకిటలాడాయంటే.. ‘మహానాడు’కు వచ్చేందుకు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కార్లు కిలోమీటర్ల దూరంలో పార్కు చేసుకుని, కాలినడకన ప్రాంగణానికి చేరుకున్నారంటే.. ఒంగోలు సభ స్పందన, ఏ స్థాయిలో జనక్షేత్రంలోకి వెళ్లిందో సులభంగా అర్ధం చేసుకోవచ్చు.
ఇదంతా ‘కనిపించే నాలుగో సింహం’ లెక్క అందరికీ పైకి కనిపించేవే.
* * *
కానీ ‘కనిపించని నాలుగో సింహం’ కథ ఒకటుంది. జగన్ సర్కారు గుండెల్లో డేంజర్‌బెల్స్ మోగించిన ఆ ‘మహానాడు’ ఉత్తిగానే సక్సెస్ కాలేదు. అసలు ఆ సభకు అక్కడ కొన్నిరోజుల ముందు గజం స్థలం కూడా దొరికే దిక్కు లేదు. అధికారంలో ఉన్నప్పుడయితే మేమున్నామని ముందుకొచ్చే మోతబరులు చాలామంది ఉంటారు. పార్టీకి భారీ విరాళాలిచ్చే వారి సంఖ్యకూ లెక్కుండదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కలుగు నుంచి, ఖద్దరు బట్టలేసుకుని బయటకొచ్చే వారి సంఖ్యకు అంతుండదు. ఇతర పార్టీల నుంచి వచ్చే జంపుజిలానీలు- అలాంటివారికే పదవులివ్వడం.. ఇవన్నీ ద శాబ్దాల నుంచి ‘దేశం’ను దగ్గరనుంచి చూస్తున్న అనుభవజ్ఞులకు పాత వే.
* * *
ఒంగోలులో ‘మహానాడు’ సభ పెట్టాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. ఆ బాధ్యతను మాజీ మంత్రి దామచర్ల జనార్దన్, సీనియర్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి అండ్ అదర్స్‌కు అప్పగించింది. చివరాఖరకు ఒంగోలు రూరల్ లోని మండవవారిపాలెం గ్రామం అన్నింటికీ సరైన వే దిక అని తేల్చారు. అక్కడయితే విశాలమైన స్థలంతోపాటు, ఎన్ని వందల కార్లు వచ్చినా పార్కింగ్, మహానాడుకు తరలివచ్చే వేలాదిమంది పార్టీ సైనికులకు భోజన సదుపాయాలు కల్పించవచ్చన్న నిర్ణయానికి వచ్చారు.
అదే విషయం మీడియాలో వచ్చింది. అంతే.. మండవవారిపాలెంలో టీడీపీ ‘మహానాడు’కు స్ధలం ఇవ్వకుండా నాటి జగన్ సర్కారు మోకాలడ్డింది. రకరకాల అడ్డంకులు సృష్టించింది. రైతులను స్థలం ఇవ్వవద్దని అనేక రూపాల్లో బెదిరించింది. వీఆర్వోల నుంచి డీఎస్పీల వరకూ అందరినీ వాడేసింది.
* * *
అయినా ఆ గ్రామ రైతులు బెదరలేదు. స్థలం ఇచ్చారు. అంతా ఇంతా కాదు. ఏకంగా 60 ఎకరాలు ఇచ్చేంతగా! మరి అది ఉత్తిగనే ఆషామాషీగా జరగలేదు. ‘మావల్లే అధికారంలోకి వచ్చింది. ఎవరూ ఏమీ చే యలేద’నుకునే వారితో సాధ్యం కానిది.. ఓ కమ్మ సంఘ నాయకుడు నడుంబిగించడంతో, అసాధ్యమనుకున్నది సుసాధ్యమయింది. ఆయనే ఈ పావులూరి బాపయ్య చౌదరి.
అదెలాగంటారా?… మీ ఊళ్లో ‘మహానాడు’కు స్ధలం ఇవ్వవద్దని నాటి రెవిన్యూ, పోలీసు అధికారులు.. రైతులను అనేక రకాలుగా బెదిరించారు. దానితో సర్కారుతో పెట్టుకోవడం ఎందుకులేనన్న భయంతో గ్రామ రైతులు కూడా భయపడ్డారు. జగన్ సర్కారును ఎదిరిస్తే ఏమవుతుందో.. నాటి డీజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అనుభవం వారు చూసిందే. దానితో మా పొలాలు ఇవ్వడం కష్టం. ఏమీ అనుకోవద్దు. మమ్మల్ని క్షమించమని బాబు గారికి చెప్పండి. మా పరిస్థితి ఇదీ.. అని టీడీపీ నేతలకు చెప్పేశారు. మరి ఎలా? ప్రత్యామ్నాయం ఎక్కడ?.. ఇదీ తమ్ముళ్ల తర్వాత ప్రశ్నలు!
* * *
ఈ సంగతి తెలిసిన అదే గ్రామానికి చెందిన ఉమ్మడి ప్రకాశం కమ్మ సంఘ వైభవం, కమ్మవారి సేవా సంఘం నేత పావులూరి బాపయ్య చౌదరి గ్రామంలోని రైతులతో కొన్నిరోజుల పాటు వరసగా సమావేశాలు నిర్వహించారు. ‘ఇది మన పార్టీ-కులానికి ప్రస్టేజ్ యవ్వారం. అవతల మన ఊరు పరువు పోద్ది’ అని వారికి నచ్చచెప్పారు. జగన్ ప్రభుత్వం మళ్లీ రాదు కాబట్టి భయపడవద్దని, ఏమైనా అయితే తాను మీదేసుకుంటానని చెప్పడంతో మెత్తబడిన రైతులు ‘మహానాడు’కు భూమి ఇచ్చేందుకు అంగీకరించారు.
దానితో హమ్మయ్య.. గండం గడిచి పిండం బయటపడిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తెలియడంతో, ఆయన కూడా సంతోషించారు. తర్వాత మహానాడు ప్రాంగణంలో భూమి పూజ. ఆ తర్వాత అంగరంగ వైభవంగా మహానాడు. ఇవన్నీ తెలిసిన ముచ్చట్లే.
* * *
జగన్ భయంతో ‘మహానాడు’కు భూములు ఇవ్వమని చెప్పిన రైతులను.. భూమి ఇప్పించేందుకు ఒప్పించిన కమ్మ సంఘ నేత బాపయ్య చౌదరి.. కమిటీ బాధ్యుడిగా ఆ 15 రోజుల ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. సొంత ఖర్చుతో మహానాడుకు వచ్చిన వారికి మినరల్ వాటర్ బాటిళ్లు, ఎనర్జీ డ్రింక్స్ సరఫరా చేశారు. రోజుకు 200 మంది చొప్పున, చివరి వారం రోజుల్లో 400 మంది కార్మికులకు ఆయనే అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన ఇప్పటి మంత్రులు వాటిని చూసి మెచ్చుకున్నారు.
సరే.. సభ సక్సెస్ అయింది. వారం తర్వాత ‘మహానాడు’కు భూములు ఇచ్చిన రైతులకు.. మాజీ మంత్రి దామచర్ల జనార్దన్ సన్మానం చేసి భోజనం పెట్టి, కృతజ్ఞతలు తెలిపారు. 15 రోజుల తర్వాత పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ‘మహానాడు’కు భూములిచ్చిన రైతులతోపాటు, మండవవారిపాలెం గ్రామానికి సంబంధించిన ముఖ్యులను మంగళగిరి పార్టీ ఆఫీసుకు పిలిపించి, వారందరికీ సన్మానం చేసి, భోజనం పెట్టారు. ఇప్పటి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఇప్పటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాటి పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ సమక్షంలో వారికి అభినందన సభ నిర్వహించారు.
* * *
సీన్ కట్ చేస్తే…
తిరుగులేని మెజారిటీతో పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఉమ్మడి ప్రకాశం నుంచి డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ మంత్రులయ్యారు. మరో ఇద్దరికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులొచ్చాయి. అంతవరకూ బాగానే ఉంది.
అదే సమయంలో, పార్టీకి దశాబ్దాలుగా సేవలందించటంతోపాటు.. ‘మహానాడు’కు భూములిప్పించేందుకు కృషి చేసిన బాపయ్య చౌదరికి, కమ్మ కార్పొరేషన్ డైరక్టర్ పోస్టు ఇవ్వాలని కమ్మసంఘం, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు సిఫార్సు లేఖ ఇచ్చింది. దానితో ఆయన కూడా, బాపయ్య చౌదరికి కమ్మ కార్పొరే షన్ డైరక్టర్ ఇవ్వాలని లేఖ రాశారు. దానిని కార్యక్రమాల కమిటీకి ఇచ్చారు.
* * *
నిజానికి ఆయన అడిగింది.. కమ్మ సంఘం సిఫార్సు చేసిందీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కోసం కాదు. కేవలం డైరక్టర్ కోసమే. ఎంకుకంటే చైర్మన్ పదవిని అప్పటికే.. ‘‘బాపయ్య చౌదరి కంటే పెద్ద వయసు, సుదీర్ఘ అనుభవం, కమ్మ కులంలోని ప్రముఖులందరితో విస్తృత సంబంధాలు, ఏదైనా సమస్య వస్తే యావత్ కమ్మజాతిని ఒప్పించి మెప్పించే’’ బ్రహ్మం చౌదరికి ఇచ్చేశారు కాబట్టి!
అందువల్ల బాపయ్య అనే కమ్మ సంఘ నేత అడిగింది ఆఫ్టరాల్ జీతం బత్తెం లేని డైరక్టరే కాబట్టి, వెంటనే ఇచ్చేస్తారని కమ్మసంఘాలు భావించాయి. కానీ ఆశ్చర్యంగా.. అసలు కమ్మవారి సంఖ్య పెద్దగా లేని.. రెడ్ల ఆధిపత్యం ఉన్న మార్కాపురం నియోజకవర్గంలోని ఒక కమ్మ నేతకు ఇవ్వడం కమ్మ సంఘాలను విస్మయపరిచింది.
కమ్మ సంఘాలతోపాటు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సిఫార్సు చేసినా పార్టీ నాయకత్వం బాపయ్య చౌదరికి కమ్మ కార్పొరేషర్ డైరక్టర్ పదవి దక్కకపోవడాన్ని కమ్మ సంఘ నాయకులు అవమానంగా భావిస్తున్నారు. ‘పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారిని గౌరవించే పద్ధతి ఇదేనా? ఇంత అమాననీయంగా వ్యవహరిస్తారని మేం అనుకోలేదు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇలా ఎప్పుడూ జరగలేద’ని కమ్మ సంఘ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు.
దానితో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు, కార్యక్రమాల కమిటీ చూసే ఉద్యోగిని కలిసి ఆరా తీయగా.. ‘మేం స్క్రూటినీ చేసి పంపించడం వరకే. మాదేం లేదు. తర్వాత అన్నీ బాబుగారే నిర్ణయం తీసుకుంటార’ని ఉన్న విషయం చెప్పేశారు.
నిజానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే, ప్రతిష్ఠాత్మక అద్దంకి సింగరకొండ ఆలయానికి బాపయ్య చౌదరిని డైరక్టరుగా నియమిస్తూ జీఓ ఇచ్చారు. అప్పుడు అద్దంకి టీడీపీ ఇన్చార్జి కరణం బలరాం. తర్వాత నాటి వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలోకి రావడంతో.. వారిద్దరి ఆధిపత్యపోరుతో, అసలు కమిటీ ప్రమాణస్వీకారమే చేయకుండా రద్దయిపోయింది. మరి మంత్రి గొట్టిపాటి నియోజకవర్గంలోనిదే ఆ ఆలయం!
* * *
ఇది దశాబ్దాల నుంచి పార్టీకి శ్రమదానం చేస్తున్న, ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లా కమ్మ సంఘం నాయకుడు పావులూరి బాపయ్య చౌదరి కథ మాత్రమే కాదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! పార్టీ అధికారంలోకి రావాలని కసితో సర్వం కోల్పోయి కొందరు.. తెగిన కాళ్లు చేతులతో ఇంకొందరు.. కుటుంబాలు, ఆస్తులు నష్టపోయి మరికొందరు.. బాబుపై అభిమానంతో- కులాభిమానంతో, వివిధ రూపాల్లో డబ్బు తగలేసి ‘కరసేవ’ చేసిన వారు ఇంకొందరు.. ఇలా జగన్ సర్కారుపై గజ్జె కట్టి పోరాడిన వేలాదిమంది బాపయ్య చౌదర్లు! ఆ కులమే కానక్కర్లేదు. ఏ కులమయినా సరే?! కానీ జరుగుతోంది మాత్రం అందరికీ ఒకటే!! అందరిదీ ఒకటే వేదన-వాదన!!!
అధికారం వస్తే తాము భుజం పుళ్లు పడేలా జెండా మోసినందుకు పార్టీ కనీస గుర్తింపు-గౌరవం లభిస్తుందన్న వెర్రి ఆశలు-భ్రమ.. తాము వెళ్లగనే బాబు-లోకేష్ పిలిచి పలకరిస్తారన్న అత్యాశ.. వారి, పీఎస్‌లు, ఓఎస్డీలు, పీఏలు,పీఆర్వోలూ వారి వద్దకు సగౌరవ ంగా సాగనంపుతారన్న అతి అంచనాలతో వెళ్లి కనీస అపాయింట్మెంట్లు.. అంటే కనీస పలకరింపునకు నోచుకోని ఇలాంటి బాపయ్య ‘కమ్మ’ని కష్టాలకు గత ఏడాదిన్నర నుంచి కొదువేలేదు.సమాజంలో చెప్పుకోవడానికి హోదా తప్ప.. ఎలాంటి ఉపయోగం లేని ఒక చిన్న డైరక్టర్ పదవి కోసం, ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటున్న వారి సంఖ్యకూ కొదవలేదు.
* * *
రాజకీయ పార్టీలంటే రోటరీ క్లబ్- లయన్స్ క్లబ్- వాసవి క్లబ్బులు కాదు సేవ చేయడానికి. కేసీఆర్ కూడా, రాజకీయపార్టీలంటే మఠాలు కాదని చెప్పుడో సూత్రీకరించారు. ఎవరైనా ప్రతిఫలం ఆశించే రాజకీయాల్లో కొనసాగుతారు. పదవులు-పలుకుబడి-సంపాదన కోసం కొందరు.. పేరు-ప్రచారం కోసం ఇంకొందరు.. ఇలా ఎవరి అవసరాల కోసం వారు పార్టీల్లో కొనసాగుతారు. మరి ఆ ప్రకారం పనిచేసిన వారు ప్రతిఫలం ఆశించడం సహజమే కదా?
అలాకాకుండా ‘అవకాశం వచ్చినప్పుడు చూద్దాం’ అని లైట్ తీసుకుంటే.. అసలైన సమయంలో వాళ్లూ అంతే లైట్ తీసుకుంటారని తెలుసుకుని, దానికి అనుగుణంగా వ్యవహరించేవారే స్థితప్రజ్ఞులు. ఇది అన్ని పార్టీలకూ వర్తించే సూత్రం!
* * *
జగన్ సీఎం అయిన తర్వాత.. అప్పటివరకూ ఏపీలో హాయిగా కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే కమ్మ సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్లు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే జగన్ గద్దె దిగి-కూటమి గద్దెనెక్కి 16 నెలలు దాటినా.. అలా వలస వెళ్లిన కమ్మ కాంట్రాక్టర్లు, వ్యాపారులు మళ్లీ అమరావతికి ఎందుకు రావడం లేదు? సీఎంఓలో ఏం జరుగుతోంది? నాటికి-నేటికి సీఎంఓలో వచ్చిన మార్పులేంటి? కీలక నేతలవద్ద కమ్మ వ్యాపారస్తులకు అపాయింట్మెంట్లు ఎందుకు లభించడం లేదు? రాజకీయం వ్యాపారం ఎలా అయింది? దానికి కారణాలేమిటో వచ్చే కథనంలో ముచ్చటించుకుందాం.