Suryaa.co.in

Political News

మహానాడు మహా జోష్ ఒకవైపు…సరిచేసుకోవాల్సిన తప్పిదాలు మరోవైపు..

మహానాడు మహాద్భుతంగా జరిగింది. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ జోష్ మరోసారి కొట్టచ్చినట్లు కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలివచ్చి, టీడీపీకి మరోసారి అధికారం ఖాయమన్న సంకేతాలు ఇచ్చారు. ఐతే మహానాడులో జరిగిన చిన్న చిన్న తప్పిదాలను అధినేత చంద్రబాబు, నాయకత్యం తెలుసుకోగలిగితే నే పార్టీ కి భవిష్యత్తు.

నేను రెండు రోజులు జరిగిన మహానాడు తీరుతెన్నులు గమనించి చేస్తున్న సూచనలు ఇవి. మహత్తరమైన మహానాడు వేదికపై ఆశీనులయిన వారిలో .. ఎవరు ముందు వరసల్లో ఉన్నారో గమనించారా? సీనియర్లు, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు వేదికపై వెనుక ఉన్నారు. వారు ఉన్నది లేనిది కూడా మీడియా గమనించలేని పరిస్థితిలో ఉన్నారు. మూడేళ్లు ముఖం చాటేసి పార్టీకి దూరంగా ఉన్నవారు, పార్టీ ఫండ్ ఇచ్చిన వ్యాపారస్థులు, వార్డ్ స్థాయి లీడర్స్ అగ్రభాగాన ఉండి హడావుడి చేయడం సభ స్థాయిని తగ్గించేలా ఉంది. ఒంగోలు పక్కనే ఉన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు మహానాడుకి హాజరు అయ్యే తీరికలేదు.

ఒక సీనియర్ మాజీ ఎమ్మెల్యే తన వయసుని పక్కన పెట్టి, తొలిరోజు ప్రతినిధుల సభకు వచ్చి ఇబ్బందిపడి వెనుతిరిగి వెళ్లిపోయారు. ప్రతినిధుల సభ నిర్వహణ సక్రమంగా లేదని విమర్శలు వచ్చాయి.
వేదిక ముందు కుర్చీలపై కుర్రకారు నిలబడి కేరింతలు కొడుతూ, ప్రతినిధుల సభకు ఆటంకంగా మారారు. వారిని అదుపు చేయడంలో వాలంటీర్స్ పూర్తిగా విఫలమయ్యారు.

భోజన ఏర్పాట్లపై ప్రచారాన్ని ఊదరగొట్టారు.తొలిరోజు ప్రతినిధుల సభకు హాజరైన వారికీ భోజనాన్ని అందించడంలో విఫలమయ్యారు.ప్రస్తుత ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లాంటి వాళ్ళకి కూడా భోజనాలు అందలేదు.మరోవైపు వేదిక కనపడేటట్టు LED స్క్రీన్స్ ఏర్పాటు చేయలేదు.

యువనేత లోకేష్ మార్క్ తో.. సామాన్య కార్యకర్తలకు వేదికపై మాట్లాడే అవకాశమంటూ చేసిన ప్రయోగం విమర్శలకు దారితీసింది. పార్టీని విమర్శించే వైసీపీపై ఎదురుదాడి చేసే నటి, పార్టీ మహిళా నేత దివ్యవాణికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా ఆమె తనకు జరిగిన అవమానంపై చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దానివల్ల నష్టం ఎవరికి అన్న ఆలోచన ఎవరైనా చేశారా? చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూలేని విధంగా, వైసీపీ లీడర్స్ కు పోటీగా బూతుపురాణాలను వేదికపై కొందరు మాట్లాడుతుంటే, చంద్రబాబు మందలించక పోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

25 ఏళ్ల వయసు ఉన్న గ్రీష్మ అనే మహిళ యువనేత మంత్రులపై చేసిన వ్యాఖ్యలు, అధికారపక్షానికి అవకాశంగా మారింది. ఆ ప్రసంగం విన్న బాబు ఆమెను శబాష్ అంటూ దీవించడం, టీడీపీ రాజకీయాల్లో తొలిసారి కొత్త వరవడి గా మారింది.

మహానాడు జరిగింది రెండు రోజులు ఐతే, లక్షల మంది జనం బహిరంగ సభకు హాజరైన రోజు లోకేష్ స్వరం మూగ పోవడం, టీడీపీ కార్యకర్తల్లో నిరాశకు దారితీసింది. మూగపోయిన గొంతుతో మాట్లాడానికి చేసిన ప్రయత్నం హేళనకు గురిచేసింది.

ఐతే చంద్రబాబు గంబీర కంఠంతో గంటలు కొద్ది చేసిన ఉపన్యాసం, మహానాడులో జోష్ కలిగించింది. నలబై శాతం యువతకు సీట్లు, మూడు సార్లు ఓడిపోతే కొత్తవారికి అవకాశం లాంటి తీర్మానాలు, పార్టీలో నూతన చర్చకు దారితీసిన సాధ్యసాధ్యాలపై పార్టీ లో అంతర్గతంగా చర్చించాలి. నిర్మాణాత్మకమైన తీర్మానాలు రాబోయే ఎన్నికల్లో పార్టీ తీసుకోవాల్సిన కీలకమైన నిర్ణయాలపై, మహానాడు లో సరియైన చర్చ జరపలేదన్న వాదన ఆ పార్టీ సీనియర్స్ నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వ లోపాలను ఎండగట్టడంలో కూడా మహానాడులో విఫలమయ్యారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తుందా? కలిసి వచ్చే పార్టీలను కలుపుకుంటుందా అనే కీలకమైన రాజకీయ పొత్తులపై మహానాడు ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం, పార్టీ శ్రేణుల్లో నిరాశ మిగిల్చింది.ఇలా అనేక లోపాలతో జోష్ తో జరిగిన మహానాడు పొలిట్ బ్యూరో పోస్ట్మార్టం అవసరమని రాజకీయ పండితులు చెబుతున్నారు.

– వాసిరెడ్డి రవిచంద్ర
సీనియర్ జర్నలిస్ట్, గుంటూరు
7673911100.

LEAVE A RESPONSE