ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయని, రాష్ట్రంలో ఆ హక్కులను కాలరాసే విధంగా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.ఒంగోలులో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ… ”మహానాడుకు వేదిక ఏర్పాటు చేసుకుంటే తిరస్కరిస్తారా? ప్రభుత్వం స్టేడియం ఇవ్వకపోతే మండువవారి పాలెంలో స్థలం ఎంపిక చేశాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సమర్థంగా పనిచేసే పార్టీ తెలుగు దేశం మాత్రమే. ఈ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండాలి. మళ్లీ ఈ రాష్ట్రానికి పూర్వస్థితి రావాలంటే టీడీపీ అధికారంలో రావాలని కోరుకుంటూ మండువవారి పాలెంలో రైతులు మహానాడు ఏర్పాటు చేసుకోవడానికి వారి స్థలాన్ని ఇచ్చారు.
రైతులు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. గతంలో మహానాడు మూడు రోజులు నిర్వహించే వాళ్లం. ఈ సారి ఎండలు అధికంగా ఉన్నాయి.. అందుకే రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నాం. 27న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 10 వేల మందితో సభ నిర్వహిస్తున్నాం. ఆ రోజు 17 తీర్మానాలు ప్రవేశ పెడతాం.
అలాగే, తదుపరి రోజు నిర్వహించే సమావేశంలో సాయంత్రం 3 గంటలకు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. అదే సమయంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభిస్తున్నాం. గ్రామాల్లో వైసీపీ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు వైసీపీ వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.