Suryaa.co.in

Telangana

శాతవాహన యూనివర్సిటీలో మహనీయుల జయంతి ఉత్సవాల సెమినార్

-మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని వారి బాటలో నడవాలి
-మహనీయులు ఫూలే, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కొమరం భీమ్
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

గిరిజన, బలహీన బడుగు వర్గాలతో పాటు దేశానికి సమాజానికి గొప్ప సేవలు అందించి ఆదర్శంగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిబా ఫూలే, బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, కొమరం భీమ్ అని, వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి బాటలో నడవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విద్యార్థులు, యువతకు పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ లో జరిగిన మహనీయుల జయంతి ఉత్సవాల కార్యక్రమంలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ నలుగురు మహనీయుల జన్మదినం నెల రోజుల వ్యవధిలోనే ఉండడం, ఆ మహనీయుల జన్మదిన ఉత్సవాలను శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు.బడుగు బలహీన వర్గాల కుటుంబంలో జన్మించిన జ్యోతిబాపూలే అసమాన ప్రతిభా పాటవాళ్ళతో దేశానికి దిక్సూచిగా మారారని వినోద్ కుమార్ అన్నారు. కేవలం వంటింటికే మహిళలను పరిమితం చేస్తున్న అప్పటి కాలంలో ఫూలే తన భార్య సావిత్రిబాయిని చదివించి, దేశానికి మొదటి టీచర్ గా తీర్చిదిద్దిన గొప్ప ఆదర్శప్రాయులు అని వినోద్ కుమార్ కొనియాడారు.

రాజ్యాంగ నిర్మాత గా మాత్రమే దేశానికి సుప్రసిద్ధులైన బిఆర్ అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త అని, అమెరికా లోని కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో పీ.హెచ్.డీ పట్టా తీసుకున్న ఏకైక భారతీయుడు అని, ‘ లా ‘ లో కూడా లండన్ యూనివర్సిటీ నుంచి పీ.హెచ్.డీ. పట్టాను కూడా తీసుకున్న ఘనత అంబేద్కర్ కు మాత్రమే దక్కుతుందని వినోద్ కుమార్ తెలిపారు. బాల్యంలోనే కుల వివక్షతను ఎదుర్కొని, విద్యార్థి దశలోనే తిరుగుబాటు తనం నేర్చుకున్న గొప్ప సామాజికవేత్త బాబు జగ్జీవన్ రామ్ అని వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బాబు జగ్జీవన్ రామ్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని వినోద్ కుమార్ తెలిపారు.

జల్, జమీన్, జంగల్ నినాదంతో అప్పటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం చేసి సమాజానికి గొప్ప పోరాట సందేశాన్ని ఇచ్చిన ఘనులు కొమరం భీమ్ అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప మహనీయులను వారి జీవిత పోరాటాలను, వారు అందించిన సందేశాన్ని విద్యార్థి లోకం, యువత ఆదర్శంగా తీసుకోవాలని, వారు సూచించిన బాటలో పయనించాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా గాని భిన్నమైన వైఖరి, ఆలోచనలు కలిగి ఉండాలని, విభిన్నమైన ఆలోచనల సంఘర్షణతో వినూత్నమైన , స్ఫూర్తిదాయక మేథో సంపత్తిలు ఉద్భవిస్తాయి అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సులర్ ప్రొ. మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్లు పద్మావతి, సరసిజ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE