Suryaa.co.in

National

కర్నల్‌ సంతోష్‌బాబుకు ‘మహావీర్‌ చక్ర’.. అందుకున్న కుటుంబసభ్యులు

న్యూ ఢిల్లీ : దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన తెలంగాణ వాసి కర్నల్‌ సంతోష్‌ బాబును కేంద్రం మహావీర్‌ చక్ర పురస్కారంతో గౌరవించింది. మరణానంతరం ఆయనకు ప్రభుత్వం మహావీర్‌ చక్ర అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సంతోష్ సతీమణి, తల్లి ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
గతేడాది జూన్‌లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి సంతోష్‌బాబు వీరమరణం పొందారు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబు 16 బిహార్‌ రెజిమెంట్‌కు కమాండింగ్ అధికారిగా వ్యవహరించారు. గల్వాన్‌ లోయ వద్ద భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చైనా బలగాలు దురాక్రమణకు యత్నించగా భారత జవాన్లు దీటుగా తొప్పికొట్టారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణల్లో సంతోష్‌బాబు సహా 21 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఆయన సేవలను స్మరిస్తూ మరణానంతరం మహావీర్‌ చక్ర పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. సంతోష్‌బాబుతో పాటు విధి నిర్వహణలో ధైర్యసాహసాలు చాటిన పలువురు జవాన్లు, వీరమరణం పొందిన అమరుల కుటుంబసభ్యులకు రాష్ట్రపతి గ్యాలంటెరీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే గల్వాన్ ఘర్షణల్లో వీరమరణం పొందిన జవాన్లు హవిల్దార్‌ కె పలానీ, సిపాయ్‌ గుర్‌తేజ్‌ సింగ్‌, నాయక్‌ దీప్‌ సింగ్‌, నాయిబ్‌ సుబేదార్‌ నుదురామ్‌ సోరెన్‌కు వీర్‌ చక్ర పురస్కారాలను ప్రకటించగా.. వారి కుటుంబసభ్యులు అవార్డులను అందుకున్నారు.

LEAVE A RESPONSE