Home » నిఘా దళపతిగా లడ్డా?

నిఘా దళపతిగా లడ్డా?

– ఐజీ స్థాయికి ఇంటలిజన్స్ చీఫ్ హోదా
– గతంలో ఐజీ హోదాలోనే పనిచేసిన శివశంకర్, మహేందర్‌రెడ్డి, మనీష్
– సిన్సియర్ అధికారిగా లడ్డాకు పేరు
– జగన్ వచ్చిన తర్వాత కేంద్ర సర్వీసుకు
– నిఘా దళపతిగా తిరిగి ఏపీకి
– తెలుగు అధికారికి అవకాశం ఇవ్వరా?
– తెలుగు అధికారి ఉంటే ఎక్కువ ఫలితాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్ సీఎం అయిన తర్వాత కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ఐజి లడ్డా తిరిగి ఏపీకి వస్తున్నారు. ఆమేరకు ప్రభుత్వం ఆయనను, ఇంటలిజన్స్ చీఫ్‌గా నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏడీజీ స్థాయిలో ఉన్న ఇంటలిజన్స్ చీఫ్ హోదాను, ఇకపై ఐజీకి తగ్గించనున్నారు.

నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో ఈ హోదాలో ఐజీలే పనిచేశారు. శివశంకర్, మహేందర్‌రెడ్డి, ఇటీవలి కాలంలో మనీష్‌కుమార్ సిన్హా తదితరులు, ఐజీ హోదాలో ఇంటలిజన్స్ బాసులుగా పనిచేశారు. ఆ తర్వాతనే వారికి ఏడీజీ పదోన్నతులు లభించాయి. ఇప్పుడు మళ్లీ ఇంటలిజన్స్ చీఫ్‌గా ఐజీ రానున్నారు.

రాజస్థాన్‌కు చెందిన లడ్డాకు సిన్సియర్ అధికారిగా పేరుంది. ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేసిన అనుభవం ఉంది. నేరస్తులపాలిట సింహస్వప్నంగా నిలిచిన రికార్డు కూడా ఉంది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగని అధికారిగా పేరుంది. అలాంటి అధికారికి ఇంటలిజన్స్ చీఫ్ పదవి ఇవ్వడం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే.. ఆ పదవికి అర్హులైన తెలుగు ఐపిఎస్ అధికారులున్నందున, వారిలో ఒకరిని ఎంపిక చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దానివల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయన్నది పోలీసు అధికారుల అభిప్రాయం. ఎందుకంటే ఇంటలిజన్స్ చీఫ్ హోదా విధులకు ఇప్పుడు అర్ధం మారింది. రాష్ట్రంలో పరిస్థితులు రాజకీయ వాతావరణంతో నిండిపోవడంతో, దానిని సునిశిత దృష్టితో పరిశీలించడం తెలుగు అధికారికే సాధ్యమవుతుందన్న అభిప్రాయం కూడా లేకపోలేదు.

ఇప్పుడు నిఘా దళపతులకు, పబ్లిక్ రిలేషన్ మెయిన్‌టెయిన్ చేయడం ప్రధానం. మీడియాతో సత్సంబంధాలున్న వారికి, సహజంగా సమాచారం ఎక్కువగా లభిస్తుంది. గతంలో ఏబీ వెంకటేశ్వరరావు ఏడీజీ హోదాలో ఇంటలిజన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు.. మీడియా ప్రతినిధుల ద్వారా ఎక్కువ సమాచారం రాబట్టి, ప్రత్యామ్నాయ చర్యలు సూచించేవారు. తెలుగువాడు కావడం ఆయనకు లాభించింది. లౌక్యం, సమయస్ఫూర్తి, సహనం, సమాచారం రాబట్టే నేర్పు.. ప్రధానంగా సీఎంకు బ్రీఫింగ్‌లో ఆయనకు నచ్చేవి చెప్పే లక్షణాలు, ఇంటలిజన్స్ చీఫ్‌కు ఉండాలి.

కొంతమంది సీఎంలు నిఘా దళపతులు చెప్పేవి వింటారు. మరికొందరు సీఎంలు ఫలానా వివరాలు కావాలని అడుగుతుంటారు. మరికొందరికి ఎంతవరకూ అవసరమో అంతే సమాచారం ఇవ్వాలి. ఇవన్నీ లౌక్యంపైనే ఆధారపడి పనిచేయాల్సి ఉంటుందని, ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి విశ్లేషించారు. లడ్డా సిన్సియర్ అధికారి అయినప్పటికీ, తెలుగువాడు కాకపోవడం, కొంత మైనస్ పాయింట్ కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply