-
టీజీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్?
-
రేవంత్ రెడ్డి ఓటూ ఆయనకే
-
బీసీలకు కాంగ్రెస్ పట్టం
-
విధేయతకు దక్కిన గౌరవం
-
పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన మహష్
-
సీనియర్లు పార్టీ మారినా కాంగ్రెస్ లోనే పయనం
-
ఎన్ఎస్ఎయుఐ ప్రెసిడెంట్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకూ కాంగ్రెస్ తోనే
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా పీసీసీ పగ్గాలు బడుగుల చేతికి అందనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎన్ఎస్ఎయుఐ నుంచి కాంగ్రెస్ తో అనుబంధం కొనసాగిస్తున్న ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు టీజీపీసీసీ అధ్యక్ష పదవి దక్కనుంది. ఆ మేరకు ఏఐసిసి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా, మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపడంతో ఆయన నియామకం లాంఛనం కానుంది.
టీజీపిసిసి అధ్యక్షుడిగా క్రమశిక్షణగల నేతగా పేరున్న మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. పీసీసీ రేసులో మరో సీనియర్ నేత మధుయాషీ, మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, బలరాం నాయక్ వంటి ప్రముఖుల పేర్లు వినిపించినప్పటికీ .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులున్న, మహేష్ కుమార్ గౌడ్ కే పీసీసీ పట్టం దక్కనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు ఏఐసీసీ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో గణనీయమైన సంఖ్యలో ఉన్న గౌడ సామాజికవర్గాన్ని మెప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. కాగా ఉమ్మడి రాష్ట్రంలో చివరి పదేళ్లలో తెలంగాణకు సంబంధించి.. డి. శ్రీనివాస్, కె.కేశవరావు, పొన్నాల లక్ష్మయ్య తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు దక్కలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి లభించింది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ బీసీలకు దక్కలేదన్న అసంతృప్తిని గుర్తించిన కాంగ్రెస్ నాయకత్వం, గౌడ సామాజికవర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గుచూపినట్లు కనిపిస్తోంది. ఆ ప్రకారంగా సీఎం పదవి రెడ్డి-పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వడం ద్వారా సామాజిక సమతుల్యం పాటించవచ్చన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.
నిజానికి మహేష్ గౌడ్ కు వివాదరహితుడు – క్రమశిక్షణగల నేతగా పేరుంది. ఎన్ఎస్ఎయుఐ దళపతిగా మహేష్ పేరు ఇప్పటికీ అందరికీ గుర్తే. పార్టీ వర్గాలను సమన్వయపరచడంలో ఆయనకు మంచి పేరుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేకమంది సీనియర్లు పార్టీ మారినప్పటికీ, మహేష్ మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని, అధికార పార్టీపై సమరం సాగించారు. గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ, పార్టీ ప్రయోజనాల కోసం త్యాగ చేసిన చరిత్ర ఆయనకు ప్లస్ పాయింట్.
తనకంటే జూనియర్లను అందలమెక్కించినప్పటికీ, మిగిలిన వారిలా ఆయన ఎప్పుడూ తన అసంతృప్తిని వెళ్లగక్కలేదు. విద్యార్థి ఉద్యమాల నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్న మహేష్ కుమార్ కు పార్టీ అధ్యక్ష పదవి లభిస్తే, తెలంగాణ బీసీ వర్గాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న గౌడవర్గానికి పెద్దపీట వేసినట్లే. ఆరకంగా ఆ సామాజికవర్గాన్ని కాంగ్రెస్ దరిచేర్చుకున్నట్లే లెక్క. ఇది రానున్న స్థానిక సంస్థలో లాభించవచ్చు. కాగా రేపో, మాపో మహేష్ పేరును ప్రకటించే
అవకాశాలున్నాయని తెలుస్తోంది.
1 COMMENTS