-సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం ఎంతో గొప్పది
-2030 నాటికి క్యాన్సర్‌కు ప్రపంచస్థాయి వైద్యం పూర్తిగా ఏపీలోనే అందుబాటులోకి
-ఆ మేరకు వసతులు పెంచుకుంటూ వెళుతున్నాం
-ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా క్యాన్సర్‌కు వైద్యం
-వచ్చే సెప్టెంబరు నాటికి వైజాగ్, కర్నూలుల్లో ప్రాంతీయ క్యాన్సర్ వైద్యాలయాలు
-ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సకు ఏటా రూ.400 కోట్లకుపైగా ఖర్చు
-నేషనల్ క్యాన్సర్ గ్రిడ్‌తో అనుసంధానమైన రాష్ట్రం కేవలం ఏపీనే
-అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో క్యాన్సర్‌కు చికిత్స అందించేలా చర్యలు
-సిఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యాలు నెరవేరేలా పనిచేయాల్సిన బాధ్యత మనదే
-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
-క్యాన్సర్ ఆస్పత్రులు, బోధనాస్పత్రుల సిబ్బంది, ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్
-పాల్గొన్న కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు పెనుమార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. క్యాన్సర్‌కు వైద్యం అందించడంలో ఏపీలో తీసుకొచ్చిన పెను మార్పులు, చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నోరి దత్తాత్రేయుడు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, టీచింగ్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రుల సిబ్బంది, టాటా క్యాన్సర్ కేర్ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తొలుత నోరి దత్రాత్రేయుడు క్యాన్సర్ వైద్యంలో ఏపీలో తీసుకొస్తున్న మార్పుల గురించి వివరించారు.
ఈ రోగానికి చికిత్సకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, లక్ష్యాలను తెలిపారు. అనంతరం మంత్రి విడదల రజిని మాట్లాడుతూ 2030 నాటికి రాష్ట్రంలోని ఏ ఒక్క రోగి కూడా క్యాన్సర్ కు వైద్యం కోసం రాష్ట్రం దాటి వెళ్లకుండా ఉండేలా తమ ప్రభుత్వం మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎంతో సంకల్పంతో పనిచేస్తున్నారని, క్యాన్సర్‌కు చికిత్స విషయంలో సమున్నత లక్ష్యాలతో పనిచేస్తున్నారన్నారు. గతంలో రాష్ట్రంలో క్యాన్సర్‌కు సరైన వైద్యం ఉండేది కాదన్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయన్నారు. క్యాన్సర్‌కు ప్రభుత్వాలు సరైన వైద్యం అందించకపోతే విలువైన ప్రాణాలు నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ ముప్పును గమనించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారన్నారు.
ఉచితంగా వైద్యం
క్యాన్సర్ రోగులకు ఎంత ఖర్చయినా సరే రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా వైద్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 400 క్యాన్సర్ ప్రొసీజర్లకు ఉచితంగా చికిత్స అందజేస్తున్నామన్నారు. ఇందుకోసం ఏటా కేవలం ఒక్క క్యాన్సర్‌కే ప్రభుత్వం ఏటా 400 కోట్లకుపైగా ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుంల్లో కేన్సర్ చికిత్సను అందించేందుకు వసతులు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. అందుకోసం ప్రభుత్వం రూ.118 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఒక్క విశాఖ లోనే పరికరాల కొనుగోలుకు రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రూ.120 కోట్లతో కర్నూలులో ప్రాంతీయ క్యాన్సర్ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. విశాఖ, కర్నూలులో ప్రాంతీయ కాన్సర్ ఆస్పత్రులు వచ్చే సెప్టెంబరు కల్లా అందుబాటులోకొస్తాయన్నారు. మరో రెండు చోట్ల కూడా ప్రాంతీయ క్యాన్సర్ ఆస్పత్రుల్ని నిర్మించేలా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక ఆస్పత్రి చొప్పున క్యాన్సర్‌కు సమగ్ర చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్న గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని ఆమె కొనియాడారు.
ప్రైవేటు ఆస్పత్రులు, ఫౌండేషన్ ల భాగస్వామ్యం పెంచండి
మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ నివారణకు రోగ నిర్థారణ, చికిత్స అందించడం ఎంతో ముఖ్యమన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్‌కు చికిత్స అందిస్తున్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు గ్రామాల్లోకే వెళ్లి క్యాన్సర్ నిర్థారణ పరీక్షలు చేసేలా చొరవచూపాలన్నారు. దీనిపై అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. గ్రేస్ ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలు క్యాన్సర్ నిర్మూలనకు ఎంతో కృషి చేస్తున్నాయని, ఆయా సంస్థలతో మాట్లాడి మరింతగా వారి సేవలు వినియోగించుకునేలా అధికారులు చొరవచూపాలని మంత్రి ఆదేశించారు. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్‌తో అనుసంధానమై సమాంతరంగా ఏపీ చాప్టర్ పేరుతో కేవలం మన రాష్ట్రం మాత్రమే క్యాన్సర్‌కు వైద్యం అందిస్తున్నదన్నారు. వైజాగ్‌లోని హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కేంద్రంగా ప్రభుత్వం ఈ కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు. ఇప్పటికే హోమీ బాబా క్యాన్సర్ కేర్ ఇన్స్టిట్యూట్తో ఉన్న ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి శిక్షణా తరగుతులు కొనసాగుతున్నాయన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది క్యాన్సర్ నిర్థారణ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహిస్తారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెట్ సిటీ స్కాన్ లను వెనువెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
దేశంలోనే మూడో రాష్ట్రం ఏపీ: డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్‌కు సంబంధించి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ క్యాన్సర్‌ను నోటిఫైబుల్ డిసీజ్‌గా ప్రకటించిన దేశంలోనే మూడో రాష్ట్రం ఏపీ అని చెప్పారు. తిరుపతిలోని బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీని రీజినల్ హబ్ గా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. పీడియాట్రిక్ అంకాలజీ సేవలు అందించే విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఉన్నదని చెప్పారు. క్యాన్సర్‌కు సమగ్రమైన చికిత్సను పూర్తి ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎంతో చిత్తశుద్ధి కనబరుస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె. నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.