Suryaa.co.in

Telangana

ఐఏఎంసీ సేవలను అందరి దరికి చేర్చండి

– కామన్వెల్త్ మెడ్-ఆర్బ్ కాన్ఫరెన్స్- 2024 సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్‌ గ్లోబల్ లీడర్‌‌గా ఎదుగుతోంది. సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ మేరకు సీఎం కామన్ వెల్త్ మెడ్-ఆర్బ్ కాన్ఫరెన్స్- 2024 సదస్సులో మాట్లాడారు. భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారింది. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి, వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే…

మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలి. అలా చేయడం వల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గలకూ ఉపయోగకరంగా ఉంటుంది. అందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌‌ నిర్వాహకులను అభినందిస్తున్నా. మీడియేషన్, ఆర్బిట్రేషన్‌ను సమన్వయం చేస్తే సమస్యలు, వివాదాలను వీలైనంత వేగంగా పరిష్కరించొచ్చు.

ఐఏఎంసీ(ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్) అనేది తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు…. దేశం మొత్తానికి ఈ సెంటర్‌‌ ఉపయోగపడుతుంది. దీనిని గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కు, సంపన్న పారిశ్రామిక వేత్తలకు మాత్రమే పరిమితం చేయొద్దు.. కామన్‌ మ్యాన్‌కు, చిన్న సంస్థలకు కూడా దీని సేవలను అందుబాటులోకి తీసుకురావాలి. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్‌లో హైదరాబాద్ నగరం ఉండటం గర్వకారణం. ఆర్బిట్రేషన్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై మరో సదస్సు నిర్వహించాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE